పులివెందులలో నాటుబాంబుల కలకలం
పులివెందుల: వైఎస్సార్జిల్లా పులివెందులలో నాటుబాంబుల కలకలం రేగింది. స్థానిక నామాలగుండు శివాలయంలో పూజలు నిర్వహించడానికి వెళ్లిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థి వర్గీయులు బాంబులతో దాడి చేశారు. ఈ సంఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. పులివెందులకు చెందిన మొట శంకరప్ప సోమవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నామాలగుండు ఆలయంలో పూజలు నిర్వహించడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థి వర్గీయులు ఆలయ సమీపంలో అతనిపై నాటుబాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో శంకరప్పకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. శంకరప్పపై దాడి చేసిన వారు అనంతపురం జిల్లా తలుపుల మండలం ఎపిలిపల్లికి చెందిన సంజీవరాయుడు వర్గీయులని పోలీసులు అనుమానిస్తున్నారు.