cricket pitches
-
రూ.19 కోట్ల లగ్జరీ ఫామ్‌హౌస్,క్రికెట్ పిచ్ కూడా: విరాట్ కోహ్లీ క్లారిటీ
అటు క్రికెట్ వరల్డ్ ఇటు గ్లామర్ ప్రపంచంలోని పవర్ అండ్ స్వీట్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ కోట్లాది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. వీరు ఏం చేసినా ఫ్యాన్స్‌కు అదో సంచలనమే. తాజాగా వీరి ఫామ్ హౌస్‌లో క్రికెట్ పిచ్‌ను నిర్మించనున్నారనే వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 11, 2017న వివాహం చేసుకుని అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ విరుష్కగా ఫ్యామస్ అయ్యారు. వీరికి 2021లో ఆడబిడ్డ (వామిక) జన్మించింది. 2022లో విరుష్క జంట గణేష్ చతుర్థి శుభ సందర్భంగా విలాస వంతమైన ఆస్తిని కొనుగోలు చేశారు. అలీబాగ్‌లోని జిరాద్ సమీపంలో 8 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్నారు. దీని విలువు దాదాపు రూ. 19 కోట్ల 24 లక్షల 50 వేలు అని అంచనా. దీంతోపాటు ఈ జంటకు అత్యంత విలాసవంతమైన ఆస్తులు కూడా ఉన్నాయి ముంబై, గుర్గావ్లో రెండు లగ్జరీ భవనాలతో పాటు, కొన్ని ఇతర విలువైన ఆస్తులతో ఈ జంటది కింగ్-సైజ్ జీవితమని ఫ్యాన్స్ నమ్ముతారు. అయితే తాజా సమాచారం ప్రకారం లగ్జరీ ఫామ్‌హౌస్ నిర్మాణానికి సంబందించిన అన్ని అనుమతులు పొందిన కోహ్లీ నిర్మాణ పనులను షురూ చేశాడు. ఇటీవల (ఆదివారం) ఈ ప్రాంతాన్ని సందర్శించి నిర్మాణ పనులను పర్యవేక్షించాడట. ప్రకృతి ప్రేమికులైన విరుష్క జంట విలువైన ఇన్పుట్లు ఇస్తున్నారట. చక్కటి నిర్మాణ శైలి, పచ్చదనంతో నిండి వుండేలా దీని నిర్మాణాన్ని తీర్చిదిద్దాలని ఆర్కిటెక్ట్‌కి సూచించారట. రియల్ ఎస్టేట్ కంపెనీ సమీరా హాబిటాట్స్ ద్వారా సేకరించిన భూమిలో ఉదయన్ మజుందార్ అండ్ బ్లాంకా బ్రేవో రేయిస్ ఆధ్వర్యంలో ఈ విలాసవంతమైన ఫామ్‌హౌస్ సిద్ధమవుతోంది. మాండ్వా జెట్టీకి కేవలం 10 నిమిషాల దూరంలో అలీబాగ్‌లోని ఆవాస్ గ్రామంలోని 4BHK విల్లా, ఇది విల్లాలో నాలుగు బెడ్రూమ్లు, రెండు కవర్ కార్ గ్యారేజీలు, పౌడర్ రూమ్‌లతో నాలుగు బాత్రూమ్లు, టెర్రస్, అవుట్డోర్ డైనింగ్, ఒక ప్రైవేట్ పూల్, చాలా అవుట్డోర్ ఓపెన్ స్పేస్, స్టాఫ్ క్వార్టర్స్ తోపాటు ముఖ్యంగా కోహ్లీ మేరకు ఈ ప్రాంగణంలోనే క్రికెట్ పిచ్ కూడా ఏర్పాటు చేయనున్నారట. సో.. అతను కావాలనుకున్నపుడు క్రికెట్ ప్రాక్టీస్ చేయవచ్చు లేదా ఫ్రెండ్స్ వచ్చినపుడు సరదాగా ఆడుకోవచ్చునేది ప్లాన్.అయితే ఇటీవల సోషల్ మీడియా ఎండార్స్మెంట్ల వార్తలపై స్పందించిన ఈ స్టార్ క్రికెటర్ తాజా ఊహాగానాలపై కూడా స్పందించారు. అయితే ఈ వార్తలను విరాట్ కోహ్లీ ఇన్‌స్టా స్టోరీలో కొట్టి పారేశారు. -
టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్‌లు..
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023 మెగా సమరానికి మరో 99 రోజుల కౌంట్‌డౌన్ మిగిలి ఉంది. నాలుగోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న టీమిండియా పెవరెట్‌గా కనిపిస్తోంది. పుష్కరకాలం కిందట ధోని సేన స్వదేశంలో ప్రపంచకప్‌ను కొట్టి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. తాజాగా మరోసారి వరల్డ్‌కప్‌కు మన దేశం ఆతిథ్యం ఇస్తుండడంతో రోహిత్ సేన ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మంగళవారం ఐసీసీ.. వరల్డ్‌కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం పది వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరంలో 48 లీగ్ మ్యాచ్‌లు సహా రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ జరగనుంది. మొదటి సెమీఫైనల్‌కు ముంబై.. రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా.. ఇక ప్రతిష్టాత్మక ఫైనల్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక టీమిండియా తొమ్మిది వేదికల్లో(హైదరాబాద్ మినహా) వివిధ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు ఆడేందుకు దేశం మొత్తం మీద ప్రధాన నగరాల్లో దాదాపు పదివేల కిలోమీటర్లు(9700 కిమీ) ప్రయాణం చేయనుంది. ఇందులో చిన్నజట్లతో మ్యాచ్‌లు మినహాయిస్తే భారత్ ఎదుర్కొనే ఐదు ప్రధాన ప్రత్యర్థులు, ఎక్కడ మ్యాచ్ ఆడుతుందనేది ఒకసారి పరిశీలిద్దాం. ఐదు ప్రధాన జట్లతో ఆడబోతున్న మ్యాచ్‌ల్లో పిచ్‌లు టీమిండియాకు అనుకూలంగా ఉండేలా తయారు చేస్తున్నారు. అదే సమయంలో ఒక్కో జట్టుకు ఒక్కో పిచ్‌ను రూపొందించనుండడం విశేషం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(అక్టోబర్ 8, చెన్నై వేదికగా) ఈ మెగా సమరంలో టీమిండియా ఆడబోయే తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిగా బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. అప్పటికి చలికాలం సీజన్ ప్రారంభం అవుతుంది. రెండో బ్యాటింగ్ సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే చాన్స్ ఉండడంతో ఇక్కడ ఏ జట్టైనా తొలి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపుతుంది. దీన్నిబట్టి చెన్నై పిచ్ కాస్త స్లగిష్గా ఉండే అవకాశముంది. ఇక 1987 నుంచి టీమిండియా చిదంబరం స్టేడియంలో 14 మ్యాచ్‌లాడి ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇందులో నాలుగు విజయాలు ఈ దశాబ్దంలో వచ్చినవే. గతేడాది ఇక్కడ జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. ఇక స్టేడియంలో పలు మార్పులు చేస్తున్నారు. స్టేడియం ఫ్లడ్‌లైట్స్‌ను ఎల్ఈడీ వెలుగులతో నింపుతున్నారు. ఇక మ్యాచ్‌కు రెండు ఎర్రమట్టి పిచ్‌లను తయారు చేస్తున్నారు. తుది దశ పనులు జరుగుతున్నాయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్(అక్టోబర్ 15, అహ్మదాబాద్) వరల్డ్‌కప్‌లో అన్ని మ్యాచ్‌లు ఒక ఎత్తయితే.. ఈ ఒక్క మ్యాచ్ మరొక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. లక్షా 30వేల మంది కెపాసిటీ కలిగిన ఈ స్టేడియంలో భారత్, పాక్ జరిగే రోజున స్టేడియం సామర్థ్యానికి మించి జనం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు టీఆర్పీ రేటింగ్‌లు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరుదేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిదనేది ఆసక్తిగా మారింది. ఇక పిచ్‌ను ప్లాట్‌గా రూపొందిచే ప్రక్రియలో ఉన్నారు. ఎందుకంటే మ్యాచ్‌లో పరుగుల వర్షం రావాలని.. బ్యాటింగ్‌కు అనుకూలించేలా పిచ్‌ను తయారు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్రమోదీ స్టేడియం స్పిన్నర్లకు అనువుగా ఉంటుంది. అయితే ఈసారి ఎర్రమట్టి బదులు నల్లమట్టిని పిచ్‌కు వాడనున్నారు. దీంతో కాస్త లోబౌన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఎక్కువమేరకు ప్లాట్‌గానే రూపొందించనున్నారు. అంటే చిరకాల ప్రత్యర్థుల పోరులో పరుగుల సునామీని చూసే అవకాశం ఉంటుంది. 1984 నుంచి టీమిండియా ఇక్కడ 18 మ్యాచ్‌లు ఆడితే 10 విజయాలు సాధించింది. 2021లో ఈ స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు మార్చారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్(అక్టోబర్ 22, ధర్మశాల) దేశంలో అతిచిన్న స్టేడియాల్లో ధర్మశాల ఒకటిగా ఉంది. ఇక్కడి బౌండరీ లైన్ చాలా దగ్గర్లో ఉంటుంది. ఇక్కడి పిచ్ పేసర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే న్యూజిలాండ్‌తో ఆడబోయే మ్యాచ్‌కు నల్లమట్టిని ఉపయోగించి పిచ్‌ను రూపొందించనున్నారు. బ్యాటింగ్ ట్రాక్‌కు అనుకూలమైనప్పటికి మ్యాచ్ రోజు ఎండ ఉంటే పరుగులు బాగానే వస్తాయి. ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే మాత్రం రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవు. అందుకే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం. మన దేశంలో కొత్త స్టేడియాల్లో ఒకటిగా ఉన్న ధర్మశాలలో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడితే రెండు గెలిచి.. రెండింట ఓడింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్(అక్టోబర్ 29, లక్నో) ఐపీఎల్ సమయంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో పెద్దగా పరుగుల వరద పారింది లేదు. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్పిన్ ట్రాక్నే కంటిన్యూ చేయనున్నారు. ఇక్కడ టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించారు. మ్యాచ్‌లో ప్రొటీస్ ఓడిపోయింది. ఇక్కడి పిచ్ ప్రభావం కారణంగా జట్లు స్కోర్లు 250 నుంచి 270 మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పిచ్‌పై నల్లమట్టిని ఉపయోగించనున్నారు. ఎక్కువగా స్పిన్నర్లు ప్రభావం చూపించే మ్యాచ్‌లో పేసర్లకు అనువైన బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా(నవంబర్ 5, కోల్‌కతా) అహ్మదాబాద్ తర్వాత కెపాసిటీలో, స్టేడియం సామర్థ్యంలో రెండో అతిపెద్ద స్టేడియం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మెగాటోర్నీలు ఎప్పుడు జరిగినా నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక్కటైనా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీ. పైగా ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు సూపర్ రికార్డు ఉంది. ఆడిన 22 మ్యాచ్‌ల్లో 13 మ్యాచ్‌లు గెలిచింది. 2011 నుంచి 2017 వరకు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఆరుసార్లు గెలుపొందితే.. రెండో బ్యాటింగ్ చేసిన జట్లు ఐదుసార్లు గెలుపొందాయి. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై అటు పేసర్లకు.. ఇటు స్పిన్నర్లకు సమానపాత్ర ఉంటుంది. ఇక్కడ మంచు ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. చదవండి: వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే..? ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
IPL 2023: అర్థం కాని పిచ్‌లు.. పరుగుల వర్షం కష్టమేనట!
ఐపీఎల్(IPL 2023) అంటేనే పరుగుల వర్షానికి పెట్టింది పేరు. సింగిల్స్ వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్లు వస్తుంటాయి. ఐపీఎల్ ముగిసే సమయానికి బౌండరీల కౌంట్ మీటర్ రికార్డులు సృష్టించడం చూస్తుంటాం. గత 15 సీజన్లలో ఇదే తరహాలో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఆరెంజ్ క్యాప్ కోసం బ్యాటర్లు పోటీపడి పరుగులు సాధించేవారు. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్లో బ్యాటర్లకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అర్థం కాని పిచ్‌ల కారణంగా టి20 క్రికెట్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు టి20లు అంటే పరుగుల ప్రవాహం అనేవారు. కానీ కొన్నాళ్లుగా బౌలర్లు కూడా పండగ చేసుకుంటున్నారు. వరుసబెట్టి వికెట్లు తీస్తూ టి20 మ్యాచ్‌ను కాస్త టి10 మ్యాచ్‌లుగా మారుస్తున్నారు. ఇక ఇవాళ ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందా.. బ్యాటర్లకా అన్న ప్రశ్న తలెత్తింది. నిజానికి అహ్మదాబాద్ పిచ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుందంటున్నారు. ఇక్కడి పిచ్‌పై తేమ ఎక్కువగా ఉంటుండడంతో బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టుకే కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. లోస్కోరింగ్లు నమోదైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అహ్మదాబాద్ మాత్రమే కాదు.. ఐపీఎల్ మ్యాచ్‌లు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడి పిచ్‌లు ఎలా స్పందిస్తాయో ముందే చెప్పలేని స్థితి ఏర్పడింది. అయితే క్యురేటర్లు మాత్రం బ్యాటర్లు పండగ చేసుకునేలానే పిచ్‌లు రూపొందించనట్లు పేర్కొంటున్నారు.అయితే వాళ్ల మాటలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు ఇంకో కారణం ఉంది. అదే వాతావరణం సమస్య. ప్రస్తుతం క్యుములో నింబస్ మేఘాల వల్ల ఉపరితల ఆవర్తనం రోజురోజుకి మారుతూ వస్తుంది. దీంతో పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉండడం లేదని క్రీడా విశ్లేషకులు వాపోతున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఐపీఎల్ 16వ సీజన్లో బ్యాటర్ల మెరుపులు కాస్త తక్కువే ఉండొచ్చు. చదవండి: IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. -
గిరిసిగలో మణిహారం
వెంకటగిరిటౌన్: వెంకటగిరి సంస్థానాధీశుల పాలన, చేనేతల నైపుణ్యంతో వెంకటగిరి చీర అంతర్జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో వెంకటగిరిది ప్రత్యేక స్థానం. వెంకటగిరి-తిరుపతి మార్గంలో పట్టణ శివారులో పది ఎకరాల సువిశాల ప్రశాంత వాతావరణంలో ఏర్పాటైన తారకరామా క్రీడాప్రాంగణంలో అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు క్రికెట్ పిచ్‌లు రూపుదిద్దుకున్నాయి. వీటిని బుధవారం ప్రారంభించనున్నారు. 90వ దశకంలో ఏర్పాటై ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడాప్రాంగణం అభివృద్ధిలో వెంకటగిరి రాజా కుటుంబ సభ్యుల పాత్ర కీలకం. శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ క్రికెట్పోటీ ల్లో ఇండియా టీంకు మేనేజర్‌గా ఓ పర్యాయం బాధ్యతలు నిర్వహించిన వెలుగోటి సత్యప్రసాద్ యాచేంద్ర ప్రస్తుతం వెంకటగిరి క్రికెట్‌క్లబ్ అధ్యక్షుడిగా, సౌత్‌జోన్‌జట్టు పర్యవేక్షుడిగా వ్యవహరిస్తున్నారు. స్టేడియం అభివృద్ధిలో ఆయన కృషి చేశారు. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.60 లక్షల నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రెండు పిచ్‌లను తయారు చేశారు. ఆరునెలలుగా జరు గుతున్న ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేశారు. పిచ్‌లో సాధారణ స్ప్రింక్లర్లతోపాటు భూమిలోపలి నుంచి నీళ్లు వచ్చేలా స్ప్రింకర్లు ఏర్పాటు చేశారు. మైదానంలో పచ్చిక ఏర్పాటుకే రూ.6 లక్షల వరకూ ఖర్చుచేసినట్టు స్టేడియం నిర్వాహుకులు తెలి పారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రస్థాయి క్రికెట్పోటీలకు వేదిక కానుందని నిర్వాహుకులు తెలిపారు. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి రాక నేడు కొత్త పిచ్‌లను ప్రారంభించేందుకు ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు బుధవారం వెంకటగిరి రానున్నారు. ఏసీఏ డెరైక్టర్, అంతర్జాతీయ మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్కే ప్రసాద్ మంగళవారం వెంకటగిరి చేరుకున్నారు.