Cricket Club of India
-
భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే కన్నుమూత
ముంబై: భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1952–53 మధ్య కాలంలో ఓపెనర్‌గా 7 టెస్టులు ఆడిన ఆప్టే 49.27 సగటుతో 542 పరుగులు చేశారు. వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 163 పరుగులు చేసి భారత్‌ను ఓటమి నుంచి తప్పించడం ఆయన అత్యుత్తమ ప్రదర్శన. ఈ సిరీస్‌లో విశేషంగా రాణించినా ఆ తర్వాత ఆప్టే మరో టెస్టు ఆడలేకపోయారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 67 మ్యాచ్‌లలో ఆయన 38.79 సగటుతో 3336 పరుగులు సాధించారు. 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ముంబైలోని ప్రఖ్యాత ‘కంగా లీగ్’ పోటీల్లో మాధవ్ ఆప్టే ఆడటం విశేషం! ‘క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా’కు అధ్యక్షుడిగా పని చేసిన ఆప్టే... 14 ఏళ్ల వయస్సులోనే సచిన్ టెండూల్కర్ ప్రతిభను గుర్తించి పట్టుబట్టి మరీ తమ క్లబ్ తరఫున ఆడే అవకాశం కల్పించారు. త్వరలోనే ఇతను భారత్‌కు ఆడతాడంటూ భవిష్యత్తును చెప్పారు. ఆప్టే మృతి సందర్భంగా దీనిని గుర్తు చేసుకున్న సచిన్... ఆయనకు తన తరఫు నుంచి నివాళులు అర్పించాడు. -
లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కపిల్
ముంబై: విఖ్యాత ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు చెందిన ‘లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్’లో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈమేరకు భారత మాజీ ఆటగాళ్లు సునీల్ గావస్కర్, నారీ కాంట్రాక్టర్, అజిత్ వాడేకర్ సమక్షంలో కపిల్ జ్ఞాపికను అందుకున్నారు. లెజెండ్స్ క్లబ్ అధ్యక్షుడు మాధవ్ ఆప్టే దీన్ని బహూకరించారు. గావస్కర్ కూడా వాడేకర్ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నారు. తమ చండీగఢ్‌లో టర్ఫ్ వికెట్లు కూడా ఉండేవి కావని, శిక్షణ ఇచ్చేందుకు కూడా ఎవరూ ఉండేవారు కాదని కపిల్ గుర్తుచేసుకున్నారు. కానీ ముంబైలో ఆధునిక శిక్షణ దొరికేదని చెప్పారు. ఇక కపిల్‌తో కలిసి ఒకే జట్టులో ఆడడం తనకు దక్కిన గౌరవంగా గావస్కర్ చెప్పుకొచ్చారు. -
ఒకే ఫార్మాట్లో ఆడటం కష్టం
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముంబై : టెన్నిస్ డబుల్స్ విభాగంలో ఆడడం శారీరకంగా అనుకూలంగానే ఉన్నా మానసికం గా చాలా కష్టంగా ఉంటుందని సానియా మీర్జా అభిప్రాయపడింది. ఆదివారం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో సానియాకు గౌరవ జీవితకాల సభ్యత్వం ఇచ్చారు. ‘నేను ప్రస్తుతం ఒక ఫార్మాట్లోనే ఆడుతున్నాను. ఇది నా శరీరానికి సులువుగా ఉంది. కానీ మానసికపరంగా చాలా కష్టపడుతున్నాను. ఏడాదిలో 25 వారాలపాటు ఆట గురించే ఆలోచించడం సులువు కాదు. ఇప్పటికే ఈ సంవత్సరం 60 మ్యాచ్‌లు ఆడాను. మార్టినా హింగిస్‌తో కలిసే 50దాకా ఆడాను. ఒకరి శక్తిసామర్థ్యాలపై మరొకరికి నమ్మకముంది. నేను ప్రపంచ నంబర్‌వన్‌గా ఉంటే తను రెండో ర్యాంకులో ఉంది. అయితే ఎవరైనా అన్ని టోర్నీలూ గెలువలేరు’ అని సానియా తెలిపింది. సింగిల్స్‌లో ఎనిమిదేళ్లు ఆడానని, గాయాల కారణంగా ఆ విభాగానికి దూరమైనా అంతకన్నా గొప్ప కెరీర్ దొరికిందని పేర్కొంది. మరోవైపు డేవిస్‌కప్ ప్లే ఆఫ్‌లో భారత్ పరాజయం నిరాశపరిచిందని తెలిపింది. డబుల్స్‌లో పేస్, బోపన్న ఓటమి ఫలితాన్ని దెబ్బతీసిందని చెప్పింది. -
ఆసీస్ ప్రాక్టీస్ షురూ
ముంబై: ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు ఏకైక టి20 కోసం భారత్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆదివారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో గంటపాటు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడింది. తర్వాత తేలికపాటి కసరత్తులు చేసింది. మరో రెండు రోజుల పాటు ఇక్కడే ప్రాక్టీస్ చేసిన అనంతరం టి20 మ్యాచ్ (ఈనెల 10న) కోసం రాజ్‌కోట్‌కు బయలుదేరి వెళుతుంది. సోమవారం ఉదయం జట్టు మొత్తం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొననుంది. వెన్ను నొప్పితో జట్టుకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్థానంలో జార్జ్ బెయిలీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇది సరైన సమయం కాదు: చాపెల్ న్యూఢిల్లీ: భారత్‌తో వన్డే సిరీస్ ఆడటానికి ఇది సరైన సమయం కాదని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ విమర్శించారు. స్పిన్ ట్రాక్‌లపై బ్యాటింగ్‌లో విఫలమైతే జట్టు స్థైర్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. కేవలం డబ్బు కోసమే ఈ సిరీస్‌ను రూపొందించారని ధ్వజమెత్తారు. ‘యాషెస్‌కు ముందు భారత్‌తో వన్డే సిరీస్ ఆడటంలో అర్థం లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కేవలం డాలర్లపైనే దృష్టిపెట్టిందనడానికి ఇదే నిదర్శనం. టెస్టుల్లో ఆసీస్ జట్టు ఓటమి ఒక్క రికార్డు పుస్తకాలనే కాదు... టీమ్ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తోంది. ఇటీవల లండన్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యా. అక్కడ మాజీలందరూ మామూలు పలకరింపును పక్కనబెట్టి ఆసీస్ జట్టుకు ఏమైందనే ప్రశ్నిస్తున్నారు’ అని చాపెల్ ఆవేదన వ్యక్తం చేశారు. క్లార్క్ గైర్హాజరీతో భారత్‌ను ఎదుర్కొనే సత్తా ఆసీస్‌కు లేదని చెప్పారు.