టైటిల్ : అతిథి దేవోభవ
నటీ,నటులు: ఆది సాయికుమార్, నువేక్ష, రోహిణి, సప్తగిరి తదితరులు
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల
దర్శకత్వం : పొలిమేర నాగేశ్వర్
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి
విడుదల తేది: జనవరి 7, 2022
‘ప్రేమ కావాలి’,‘లవ్లీ’ సినిమాల తర్వాత యంగ్ హీరో ఆది సాయికుమార్ ఖాతాలో మరో హిట్ లేదు. వరుస చిత్రాలు చేస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు ఆది. తాజాగా ఈ యంగ్ హీరో 'అతిథి దేవో భవ’ అంటూ శుక్రవారం(జవవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
అభి అలియాస్ అభయ్‌రామ్(ఆది సాయికుమార్) చిన్నప్పటి నుంచి మోనో ఫోబియాతో బాధపడుతుంటాడు. ఒంటరిగా ఉండలేదు. ఎక్కడికి వెళ్లినా తోడు ఉండాల్సిందే. ప్రతిసారి స్నేహితుడిని తోడుగా తీసుకు వస్తున్నాడని ఓ అమ్మాయి బ్రేకప్ కూడా చెబుతుంది. దీంతో తనకు ఉన్న లోపం గురించి ఎవరికి చెప్పకుండా దాచేస్తాడు. తర్వాత అతని లైఫ్‌లోకి మరో అమ్మాయి వైష్ణవి(నువేక్ష) వస్తుంది. మరి అభయ్ తన సమస్యను వైష్ణవితో చెప్పాడా?లేదా? మోనోఫోబియా వారి ప్రేమకి ఏవిధంగా అడ్డంకిగా మారింది? అభయ్ ఫ్లాట్‌కి వచ్చిన ప్రియ ఎవరు? ఆమె వల్ల తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తనకున్న భయాన్ని అభయ్ ఎలా అధిగమించాడు?అనేదే మిగతా కథ.
ఎలా చేశారంటే..?
అభయ్ పాత్రకి న్యాయం చేశాడు ఆది సాయికుమార్. నటనలో కొత్తదనం ఏమీ లేదు. వైష్ణవి పాత్రలో నువేక్ష చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తల్లిగా రోహిణి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. హీరో స్నేహితుడిగా సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇమ్మాన్యుయేట్, అదుర్స్ రఘు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఎలా ఉందంటే?
'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' సినిమాల్లో మాదిరే.. ఈ మూవీలో కూడా హీరో ఓ మాససిక రుగ్మతతో(మోనో ఫోబియా) బాధపడుతుంటాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..తెరపై చూపించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. గతంలో వచ్చిన ఆ రెండు చిత్రాలు వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించాయి. ఈ మూవీలో ఆ రెండూ లేవు. ఫస్టాఫ్ అంతా కామెడీగా నడిపించే ప్రయత్నం చేశాడు.. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. సప్తగిరితో వచ్చే కామెడీ సీన్స్ తెచ్చిపెట్టినట్లు ఉంటాయే తప్ప అంతగా హాస్యాన్ని పండించవు.
ఇక సెకండాఫ్‌లో కాసేపు థ్రిల్ ఇవ్వాలని ట్రై చేశాడు. అదీ కూడా వర్కౌట్ కాలేదు. సినిమా మొత్తం సాగదీసినట్లు ఉంటుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. సప్తగిరి డ్రంక్‌డ్రైవ్‌లో దొరికిన సీన్ కానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌తో వచ్చే సీన్ కానీ సినిమాకు అతికించినట్లు ఉంటాయే తప్ప.. పెద్దగా నవ్వించవు. క్లైమాక్స్‌లో కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇక సాంకెతిక విషయానికొస్తే.. శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన 'బాగుంటుంది నువ్వు నవ్వితే' పాట సినిమాకే హైలెట్. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment