crockery manufacture
-
స్టీల్‌బ్యాంక్
కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని కోరుకునే సాధారణ గృహిణి తులికా సునేజా. ‘చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది, అప్పుడే భవిష్యత్ తరాల మనుగడకు ఢోకా ఉండదన్న తాపత్రయం తనది. ‘వాయు, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. వీలైనంత వరకు కాలుష్యాన్ని తగ్గిద్దాం’ అని చెప్పేవారే కానీ ఆచరించేవారు అరుదు. అందుకే కాలుష్య స్థాయుల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించడంలేదని భావించిన తులికా... పర్యావరణాన్ని కాపాడడానికి నడుం బిగించి ‘క్రోకరీ బ్యాంక్’ నడుపుతోంది. ఈ బ్యాంక్ ద్వారా డిస్పోజబుల్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కృషిచేస్తోంది. ఫరీదాబాద్‌కు చెందిన తులికా సునేజా ఓ రోజు పిల్లలతో బయటకు వెళ్లి ఇంటికి తిరిగొస్తున్నప్పుడు... రోడ్డుమీద కొంతమంది ఉచితంగా అన్నదానం చేస్తుండడం చూసింది. నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు అని సంతోష పడేలోపు.. చుట్టుపక్కల చెల్లాచెదరుగా పడి ఉన్న ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు కనిపించాయి. తులికాతో ఉన్న తన పిల్లలు ‘‘అమ్మా ఇలా ప్లాస్టిక్ పడేయడం పర్యావరణానికి మంచిది కాదు, దీనిని నియంత్రించడానికి షరిష్కారమే లేదా?’’ అని తల్లిని ప్రశ్నించారు. అప్పుడు ఆ ప్రశ్నకు తులికా దగ్గర సమాధానం లేదు. కానీ డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను నియంత్రించే మార్గాలు ఏవైనా ఉన్నాయా అని రోజుల తరబడి ఆలోచించసాగింది. కొన్నిరోజుల తర్వాత తన మదిలో మెదిలిన ఐడియానే ‘క్రోకరీ బ్యాంక్’. ఎవరికీ నమ్మకం కుదరలేదు.. తనకు వచ్చిన క్రోకరీ బ్యాంక్ ఐడియాను తన స్నేహితులతో చెప్పింది తులిక. ‘‘బ్యాంక్ ఆలోచన బావుంది కానీ ఎవరు పాటిస్తారు. బ్యాంక్ ఏర్పాటు చేయడానికి చాలా స్థలం, డబ్బులు కావాలి’’ అన్న వారే తప్ప సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన బ్యాంక్ ఆలోచన కార్యరూపం దాల్చడానికి తన భర్త సాయం తీసుకుంది. ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించడంతో.. తాను దాచుకున్న డబ్బులతో స్టీ్టల్వి.. యాభై టిఫిన్ ప్లేట్లు, యాభై స్పూన్లు, యాభై భోజనం చేసే ప్లేట్లు, యాభై గ్లాసులు కొనింది. ఇవన్నీ పదమూడు వేల రూపాయల్లోనే వచ్చేశాయి. ఈ స్టీల్ సామాన్లతో 2018లో తనింట్లోనే ‘క్రోకరీ బ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఈ బ్యాంక్ గురించి తెలిసిన కొంతమంది తమ ఇళ్లల్లో జరిగే చిన్నచిన్న ఫంక్షన్లకు ఈ సామాన్లు తీసుకెళ్లేవారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా సోషల్ మీడియాకు చేరడంతో చాలామంది ఫంక్షన్లకు ఈ ఇక్కడి నుంచే సామాన్లను తీసుకెళ్లడం మొదలు పెట్టారు. కొంతమంది పర్యావరణవేత్తలు సైతం తులికాకు మద్దతు ఇవ్వడంతో క్రోకరీ బ్యాంక్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. చిన్నాపెద్దా పుట్టినరోజు వేడుకలు, కిట్టీపార్టీలు, కొన్ని ఆర్గనైజేషన్లలో జరిగే చిన్నపాటి ఈవెంట్లకు సైతం ప్లాస్టిక్ వాడకుండా ఈ బ్యాంక్ నుంచే సామాన్లు తీసుకెళ్తున్నారు. తులికాను చూసి ఫరీదాబాద్‌లో పదికి పైగా స్టీల్ క్రోకరీ బ్యాంక్‌లు ఏర్పాటయ్యాయి. నేను చాలా చిన్నమొత్తంతో క్రోకరీ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాను. ఎవరైనా ఇలాంటి బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. నాలా మరికొంతమంది పూనుకుంటే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. దీని ద్వారా 2018నుంచి ఇప్పటిదాకా ఐదులక్షల డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను నియంత్రించగలిగాను. భవిష్యత్‌లో మరింత పెద్ద సంస్థను ఏర్పాటు చేసి భారీస్థాయిలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రిస్తాను. – తులికా -
టపాకాయల తయారీ కేంద్రంలో పేలుడు
ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు భయంతో పరుగులు తీసిన ప్రజలు అగ్నిమాపక అధికారుల సాహసంతో అదుపులోకి వచ్చిన మంటలు చిత్తూరు (క్రైమ్), న్యూస్‌లైన్: చిత్తూరు నడిబొడ్డున ఉన్న ఒక టపాకాయల తయారీ కేంద్రంలో గురువారం పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో కాపురముంటున్న కిశోర్ గాంధీరోడ్డులో లెసైన్సు కలిగిన టపాకాయల కేంద్రం నడుపుతున్నాడు. ఏడాదిగా అనధికారికంగా పలమనేరు రోడ్డులోని సొంత భవనంలో ఐదుగురు కూలీలను పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా టపాకాయలు తయారు చేసి, అమ్ముతున్నాడు. గురువారం ఖాజా(36), షబానా(28), సైదాని(40)తో నలుగురు కూలీలు టపాకాయల తయారీలో నిమగ్నమయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంట్లో నిల్వ ఉంచిన నల్లమందు వేడెక్కింది. కార్మికుని చేయి తగిలి చిన్నపాటి వస్తువు నల్లమందుపై పడడంతో పేలుడు సంభవించింది. భారీ శబ్దంతోపాటు భవనం నుంచి పొగలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. భవనంలో నుంచి ఆర్తనాదాలు వినిపించడంతో అక్కడికి చేరుకుని గాయాలపాలైన ఖాజా, షబా నా, సైదానిని బయటకు తీసి అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిత్తూరు అగ్నిమాపక అధికారి ప్రవీణ్‌కుమార్, జిల్లా అగ్నిమాపక ఉప అధికారి శ్రీనివాసరావు సిబ్బందితో కలసి అక్కడికి చేరుకుని నీటిని స్ప్రే చేశారు. కొంతవరకు మంటలు అదుపులోకి రావడంతో లోనికెళ్లే ప్రయత్నం చేశారు. అయితే డ్రమ్ముల్లో నుంచి పేలుళ్లు ఆగకపోవడంతో గంటకు పైగా శ్రమించి కెమికల్ పౌడర్ స్ప్రే చేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐ పేలుడు సంభవించిన విషయం తెలియగానే చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి, టూ టౌన్ సీఐ రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా సంభవించింది, ఎప్పటి నుంచి ఇక్కడ టపాకాయలు త యారు చేస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. భవనంలోని డ్రమ్ములు, ఇతర సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం సంఘటన జరిగిన స్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో నల్లమందు నిల్వ ఉంచి టపాకాయలు, బాణసంచా తయారు చేస్తున్న కిశోర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లెసైన్సు లేకుండా తయారు చేస్తున్నా పోలీసులు ఇంతకాలం గుర్తించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఇప్పటికైనా పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.