ఏలూరు(ఆర్‌ఆర్ పేట) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటివెంట వచ్చే ప్రతి మాటా అబద్ధమేననే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు ఎద్దేవా చేశారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది రైతులున్నారని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు రుణమాఫీ చేయాల్సి వస్తుందనే భయంతో ఇప్పుడు రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు మాత్రమే ఉన్నారని చెబుతున్నారన్నారు. అమలుకు సాధ్యంకాని వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబును ఎన్నికల కమిషన్ ప్రశ్నించగా, అందుకు తనవద్ద స్పష్టమైన విధానాలున్నాయని తెలిపారని గుర్తు చేశారు. ఆ విధానాలేమిటో ఇప్పటివరకూ ప్రకటించకపోవడం దారుణమన్నారు.
ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ను కూడా బాబు మోసం చేశాడన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కారణంగా బియ్యం కన్నా అధిక ధరకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన దుర్గతి ప్రజ లకు కలిగిందన్నారు. డ్వాక్రా మహిళలను అడ్డం పెట్టుకుని దొంగలు, దోపిడీదారులు ఇసుకను అమ్ముకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి.. ఇప్పుడు తాను ఇవ్వలేదని బుకాయిస్తున్నారని, టీడీపీ కార్యాలయ లైబ్రరీలో వెతికితే ఎన్నికల సమయంలో మాట్లాడిన అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని అన్నారు. ఈ నెల 5న నిర్వహించే ధర్నా రాజకీయ పార్టీ కార్యక్రమం కాద ని, కేవలం రైతు, మహిళా, నిరుద్యోగ, యువత కార్యక్రమమని సుబ్బారాయుడు పేర్కొన్నారు.
బాబు చెప్పే ప్రతిమాటా అబద్ధమే
Published Tue, Dec 2 2014 12:46 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement