‘ఆసరా’ కోసం అగచాట్లు
- పండుగనాడూ పెన్షన్ టెన్షన్
- క్షేత్రస్థాయిలో సమర్ధంగా అమలు కాని పంపిణీ ప్రక్రియ
- సాంకేతిక సమస్యలు,వరుస సెలవులతో జాప్యం
- రాష్ర్టవ్యాప్తంగా ఇంకా 2.20 లక్షల మందికి అందని పింఛన్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వచ్చినా పింఛన్లు అందడం లేదంటూ వాటిపైనే ఆధారపడిన అభాగ్యులు మథనపడుతున్నారు. సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులైన ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎలాంటి ఆసరా లేక ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతిలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఆదేశించినా రాష్ట్రంలో ఇంకా 2.20 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అలాగే తొలి విడతలో పింఛను మంజూరు కాని వారంతా మళ్లీ దరఖాస్తులు పట్టుకుని ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పింఛన్ల పథకం ‘ఆసరా’ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియకు సంబంధించిన వ్యవస్థ సమర్థంగా లేదని కూడా తెలుస్తోంది.
ఓవైపు అర్హులుగా ఎంపికైన వారికే పింఛన్లను పంపిణీ చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉండగా, మరోవైపు తాము దరఖాస్తు చేసుకున్నా పింఛను రాలేదంటూ.. చాలామంది బాధితులు కొత్తగా మళ్లీ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో ఈ దరఖాస్తులు గుట్టలుగుట్టలుగా దర్శనమిస్తున్నాయి. వీటి పరిస్థితి ఎంతవరకు వచ్చిందో తెలుసుకోడానికి దరఖాస్తుదారులంతా నిత్యం ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఒక్కో జిల్లాకు కనీసం 30 వేల చొప్పున రాష్ట్రమంతటా కలిపి మూడు లక్షలకుపైగా కొత్త దరఖాస్తులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విపరీతమైన పనిఒత్తిడిలో ఉన్న అధికారులు ఈ కొత్త దరఖాస్తులను పరిశీలించడానికే హడలెత్తిపోతున్నారు. కాగా, పింఛన్ల పంపిణీలో జాప్యానికి గత రెండు నెలల్లో వచ్చిన వరుస పండుగలు, ప్రభుత్వ సెలవులే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. అలాగే సాంకేతిక సమస్యలు, వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడం, లబ్ధిదారులకు పింఛను సొమ్ము(నగదు)ను నేరుగా వారి చేతికి ఇవ్వాల్సి రావడం తదితర అంశాలను కూడా పేర్కొంటున్నారు.
అయితే సొమ్ము పంపిణీ సందర్భంగా పింఛను మంజూరు కాని వారితో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని కూడా వాపోతున్నారు. వచ్చే నెల నుంచి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు పింఛను సొమ్మును జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఇకపై పంపిణీలో జాప్యం ఉండకపోవచ్చునని అంటున్నారు. ఈ నెలాఖరులోగా అర్హులందరికీ పింఛన్ల పంపిణీ పూర్తి చేసి, కొత్త వాటి పరిశీలనను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు