
ఆసీస్ ప్రాక్టీస్ షురూ
ముంబై: ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు ఏకైక టి20 కోసం భారత్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆదివారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో గంటపాటు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడింది. తర్వాత తేలికపాటి కసరత్తులు చేసింది. మరో రెండు రోజుల పాటు ఇక్కడే ప్రాక్టీస్ చేసిన అనంతరం టి20 మ్యాచ్ (ఈనెల 10న) కోసం రాజ్‌కోట్‌కు బయలుదేరి వెళుతుంది. సోమవారం ఉదయం జట్టు మొత్తం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొననుంది. వెన్ను నొప్పితో జట్టుకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్థానంలో జార్జ్ బెయిలీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
ఇది సరైన సమయం కాదు: చాపెల్
న్యూఢిల్లీ: భారత్‌తో వన్డే సిరీస్ ఆడటానికి ఇది సరైన సమయం కాదని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ విమర్శించారు. స్పిన్ ట్రాక్‌లపై బ్యాటింగ్‌లో విఫలమైతే జట్టు స్థైర్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. కేవలం డబ్బు కోసమే ఈ సిరీస్‌ను రూపొందించారని ధ్వజమెత్తారు.
‘యాషెస్‌కు ముందు భారత్‌తో వన్డే సిరీస్ ఆడటంలో అర్థం లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కేవలం డాలర్లపైనే దృష్టిపెట్టిందనడానికి ఇదే నిదర్శనం. టెస్టుల్లో ఆసీస్ జట్టు ఓటమి ఒక్క రికార్డు పుస్తకాలనే కాదు... టీమ్ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తోంది. ఇటీవల లండన్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యా. అక్కడ మాజీలందరూ మామూలు పలకరింపును పక్కనబెట్టి ఆసీస్ జట్టుకు ఏమైందనే ప్రశ్నిస్తున్నారు’ అని చాపెల్ ఆవేదన వ్యక్తం చేశారు. క్లార్క్ గైర్హాజరీతో భారత్‌ను ఎదుర్కొనే సత్తా ఆసీస్‌కు లేదని చెప్పారు.