బాధలు వింటూ.. భరోసానిస్తూ..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏలేరు వరద ముంపుతో కుళ్లిపోయిన వరి కంకులతో కన్నీరు పెట్టుకుంటూ ఎదురొచ్చిన రైతుల కష్టాలు చూసిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. రైతుల్లో మనో ధైర్యాన్ని కల్పించారు. పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో రైతులు, బాధితులను పరామర్శించి తాను ఉన్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. బాధితులు, రైతులను జగన్ అక్కున చేర్చుకున్నారు. ఉదయం 10.30 గంటలకు పిఠాపురం వచ్చిన ఆయనకు బాధితులు, రైతులు దారి పొడవునా నిలబడి గోడు వెళ్లబోసుకొన్నారు. ‘మా పంటలు మునిగిపోయాయి. మీరే దిక్కు’ అంటూ రైతులు అడుగడుగునా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 12.45 గంటలకు ముగియాల్సిన పర్యటన సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మాధవాపురం, పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేటలో వరదలతో మునిగి ఉన్న కాలనీలను, పంటలను పరిశీలించారు. ప్రతి గ్రామంలో రెండు గంటలు పర్యటన సాగింది. భోజన విరామం కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరి బాధలను జగన్ సావధానంగా ఆలకించారు. ముంపు ప్రాంతాల్లో నీళ్లలో నడుచుకుంటూనే గ్రామాల్లో కలియదిరిగి బాధితులతో మాట్లాడారు. కళ్లెదుటే రెక్కల కష్టం గంగపాలైందని, ఇప్పట్లో తేరుకోలేమని, ప్రభుత్వం తమను ఆదుకొనే తీరులో లేదని, తమ తరఫున పోరాడాలని రైతులు మొరబెట్టుకున్నారు. నాగులపల్లి–రమణక్కపేట రహదారి మునిగిపోవడంతో వైఎస్ జగన్ ట్రాక్టర్‌పై పెదయేరు దాటి రమణక్కపేట వెళ్లారు. అక్కడి ఎస్సీ కాలనీని పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. వరద నీటిలోనే ఈదుకుంటూ వచ్చి మరీ జగన్‌కు సమస్యలు విన్నవించుకున్నారు. గతంలో అధికారులే వచ్చి పంటలు చూసి, నష్ట పరిహారం అడగకుండానే ఖాతాల్లో వేసేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ. 30 వేలు పెట్టుబడి అయిందని, పంటంతా కుళ్లిపోయిన చేతికి పైసా రాదని మాధవపురం సర్పంచి వెంకట సుబ్బారావు వైఎస్ జగన్‌కు వివరించారు. ‘మీరు సీఎంగా ఉన్నప్పుడు రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండానే బీమా వచ్చేది. వరద వచ్చిన రోజునే రూ.6,000 ఖాతాల్లో పడేవి. రైతు భరోసా కింద ఎకరానికి రూ.13,500 పడేది. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మీరే కాపాడాలి’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని వైఎస్ జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. తిన్నావా అని అడిగే వారే లేరు మూడు రోజులు వరదలో మునిగిపోయి పట్టెడన్నం కూడా లేదని, తిన్నావా అని అడిగే వారే లేరంటూ మాధవపురం సెంటర్లో గృహిణి విత్తనాల లక్ష్మి విలపించింది. వైఎస్ జగన్‌ను చూడగానే ఆమెలో దుఃఖంపెల్లుబికింది. ‘మా కాలనీని ఏలేరు వరద ముంచెత్తి ఇళ్లన్నీ నీట మునిగాయి. బయటకు రావడానిక్కూడా లేదు, మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఉన్నారా తిన్నారా అని అడిగిన వారు లేరు. చంటి పిల్లలకూ తిండి లేదు. మీరు వస్తున్నారని తెలిశాక కొండంత ధైర్యం వచ్చి0ది, మీరే దిక్కు’ అని విలపించడంతో జగన్ చలించిపోయారు. ఆమెకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పి, వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని చెప్పారు.