
ఒకే ఫార్మాట్‌లో ఆడటం కష్టం
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
ముంబై : టెన్నిస్ డబుల్స్ విభాగంలో ఆడడం శారీరకంగా అనుకూలంగానే ఉన్నా మానసికం గా చాలా కష్టంగా ఉంటుందని సానియా మీర్జా అభిప్రాయపడింది. ఆదివారం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో సానియాకు గౌరవ జీవితకాల సభ్యత్వం ఇచ్చారు. ‘నేను ప్రస్తుతం ఒక ఫార్మాట్‌లోనే ఆడుతున్నాను. ఇది నా శరీరానికి సులువుగా ఉంది. కానీ మానసికపరంగా చాలా కష్టపడుతున్నాను. ఏడాదిలో 25 వారాలపాటు ఆట గురించే ఆలోచించడం సులువు కాదు. ఇప్పటికే ఈ సంవత్సరం 60 మ్యాచ్‌లు ఆడాను. మార్టినా హింగిస్‌తో కలిసే 50దాకా ఆడాను. ఒకరి శక్తిసామర్థ్యాలపై మరొకరికి నమ్మకముంది.
నేను ప్రపంచ నంబర్‌వన్‌గా ఉంటే తను రెండో ర్యాంకులో ఉంది. అయితే ఎవరైనా అన్ని టోర్నీలూ గెలువలేరు’ అని సానియా తెలిపింది. సింగిల్స్‌లో ఎనిమిదేళ్లు ఆడానని, గాయాల కారణంగా ఆ విభాగానికి దూరమైనా అంతకన్నా గొప్ప కెరీర్ దొరికిందని పేర్కొంది. మరోవైపు డేవిస్‌కప్ ప్లే ఆఫ్‌లో భారత్ పరాజయం నిరాశపరిచిందని తెలిపింది. డబుల్స్‌లో పేస్, బోపన్న ఓటమి ఫలితాన్ని దెబ్బతీసిందని చెప్పింది.