అమెరికా టారిఫ్లతో డిఫాల్ట్ రిస్కులు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల వల్ల రుణాలకు సంబంధించిన పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని, తక్కువ రేటింగ్, స్పెక్యులేటివ్ రేటింగ్ ఉన్న కార్పొరేట్లు డిఫాల్ట్ అయ్యే రిస్కులు పెరగవచ్చని మూడీస్ రేటింగ్స్ వెల్లడించింది. గ్లోబల్ వృద్ధి నెమ్మదించి, మాంద్యం వచ్చే అవకాశాలు పెరగవచ్చని ఓ నివేదికలో వివరించింది.‘ఫైనాన్షియల్ మార్కెట్లను టారిఫ్లు షాక్కు గురిచేశాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం వచ్చే రిస్కులు పెరుగుతున్నాయి. అనిశ్చితి కొనసాగడం వల్ల వ్యాపార ప్రణాళికలకు అవరోధంగా మారుతుంది. పెట్టుబడులు నిల్చిపోతాయి. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతుంది‘ అని మూడీస్ రేటింగ్స్ తెలిపింది.టారిఫ్ల అమలుకు తాత్కాలికంగా విరామం ఇవ్వడం వల్ల వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తి, కొనుగోళ్లను సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయం లభించినప్పటికీ, 90 రోజుల తర్వాత టారిఫ్ల పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో వ్యాపార ప్రణాళికలకు సమస్యలు తలెత్తవచ్చని వివరించింది. గత నెల రోజులుగా రుణ సంబంధ పరిస్థితులు (రుణాల లభ్యత, వడ్డీ రేట్లు, రుణ గ్రహీతలు చెల్లించే సామర్థ్యాలు మొదలైనవి) గణనీయంగా దిగజారినట్లు మూడీస్ రేటింగ్స్ వివరించింది. అమెరికా జీడీపీపైనా ప్రభావం.. ఇక అమెరికా ఎకానమీ మీద కూడా టారిఫ్ల ప్రభావం ఉంటుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. అగ్రరాజ్యం జీడీపీ వృద్ధి కనీసం ఒక పర్సెంటేజీ పాయింట్ మేర తగ్గొచ్చని, అమెరికన్ వినియోగదారులు.. వ్యాపార సంస్థలకు ధరలు గణనీయంగా పెరిగిపోవచ్చని మూడీస్ తెలిపింది. టారిఫ్ల భారాన్ని నెమ్మదిగా బదలాయించినా, అంతిమంగా దాన్ని మోయాల్సింది అమెరికన్ వినియోగదారులేనని తెలిపింది.సుంకాల వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుందని, పలు సంస్థల లాభాల మార్జిన్లు పడిపోతాయని వివరించింది. అటు చైనా విషయానికొస్తే వాణిజ్య యుద్ధంపరమైన ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకానమీ మందగమనం వల్ల ఎగుమతుల రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది.ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికా–చైనా సంబంధాలు వివాదాస్పదంగానే కొనసాగవచ్చని, దీనితో వ్యాపారవర్గాలు.. వినియోగదారుల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. ఫలితంగా దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఏర్పడొచ్చని తెలిపింది.