మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే...
లక్షణాలు - పరీక్షలు
సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే సమయంలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. రాయి ఏర్పడిన తర్వాత కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. అవి...
వెన్నులో, పొత్తికడుపులో ఒక్క సారిగా అలలా కానీ, అకస్మాత్తుగా గుచ్చినట్లుగా కానీ నొప్పిరావడం.
నొప్పి వచ్చినప్పుడు ఎటు కదిలినా, దేహాన్ని ఏ స్థితిలో ఉంచినా సౌకర్యంగా అనిపించకపోవడం.
తల తిరగడం, వాంతులు కావడం,
మూత్రంలో రక్తం పడడం, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఒకవేళ యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా తోడయితే చలి, జ్వరం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పి, మూత్రం దుర్గంధపూరితంగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
పరీక్షలు
సి.టి. స్కాన్, ఇంట్రావీనస్ పైలోగ్రామ్ (ఐవిపి), అల్ట్రాసౌండ్, ఎక్స్ - రే (కిడ్నీ - యూరేటర్ - బ్లాడర్... దీనినే కెయుబి ఎక్స్రే అంటారు)లాంటివి చేయాలి.
జాగ్రత్తలు
వెన్ను, పక్కల, పొత్తికడుపు భాగంలో ఉన్నట్లుండి భరించలేనంత నొప్పి, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మూత్రంలో రక్తం పడడం వంటి లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా మూత్రపిండాల్లో రాయి ఏర్పడి ఉండవచ్చని సందేహించి డాక్టర్ను సంప్రతించాలి.