టెన్నిస్ కోర్ట్ లాకర్లలో కోట్ల సంపద
యశవంతపుర: బెంగళూరులోని బౌరింగ్ ఇన్స్టిట్యూట్ (టెన్నిస్ కోర్ట్) పాలకమండలి కార్యాలయంలో క్రీడాకారులు టెన్నిస్ సామగ్రి, దుస్తులు దాచుకునే లాకర్లలో రూ.100 కోట్లకు పైగా విలువైన సొత్తు బయటపడింది. ఇది బెంగళూరులో స్థిరపడిన రాజస్తానీ పారిశ్రామికవేత్త, ఫైనాన్షియర్, ప్రెస్టీజ్ కంపెనీ భాగస్వామి అయిన అవినాశ్ అమరలాల్కు చెందినదిగా గుర్తించారు. బెంగళూరులో టైర్ల షోరూంను నడుపుతున్న అవినాశ్ ఏడాది క్రితం ఇక్కడ మూడు లాకర్లను తీసుకుని వాటిల్లో రూ.3.60 కోట్ల నగదు, రూ.7.8 కోట్ల విలువైన వజ్రాలు, 650 గ్రాముల బంగారు బిస్కెట్లు, రూ.80 లక్షల విలువైన వాచీలు, రూ.100 కోట్ల ఆస్తి పత్రాలు, రూ.కోటి విలువైన చెక్కులను దాచాడు.
ఎందుకు బద్దలు కొట్టారు?
టెన్నిస్ కోర్టు అధికారులు లాకర్ గదుల నవీకరణలో భాగంగా అవినాశ్‌కు చెందిన మూడు లాకర్లను బద్దలు కొట్టి చూడగా ఈ సొత్తు బయట పడింది. విషయం బయటకు పొక్కకుండా చేస్తే రూ.5 కోట్లు ఇస్తామంటూ బౌరింగ్ క్లబ్ కార్యదర్శి ప్రకాశ్‌కు కొందరు వ్యక్తులు ఆశ చూపారు. అయితే, ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ఇది తమ పరిధిలోని విషయం కాదని ఖాకీలు చెప్పడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలిపారు. వారు వచ్చి సొత్తును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
అవినాశ్ ఎందుకు స్పందించలేదు?
పక్షం రోజుల క్రితం టెన్నిస్ కోర్టు యాజమాన్యం ఇచ్చిన నోటీసులకు అవినాశ్ స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత సొత్తును ఇక్కడే ఎందుకు దాచారనే అంశంపైన కూడా ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. అవినాశ్ అమరలాల్ ప్రెస్టీజ్ గ్రూప్‌లో భాగస్వామి. ఈయనకు ఫైనాన్షియర్‌గా బెంగళూరులో పెద్ద పేరుంది. బడా బాబులు, సంస్థలకు 30 శాతం వడ్డీపై అప్పులిచ్చేవాడు.