పెన్షన్.. టెన్షన్
ఏలూరు (టూటౌన్) : బాబు వస్తాడు.. పెన్షన్ పెంచుతాడని గంపెడాశతో ఎదురుచూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రస్తుతం ఇస్తున్నవే అసలు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్ అభయహస్తం పథకం ద్వారా జిల్లాలో 3 లక్షల 30 వేల 661 మంది ప్రతి నెలా పెన్షన్ తీసుకుంటున్నారు. వీరికి వైఎస్ హయాంలో వితంతువులకు, వృద్ధులకు రూ.200, వికలాంగులకు, వైఎస్సార్ అభయహస్తం లబ్ధిదారులకు రూ.500 చొప్పున ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ అందేది. ఇటీవల ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
అయితే వీటిని అక్టోబర్ రెండో తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించడం తెలిసిందే. అయితే పింఛన్ల పంపిణీలో జాప్యతో లబ్ధిదారులు కలవరపడుతున్నారు. గత నెల 15 నుంచి 24 వరకు పెన్షన్లను పంపిణీ చేయగా, ఈ నెలా ఇంకా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో 15వ తేదీ అనంతరమే పెన్షన్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు కొత్తగా ఆధార్ సీడింగ్‌ను అనుసంధానం చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.గతంలో వెలుగు సిబ్బంది ద్వారా పంచాయితీ కార్యాలయాల వద్ద నేరుగా అందించగా, ప్రస్తుతం పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేపట్టడంతో లబ్ధిదారులు మరిన్ని అవస్థలు పడుతున్నారు. పోస్టాఫీసులు అందుబాటులో లేనిచోట్ల కిలోమీటర్ల దూరం నడిచి పెన్షన్ తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
నిధుల విడుదలలో జాప్యం వల్లే
ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడం వల్లే పెన్షన్లను సకాలంలో ఇవ్వలేకపోతున్నామని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు చెప్పారు. అలాగే ప్రభుత్వం అక్టోబర్ రెండో తేదీ నుంచి పెంచిన పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే వైఎస్సార్ అభయహస్తం పథకంపై ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత రావాల్సి ఉంద ని తెలిపారు.