
లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కపిల్
ముంబై: విఖ్యాత ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు చెందిన ‘లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్’లో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈమేరకు భారత మాజీ ఆటగాళ్లు సునీల్ గావస్కర్, నారీ కాంట్రాక్టర్, అజిత్ వాడేకర్ సమక్షంలో కపిల్ జ్ఞాపికను అందుకున్నారు. లెజెండ్స్ క్లబ్ అధ్యక్షుడు మాధవ్ ఆప్టే దీన్ని బహూకరించారు. గావస్కర్ కూడా వాడేకర్ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నారు. తమ చండీగఢ్‌లో టర్ఫ్ వికెట్లు కూడా ఉండేవి కావని, శిక్షణ ఇచ్చేందుకు కూడా ఎవరూ ఉండేవారు కాదని కపిల్ గుర్తుచేసుకున్నారు. కానీ ముంబైలో ఆధునిక శిక్షణ దొరికేదని చెప్పారు. ఇక కపిల్‌తో కలిసి ఒకే జట్టులో ఆడడం తనకు దక్కిన గౌరవంగా గావస్కర్ చెప్పుకొచ్చారు.