కోహినూర్ కాంట్రవర్సీ: హైకోర్టు కీలక ఉత్తర్వులు
'కోహినూర్ డైమండ్ ను బ్రిటిషర్లు మన దేశం నుంచి కొల్లగొట్టారని అంటున్నారు. ప్రభుత్వం మాత్రం దాన్ని ఎవ్వరూ ఎత్తుకెళ్లలేదు.. బహుమతిగా ఇచ్చాం అంటోంది. 1849లో లాహోర్ ఒప్పందంలో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి వజ్రాన్ని బహుమతిగా ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. పరిశీలించాల్సిన అంశమేమంటే..అసలు ఒక కంపెనీకి, రాజుకు మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా? అసలు అవిభాజ్య పంజాబ్ లో ఎలాంటి నిబంధనలు అమలయ్యాయి? వాటి ప్రకారం కోహినూర్ వజ్రం ఈస్ట్ ఇండియాకు ఇవ్వడం సరైందేనా? ఈస్టిండియాతో ఇక్కడి వాళ్లు ఏమేం ఒప్పందాలు చేసుకున్నారు? వీటికి సంబంధించిన సమగ్రసమాచారాన్ని మాకు ఇవ్వండి' అంటూ కోహినూర్ వజ్రం విషయంలో లాహోర్ హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.
'కోహినూర్ పాకిస్థాన్ దే..'
ప్రపంచఖ్యాతి పొందిన కోహినూర్ వజ్రం పాకిస్థాన్ కే చెందుతుందని, ప్రస్తుతం బ్రిటిష్ రాజవశస్తుల నివాసం 'టవర్ ఆఫ్ లండన్'లో ఉన్న కోహిన్ వజ్రాన్ని పాక్ కు తిరిగి తెప్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఒక వ్యక్తి లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. దానిని విచారణకు స్వీకరించిన కోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం కోర్టుకు సమాధానం ఇస్తూ.. 'లాహోర్ ఒప్పందంలో భాగంగా కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ కు బహుమానంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనికి పిటిషనర్.. దులీప్ సింగ్, ఈస్టిండియాల మధ్య జరిగిన ఒప్పందం చెల్లుబాటుకాదని వాదించారు. కామన్ వెల్త్ సభ్యుడిగా పాక్ మళ్లీ కోహినూర్ ను పొందే అవకాశం ఉంటుందని, ఆమేరకు ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు పాత ఒప్పందాలన్నింటినీ సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోహినూర్ మాదేనంటూ భారత్, పాకిస్థాన్ లేకాక ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ లు కూడా వాదిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ కోహినూర్ ప్రస్థానం..
గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనులులో ఈ ప్రఖ్యాత వజ్రం లభించింది. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తారు. తర్వాతికాలంలో కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. క్రీస్తు శకం 1310లో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. ఢిల్లీ సుల్తాన్తో సంధి చేసుకున్న సమయంలో అపార సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా సమర్పించుకున్నాడు. 1526లో ఈ వజ్రం మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ వశం అయి.. బాబర్ వజ్రంగా పేరు పొందింది.
మొఘల్ సామ్రాజ్యం ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో నాదిర్ షా దీన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అది నెరవేరలేదు గానీ దానిని చూసే భాగ్యం మాత్రమే ఆయనకు దక్కింది. నిజానికి కోహినూర్ కు ఆ పేరు (కోహ్-ఇ-నూర్ అంటే కాంతి శిఖరం) పెట్టింది కూడా నాదిర్ షాయే. 1840లో నాటి అవిభక్త పంజాబ్ లో జరిగిన సిక్కుల యుద్ధంలో తనకు సహకించినందుకుగానూ దులీప్ సింగ్ అనే రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడని కొందరు చెబుతారు. అయితే దులీప్ నుంచి ఆ వజ్రాన్ని బ్రిటిషర్లు కొట్టేశారని మరొకొందరు వాదిస్తారు. ఏదిఏమైనప్పటికీ 1913లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ద్వారా ఈ వజ్రం విక్టోరియా రాణికి బహుమతిగా వెళ్లింది. అప్పటి నుంచి లండన్లోనే ఉండిపోయిన కోహినూర్ ను తిరిగి తేలేమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పంది.