csp
-
మాత్రలు మింగి సీఎస్పీ ఆత్మహత్య
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్: తనను విధుల నుంచి తొలగించారనే మనస్తాపంతో జీరోమాస్ సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తున్న సీఎస్పీ ఒకరు మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం కొత్తగూడెం మండలంలోని సుజాతనగర్ పంచాయతీ వేపలగడ్డలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. సుజాతనగర్ పంచాయతీలోని వేపలగడ్డ గ్రామానికి చెందిన చాపల కోటమ్మ (30) 2010 సంవత్సరం ఆగస్టు 13 తేది నుంచి కొత్తగూడెం మండలంలో జీరోమాస్ సంస్థలో సీఎస్పీగా (కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్) విధులు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆమె ప్రతీ నెల ఉపాధి కూలీలకు వేతనాలు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇటీవల కూలీలకు వేతనాలు చెల్లించడంతో జాప్యం జరుగుతుండడంతో జిల్లాలో జీరోమాస్ సంస్థను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో ఆ సంస్థలో పని చేస్తున్న సీఎస్పీలను విధుల నుంచి తొలగించారు. అందులో భాగంగా తన ఉద్యోగం కూడా పోవడంతో కోటమ్మ కొద్ది రోజులుగా మనస్తాపంతో ఉంది. శనివారం ఆమె ఇంట్లో ఉన్న మాత్రలు మింగింది. స్థానికులు ఆమెను గమనించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అనాథలైన ఇద్దరు చిన్నారులు.. మృతురాలు కోటమ్మకు ఇద్దరు కుమారులు సాయి, నవీన్ ఉన్నారు. కోటమ్మ భర్త ఆరు నెలల క్రితం తలలో రక్తం గడ్డకట్టి మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి ఆమె కుమారులను పోషిస్తోంది. ప్రస్తుతం ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలిద్దరు అనాథలయ్యారు. కోటమ్మ మృతదేహానికి ఎస్సై పంచనామా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. జీరోమాస్ సంస్థ నుంచి బండ ప్రశాంత్, భారతి, సులోచన, స్వరూప, విఘేశ్వరి, లక్ష్మీకాంత, పాల్వంచ సీఎస్పీలు విజయలక్ష్మి, వెంకటరమణ, అరుణ, రోజామేరీ, గీతా, సరిత తదితరులు, వైఎస్సార్సీపీ నాయకులు కందుల సుధాకర్‌రెడ్డిలు కోటమ్మ మృతదేహాన్ని సందర్శించారు. -
పెన్షన్ టెన్షన్
బొబ్బిలి, న్యూస్‌లైన్: పింఛన్ లబ్ధిదారుల వేలిముద్రలు ఎప్పటికప్పుడు సరిపోవడం లేదంటూ బయోమెట్రిక్ యంత్రాలు తిరస్కరిస్తుండడంతో వీరంతా ఆవేదనలో ఉన్నారు. అయితే ఈ సమస్యపై పింఛన్లు పంపిణీ చేసే సంస్థలు కూడా ఏమీ చేయలేక.. ప్రతి నెలా పింఛను అందుకోలేని వారి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి. పురపాలక సంఘాల్లో పింఛన్ల పంపిణీని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఆ సంస్థలు వార్డుల్లోని పింఛనర్లను బట్టి కస్టమర్ సర్వీస్ పాయింట్ల (సీఎస్పీ)ను ఏర్పాటు చేశాయి. సుమారు వెయ్యిమంది వరకూ పింఛనర్లకు ఒక్కొక్కరూ బట్వాడా చేస్తారు. పింఛన్ల పంపిణీ బాధ్యత తీసుకు న్న ప్రైవేట్ సంస్థకు పింఛనర్ల వివరాలతో పాటు డబ్బులను ఆ సంస్థల బ్యాంకు ఖాతాల్లో డీఆర్డీఏ వేస్తుంది. పతినెలా ఒకటో తేదీ నుంచి అయిదో తేదీ వరకూ పింఛన్లు పంపిణీ చేసి ఏడో తేదీ నాటికి మిగిలిన డబ్బుల వివరాలు డీఆర్డీఏకు అందించాలి. అయితే వృద్ధులు, వికలాంగులు బయోమెట్రిక్ మిషన్లలో వేలిముద్రలను వేసిన నాటికి ఇప్పటికి తేడాలు వస్తుండడంతో పింఛన్ల పంపిణీని నిలిపివేస్తున్నారు. ప్రతి నెలా ఒక్కో పురపాలక సంఘంలో 100 నుంచి 150 మం ది వరకూ పింఛన్ అందుకోలేని వారు ఉంటున్నారు. ఇలా వరుసగా మూడు మాసాలు అందుకోకపోతే డీఆర్డీఏ అధికారులు ఆ లబ్ధిదారుల పింఛన్లను రద్దు చేస్తున్నారు. పింఛ ను అందుకుంటున్న వారు వృద్ధాప్యం వల్ల బయోమెట్రిక్ మిషన్ వద్ద వేలును సరిగ్గా ఉంచలేకపోయినా, పనుల వల్ల వేళ్లు అరిగి ముద్రలు తేడా రావడంతో సమస్యలు వస్తున్నాయి. అటువంటి వారికి వెంటనే మీ వేలిగుర్తులు నమోదు చేసుకుని పింఛను పొందగలరని రిమార్కుల్లో రాసేస్తున్నారు. ఇలా పింఛన్లను అందుకోలేని వారికి కస్టమర్ సర్వీసు పాయింట్లు నిర్వహిస్తున్న వారు వచ్చే నెల మీకు వస్తుందని నచ్చచెప్పి పంపిస్తున్నారు. పాతవారికి జూన్ నెలకు కూడా డబ్బులు రాకపోవడంతో ఈనెల నాలుగో తేదీ వచ్చినా ఇప్పటివరకూ పింఛన్ల పంపిణీకి ప్రైవేట్ సంస్థలు ముందుకురావడం లేదు. వేలి ముద్రల సమస్యల కు పరిష్కారం చూపకపోతే మేం పంపిణీ చేయలేమంటూ వారంతా మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి మొరపెట్టుకున్నారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛను రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ అందజేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరుణంలో.. లిస్టుల్లో పేర్లు లేని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా చొరవ తీసుకుని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ఈమె పేరు ఇసినికర్రల చిన్నమ్మి. బొబ్బిలి పట్టణంలోని బార్నాల వీధిలో నివాసముంటోంది. ఈమెకు మున్సిపాలిటీ నుంచి గత మూడు నెలలుగా పింఛను అందడంలేదు. ఇప్పుడేమో లిస్టులో నీ పేరు లేదని అధికారులు చెప్పడంతో మునిసిపల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో చిన్నమ్మి లాంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వందలాది మంది మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. -
పింఛన్లేవీ..
పర్చూరు, న్యూస్‌లైన్: పింఛన్ల పంపిణీలో యంత్రాంగం అలసత్వాన్ని వీడటం లేదు. జిల్లాలో ఆగస్టు నెలలో పంపిణీ చేయాల్సిన పింఛన్లు నేటికీ ఇవ్వలేదు. జూలై వరకు ఫినోకంపెనీ తరఫున గ్రామాల్లో సీఎస్పీల ద్వారా పింఛను సొమ్ము పంపిణీ చేశారు. సంబంధిత శాఖల సిబ్బందితో వారు కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ఈ ప్రక్రియను నిలిపేశారు. దీంతో ఆగస్టు నెలలో పింఛను సొమ్మును పంచాయతీ కార్యదర్శుల ద్వారా పంపిణీ చేసేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు ఎంపీడీఓల ఖాతాలకు నగదు జమ చేశారు. పంపిణీ ప్రారంభించక ముందే పాతపద్ధతిలో పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎంపీడీఓలు తమ ఖాతాలో ఉన్న సొమ్మును డీఆర్డీఏ ఖాతాకు బదలాయించారు. కానీ నేటికీ ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి జిల్లా డీఆర్డీఏ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో జిల్లాలో పింఛను కోసం 2,84,620 మంది ఎదురుచూస్తున్నారు. వీరిలో వృద్ధాప్య పింఛను అందుకునేవారు 1,61,139 మంది, చేనేత పింఛన్లు 6646 మంది, వికలాంగ పింఛన్లు 28,930 మంది, వితంతు పింఛన్లు 70,120 మంది, అభయహస్తం పింఛన్లు అందుకునేవారు 17,450 మంది ఉన్నారు. పింఛను సొమ్ము కోసం ఎంపీడీఓ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, పోస్టాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎప్పుడిస్తారనేది స్థానిక అధికారులకు కూడా తెలియని పరిస్థితి. దీంతో పింఛనుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వెంటనే పింఛన్లు అందజేయాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. సమ్మె కారణంగానే ఆలస్యం డీఆర్డీఏ ఏపీడీ: తేళ్ల రవికుమార్ ఆగస్టు నెలలో పింఛన్ల పంపిణీ కోసం సొమ్మును ఎంపీడీఓల ఖాతాలో జమచేశాం. ఎంపీడీఓలు సమ్మెలో ఉన్న కారణంగా పంపిణీ ఆలస్యమైంది. దీంతో వారి ఖాతాలోని సొమ్మును తిరిగి జిల్లా డీఆర్డీఏ ఖాతాకు జమచేశారు. ఈ ప్రక్రియ వల్ల పంపిణీ ఆలస్యమైంది. వెంటనే నగదు అందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.