cricket bookie
-
నిరూపిస్తే గంటలో నా పదవికి రాజీనామా చేస్తా
సాక్షి, నెల్లూరు : రాజకీయ కక్షతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే సహించేదిలేదని నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్రికెట్ బుకీలకు మద్దతుగా పోలీసులకు తాను ఫోన్ చేసివుంటే వాటి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాను ఎవరికి ఫోన్ చేశానో ఆ అధికారుల పేర్లు ఎందుకు ఎస్పీ బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కొందరు బుకీలు మంత్రులకు సన్మానాలు చేశారని, అలాగే ఫ్లెక్సీలు కూడా కట్టారని, దీనిపై ఎందుకు విచారణ చేయడం లేదని సూటిగా అడిగారు. కృష్ణ సింగ్ అనే బుకీతో తాను విజయవాడలోని ఓ హోటల్, కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఉన్నట్లు చెబుతున్నారని, అలా ఉంటే సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టాలని అడిగారు. ఒకవేళ తాను ఉన్నట్లు నిరూపిస్తే గంటలో నా పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి సవాల్ విసిరారు. -
ఐదుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
నంద్యాల: భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన టీ20 సిరీస్ మూడో మ్యాచ్ సందర్భంగా.. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 5 మంది క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
తాడిపత్రిలో క్రికెట్ బుకీ అరెస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో క్రికెట్ బుకీని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 1.30 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెట్ బుకీ హత్య కేసులో కీలక నిందితుడి అరెస్టు
అమలాపురం(తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన ఆక్వా రైతు, క్రికెట్ బుకీ కుచ్చర్లపాటి వెంకట సత్యనారాయణరాజు(సత్తిబాబు రాజు) కిడ్నాప్, హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు సాగిరాజు అప్పల త్రినాథవర్మ(రఘు) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇతడు మూడేళ్లుగా పరారీలో ఉన్నాడు. వివరాలివీ...అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన సత్యనారాయణ రాజు 2012 ఆగస్టు 23వ తేదీన కిడ్నాపై కొద్దిరోజుల తర్వాత నల్లమల అడవుల్లో హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కీలక నిందితుడైన ఐ.పోలవరానికి చెందిన అప్పల త్రినాథవర్మ మాత్రం పరారీలో ఉన్నాడు. క్రికెట్ బుకీగా వ్యవహరించిన త్రినాథవర్మకు అప్పట్లో హైదరాబాద్‌లో ఉండే సత్యనారాయణరాజుతో సత్సంబంధాలు ఉండేవి. అయితే, క్రికెట్ బుకీగా తీవ్రంగా నష్టపోయిన సత్యనారాయణ రాజుతో త్రినాథవర్మకు విభేదాలు తలెత్తాయి. అనంతరం సత్యనారాయణ రాజు తన మకాంను హైదరాబాద్ నుంచి అమలాపురానికి మార్చి, ఆక్వా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే త్రినాథవర్మ మాత్రం ఆయనతో విభేదాలను మనసులో ఉంచుకుని తన మనుషుల సాయంతో అతడిని కిడ్నాప్ చేశాడు. కారులో తొలుత నల్లగొండ జిల్లా సూర్యాపేటకు, అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆమ్రాబాద్ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతానికి తరలించారు. ఈక్రమంలోనే అతని ఏటీఎం కార్డు నుంచి రూ.5 లక్షలకు పైగా డ్రా చేశారు. కారులోనే సత్యనారాయణరాజుకు మత్తుమందు ఇచ్చి, గొంతు నులిమి చంపేశారు. అనంతరం నల్లమలలో మృతదేహాన్ని దహనం చేశారు. ఈ సంఘటనతో సంబంధమున్న ఐదుగురిని అరెస్టు చేసిన అమలాపురం పోలీసులు...త్రినాథవర్మ కోసం గాలిస్తున్నారు. అయితే, ఇటీవల ఒక కేసు విషయమై ఇటీవల హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అమలాపురం పోలీసులు పీటీ వారెంట్‌ను సమర్పించి వర్మను సోమవారం తమ కస్టడీలోకి తీసుకుని, అతని నుంచి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సత్యనారాయణరాజు కిడ్నాప్, హత్య కేసు చిక్కుముడి వీడినట్లయింది.