Pension Tension
-
‘ఆసరా’ కోసం అగచాట్లు
పండుగనాడూ పెన్షన్ టెన్షన్ క్షేత్రస్థాయిలో సమర్ధంగా అమలు కాని పంపిణీ ప్రక్రియ సాంకేతిక సమస్యలు,వరుస సెలవులతో జాప్యం రాష్ర్టవ్యాప్తంగా ఇంకా 2.20 లక్షల మందికి అందని పింఛన్లు సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వచ్చినా పింఛన్లు అందడం లేదంటూ వాటిపైనే ఆధారపడిన అభాగ్యులు మథనపడుతున్నారు. సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులైన ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎలాంటి ఆసరా లేక ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతిలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఆదేశించినా రాష్ట్రంలో ఇంకా 2.20 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అలాగే తొలి విడతలో పింఛను మంజూరు కాని వారంతా మళ్లీ దరఖాస్తులు పట్టుకుని ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పింఛన్ల పథకం ‘ఆసరా’ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియకు సంబంధించిన వ్యవస్థ సమర్థంగా లేదని కూడా తెలుస్తోంది. ఓవైపు అర్హులుగా ఎంపికైన వారికే పింఛన్లను పంపిణీ చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉండగా, మరోవైపు తాము దరఖాస్తు చేసుకున్నా పింఛను రాలేదంటూ.. చాలామంది బాధితులు కొత్తగా మళ్లీ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో ఈ దరఖాస్తులు గుట్టలుగుట్టలుగా దర్శనమిస్తున్నాయి. వీటి పరిస్థితి ఎంతవరకు వచ్చిందో తెలుసుకోడానికి దరఖాస్తుదారులంతా నిత్యం ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో జిల్లాకు కనీసం 30 వేల చొప్పున రాష్ట్రమంతటా కలిపి మూడు లక్షలకుపైగా కొత్త దరఖాస్తులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విపరీతమైన పనిఒత్తిడిలో ఉన్న అధికారులు ఈ కొత్త దరఖాస్తులను పరిశీలించడానికే హడలెత్తిపోతున్నారు. కాగా, పింఛన్ల పంపిణీలో జాప్యానికి గత రెండు నెలల్లో వచ్చిన వరుస పండుగలు, ప్రభుత్వ సెలవులే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. అలాగే సాంకేతిక సమస్యలు, వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడం, లబ్ధిదారులకు పింఛను సొమ్ము(నగదు)ను నేరుగా వారి చేతికి ఇవ్వాల్సి రావడం తదితర అంశాలను కూడా పేర్కొంటున్నారు. అయితే సొమ్ము పంపిణీ సందర్భంగా పింఛను మంజూరు కాని వారితో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని కూడా వాపోతున్నారు. వచ్చే నెల నుంచి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు పింఛను సొమ్మును జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఇకపై పంపిణీలో జాప్యం ఉండకపోవచ్చునని అంటున్నారు. ఈ నెలాఖరులోగా అర్హులందరికీ పింఛన్ల పంపిణీ పూర్తి చేసి, కొత్త వాటి పరిశీలనను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు -
పెన్షన్.. టెన్షన్
ఏలూరు (టూటౌన్) : బాబు వస్తాడు.. పెన్షన్ పెంచుతాడని గంపెడాశతో ఎదురుచూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రస్తుతం ఇస్తున్నవే అసలు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్ అభయహస్తం పథకం ద్వారా జిల్లాలో 3 లక్షల 30 వేల 661 మంది ప్రతి నెలా పెన్షన్ తీసుకుంటున్నారు. వీరికి వైఎస్ హయాంలో వితంతువులకు, వృద్ధులకు రూ.200, వికలాంగులకు, వైఎస్సార్ అభయహస్తం లబ్ధిదారులకు రూ.500 చొప్పున ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ అందేది. ఇటీవల ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే వీటిని అక్టోబర్ రెండో తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించడం తెలిసిందే. అయితే పింఛన్ల పంపిణీలో జాప్యతో లబ్ధిదారులు కలవరపడుతున్నారు. గత నెల 15 నుంచి 24 వరకు పెన్షన్లను పంపిణీ చేయగా, ఈ నెలా ఇంకా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో 15వ తేదీ అనంతరమే పెన్షన్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు కొత్తగా ఆధార్ సీడింగ్‌ను అనుసంధానం చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.గతంలో వెలుగు సిబ్బంది ద్వారా పంచాయితీ కార్యాలయాల వద్ద నేరుగా అందించగా, ప్రస్తుతం పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేపట్టడంతో లబ్ధిదారులు మరిన్ని అవస్థలు పడుతున్నారు. పోస్టాఫీసులు అందుబాటులో లేనిచోట్ల కిలోమీటర్ల దూరం నడిచి పెన్షన్ తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నిధుల విడుదలలో జాప్యం వల్లే ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడం వల్లే పెన్షన్లను సకాలంలో ఇవ్వలేకపోతున్నామని డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు చెప్పారు. అలాగే ప్రభుత్వం అక్టోబర్ రెండో తేదీ నుంచి పెంచిన పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే వైఎస్సార్ అభయహస్తం పథకంపై ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత రావాల్సి ఉంద ని తెలిపారు. -
పెన్షన్ టెన్షన్
బొబ్బిలి, న్యూస్‌లైన్: పింఛన్ లబ్ధిదారుల వేలిముద్రలు ఎప్పటికప్పుడు సరిపోవడం లేదంటూ బయోమెట్రిక్ యంత్రాలు తిరస్కరిస్తుండడంతో వీరంతా ఆవేదనలో ఉన్నారు. అయితే ఈ సమస్యపై పింఛన్లు పంపిణీ చేసే సంస్థలు కూడా ఏమీ చేయలేక.. ప్రతి నెలా పింఛను అందుకోలేని వారి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి. పురపాలక సంఘాల్లో పింఛన్ల పంపిణీని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఆ సంస్థలు వార్డుల్లోని పింఛనర్లను బట్టి కస్టమర్ సర్వీస్ పాయింట్ల (సీఎస్పీ)ను ఏర్పాటు చేశాయి. సుమారు వెయ్యిమంది వరకూ పింఛనర్లకు ఒక్కొక్కరూ బట్వాడా చేస్తారు. పింఛన్ల పంపిణీ బాధ్యత తీసుకు న్న ప్రైవేట్ సంస్థకు పింఛనర్ల వివరాలతో పాటు డబ్బులను ఆ సంస్థల బ్యాంకు ఖాతాల్లో డీఆర్డీఏ వేస్తుంది. పతినెలా ఒకటో తేదీ నుంచి అయిదో తేదీ వరకూ పింఛన్లు పంపిణీ చేసి ఏడో తేదీ నాటికి మిగిలిన డబ్బుల వివరాలు డీఆర్డీఏకు అందించాలి. అయితే వృద్ధులు, వికలాంగులు బయోమెట్రిక్ మిషన్లలో వేలిముద్రలను వేసిన నాటికి ఇప్పటికి తేడాలు వస్తుండడంతో పింఛన్ల పంపిణీని నిలిపివేస్తున్నారు. ప్రతి నెలా ఒక్కో పురపాలక సంఘంలో 100 నుంచి 150 మం ది వరకూ పింఛన్ అందుకోలేని వారు ఉంటున్నారు. ఇలా వరుసగా మూడు మాసాలు అందుకోకపోతే డీఆర్డీఏ అధికారులు ఆ లబ్ధిదారుల పింఛన్లను రద్దు చేస్తున్నారు. పింఛ ను అందుకుంటున్న వారు వృద్ధాప్యం వల్ల బయోమెట్రిక్ మిషన్ వద్ద వేలును సరిగ్గా ఉంచలేకపోయినా, పనుల వల్ల వేళ్లు అరిగి ముద్రలు తేడా రావడంతో సమస్యలు వస్తున్నాయి. అటువంటి వారికి వెంటనే మీ వేలిగుర్తులు నమోదు చేసుకుని పింఛను పొందగలరని రిమార్కుల్లో రాసేస్తున్నారు. ఇలా పింఛన్లను అందుకోలేని వారికి కస్టమర్ సర్వీసు పాయింట్లు నిర్వహిస్తున్న వారు వచ్చే నెల మీకు వస్తుందని నచ్చచెప్పి పంపిస్తున్నారు. పాతవారికి జూన్ నెలకు కూడా డబ్బులు రాకపోవడంతో ఈనెల నాలుగో తేదీ వచ్చినా ఇప్పటివరకూ పింఛన్ల పంపిణీకి ప్రైవేట్ సంస్థలు ముందుకురావడం లేదు. వేలి ముద్రల సమస్యల కు పరిష్కారం చూపకపోతే మేం పంపిణీ చేయలేమంటూ వారంతా మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి మొరపెట్టుకున్నారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛను రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ అందజేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరుణంలో.. లిస్టుల్లో పేర్లు లేని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా చొరవ తీసుకుని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ఈమె పేరు ఇసినికర్రల చిన్నమ్మి. బొబ్బిలి పట్టణంలోని బార్నాల వీధిలో నివాసముంటోంది. ఈమెకు మున్సిపాలిటీ నుంచి గత మూడు నెలలుగా పింఛను అందడంలేదు. ఇప్పుడేమో లిస్టులో నీ పేరు లేదని అధికారులు చెప్పడంతో మునిసిపల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో చిన్నమ్మి లాంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వందలాది మంది మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.