అమలాపురం(తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన ఆక్వా రైతు, క్రికెట్ బుకీ కుచ్చర్లపాటి వెంకట సత్యనారాయణరాజు(సత్తిబాబు రాజు) కిడ్నాప్, హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు సాగిరాజు అప్పల త్రినాథవర్మ(రఘు) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇతడు మూడేళ్లుగా పరారీలో ఉన్నాడు. వివరాలివీ...అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన సత్యనారాయణ రాజు 2012 ఆగస్టు 23వ తేదీన కిడ్నాపై కొద్దిరోజుల తర్వాత నల్లమల అడవుల్లో హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కీలక నిందితుడైన ఐ.పోలవరానికి చెందిన అప్పల త్రినాథవర్మ మాత్రం పరారీలో ఉన్నాడు. క్రికెట్ బుకీగా వ్యవహరించిన త్రినాథవర్మకు అప్పట్లో హైదరాబాద్‌లో ఉండే సత్యనారాయణరాజుతో సత్సంబంధాలు ఉండేవి. అయితే, క్రికెట్ బుకీగా తీవ్రంగా నష్టపోయిన సత్యనారాయణ రాజుతో త్రినాథవర్మకు విభేదాలు తలెత్తాయి. అనంతరం సత్యనారాయణ రాజు తన మకాంను హైదరాబాద్ నుంచి అమలాపురానికి మార్చి, ఆక్వా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే త్రినాథవర్మ మాత్రం ఆయనతో విభేదాలను మనసులో ఉంచుకుని తన మనుషుల సాయంతో అతడిని కిడ్నాప్ చేశాడు. కారులో తొలుత నల్లగొండ జిల్లా సూర్యాపేటకు, అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆమ్రాబాద్ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతానికి తరలించారు. ఈక్రమంలోనే అతని ఏటీఎం కార్డు నుంచి రూ.5 లక్షలకు పైగా డ్రా చేశారు. కారులోనే సత్యనారాయణరాజుకు మత్తుమందు ఇచ్చి, గొంతు నులిమి చంపేశారు. అనంతరం నల్లమలలో మృతదేహాన్ని దహనం చేశారు. ఈ సంఘటనతో సంబంధమున్న ఐదుగురిని అరెస్టు చేసిన అమలాపురం పోలీసులు...త్రినాథవర్మ కోసం గాలిస్తున్నారు. అయితే, ఇటీవల ఒక కేసు విషయమై ఇటీవల హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అమలాపురం పోలీసులు పీటీ వారెంట్‌ను సమర్పించి వర్మను సోమవారం తమ కస్టడీలోకి తీసుకుని, అతని నుంచి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సత్యనారాయణరాజు కిడ్నాప్, హత్య కేసు చిక్కుముడి వీడినట్లయింది.