పెన్షన్ టెన్షన్
బొబ్బిలి, న్యూస్‌లైన్: పింఛన్ లబ్ధిదారుల వేలిముద్రలు ఎప్పటికప్పుడు సరిపోవడం లేదంటూ బయోమెట్రిక్ యంత్రాలు తిరస్కరిస్తుండడంతో వీరంతా ఆవేదనలో ఉన్నారు. అయితే ఈ సమస్యపై పింఛన్లు పంపిణీ చేసే సంస్థలు కూడా ఏమీ చేయలేక.. ప్రతి నెలా పింఛను అందుకోలేని వారి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి. పురపాలక సంఘాల్లో పింఛన్ల పంపిణీని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఆ సంస్థలు వార్డుల్లోని పింఛనర్లను బట్టి కస్టమర్ సర్వీస్ పాయింట్ల (సీఎస్‌పీ)ను ఏర్పాటు చేశాయి. సుమారు వెయ్యిమంది వరకూ పింఛనర్లకు ఒక్కొక్కరూ బట్వాడా చేస్తారు. పింఛన్ల పంపిణీ బాధ్యత తీసుకు న్న ప్రైవేట్ సంస్థకు పింఛనర్ల వివరాలతో పాటు డబ్బులను ఆ సంస్థల బ్యాంకు ఖాతాల్లో డీఆర్‌డీఏ వేస్తుంది.
పతినెలా ఒకటో తేదీ నుంచి అయిదో తేదీ వరకూ పింఛన్లు పంపిణీ చేసి ఏడో తేదీ నాటికి మిగిలిన డబ్బుల వివరాలు డీఆర్‌డీఏకు అందించాలి. అయితే వృద్ధులు, వికలాంగులు బయోమెట్రిక్ మిషన్లలో వేలిముద్రలను వేసిన నాటికి ఇప్పటికి తేడాలు వస్తుండడంతో పింఛన్ల పంపిణీని నిలిపివేస్తున్నారు. ప్రతి నెలా ఒక్కో పురపాలక సంఘంలో 100 నుంచి 150 మం ది వరకూ పింఛన్ అందుకోలేని వారు ఉంటున్నారు. ఇలా వరుసగా మూడు మాసాలు అందుకోకపోతే డీఆర్‌డీఏ అధికారులు ఆ లబ్ధిదారుల పింఛన్లను రద్దు చేస్తున్నారు. పింఛ ను అందుకుంటున్న వారు వృద్ధాప్యం వల్ల బయోమెట్రిక్ మిషన్ వద్ద వేలును సరిగ్గా ఉంచలేకపోయినా, పనుల వల్ల వేళ్లు అరిగి ముద్రలు తేడా రావడంతో సమస్యలు వస్తున్నాయి. అటువంటి వారికి వెంటనే మీ వేలిగుర్తులు నమోదు చేసుకుని పింఛను పొందగలరని రిమార్కుల్లో రాసేస్తున్నారు.
ఇలా పింఛన్లను అందుకోలేని వారికి కస్టమర్ సర్వీసు పాయింట్లు నిర్వహిస్తున్న వారు వచ్చే నెల మీకు వస్తుందని నచ్చచెప్పి పంపిస్తున్నారు. పాతవారికి జూన్ నెలకు కూడా డబ్బులు రాకపోవడంతో ఈనెల నాలుగో తేదీ వచ్చినా ఇప్పటివరకూ పింఛన్ల పంపిణీకి ప్రైవేట్ సంస్థలు ముందుకురావడం లేదు. వేలి ముద్రల సమస్యల కు పరిష్కారం చూపకపోతే మేం పంపిణీ చేయలేమంటూ వారంతా మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి మొరపెట్టుకున్నారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛను రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ అందజేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరుణంలో.. లిస్టుల్లో పేర్లు లేని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా చొరవ తీసుకుని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
ఈమె పేరు ఇసినికర్రల చిన్నమ్మి. బొబ్బిలి పట్టణంలోని బార్నాల వీధిలో నివాసముంటోంది. ఈమెకు మున్సిపాలిటీ నుంచి గత మూడు నెలలుగా పింఛను అందడంలేదు. ఇప్పుడేమో లిస్టులో నీ పేరు లేదని అధికారులు చెప్పడంతో మునిసిపల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో చిన్నమ్మి లాంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వందలాది మంది మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.