పెంపు సరే...? దక్కేదెంత...?
విజయనగరం మున్సిపాలిటీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా లో వేతనదారులకు కనీస వేతనాలు దక్కడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపమో...దిగువ స్థాయి సిబ్బంది నిర్లక్ష్య వైఖరో... కూలీల్లో అవగాహన లేకో.. తెలియదు కానీ రోజంతా కాయకష్టం చేస్తున్నా వేతనదారులకు కనీస సరైన వేతనం లభించడంలేదు. వలసలను నిరోధించి, ఉన్న ఊళ్లో పనికల్పించాలని అమలు చేస్తున్న ఈ పథకం లక్ష్యం నెరవేరడంలేదు.
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఉపాధి పనుల వేతనదారులకు సగటున రూ.102 వేతనం మాత్రమే అందుతోంది. వేతనానికి తగ్గ పనులు కల్పించడంలో అధికారులు విఫలమవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పథకంలో పని చేస్తున్న వేతనదారులకు ఇప్పటి వరకు అందిస్తున్న సగటు వేతనాన్ని రూ.149నుంచి రూ.169 వరకు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇది వేతనదారులకు పెద్దగా ఆనందం కలిగించలేదు. తాము చేసిన పనికి కిట్టుబాటు కూలి రానప్పుడు వేతనం ఎంతపెంచితే ఏం లాభమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం అమలులోపాలను సరిచేస్తేనే ప్రయోజనం ఉంటుందని వారు కోరుతున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ....
జిల్లాలో ఐదు లక్షల 31వేల మందికి జాబ్‌కార్డులు జారీ చేయగా.. అందులో వేసవి కాలంలోగరిష్టంగా మూడు లక్షల వరకు వేతనదారులు పనులకు హాజరువుతుంటారు. ప్రస్తుతం వర్షాకాలం కావడం, కాసిన్ని వ్యవసాయ పనులు అందుబాటులో ఉండడంతో 25వేల మంది వరకు వేతనదారులు పనులకు వస్తున్నారు. పనులకు వస్తున్న వేతనదారులకు సగటున రూ.102 నుంచి రూ.103 వరకు వేతనం లభిస్తోంది. ఇందులో గరిష్టంగా ఇప్పటి వరకు అమలైన రూ.149 వేతనం 10 శాతం మంది వేతనదారులకు అందుతుండగా.. రూ.60 నుంచి రూ.70 వేతనం తీసుకునే వేతనదారులు 40 శాతం వరకు ఉంటారు. అంతేకాకుండా రూ.30 నుంచి రూ.40 వేతనం అందుకునే వేతనదారులు 15 శాతం వరకు ఉంటారని అంచనా. ఈ లెక్కల మేరకు ప్రభుత్వం నిర్దేశిస్తున్న వేతనం అతి తక్కువ మందికే దక్కుతోంది.
ఇందుకు అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది మధ్య సమన్వయలోపమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. వేతనానికి సరిపడా పని కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా నిర్దిష్ట పని గంటల విషయంలో అధికారుల నుంచి స్పష్టతలేకపోవడం మరో లోపం. దీంతో వేతనదారులు పనులకు వెళుతున్నా నిర్దేశించిన మొత్తాన్ని అందుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని పలు గ్రామాలకు చెందిన వేతనదారులు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. అరకొర వేతనంతో బతుకులు వెళ్లదీయవలసిన దుస్థితి నెలకొంది. దీంతో చాలా మంది వేతనదారులు వలసబాటపడుతున్నారు.
క్యూబిక్ మీటర్ చొప్పున అధికారులు చెల్లించే రేట్లు ఇలా...
జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ రకాల పనులకు అధికారులు ఇస్తున్న వేతనం క్యూబిక్ మీటర్ చొప్పున ఇలా ఉన్నాయి. కాల్వల్లో పూడికల తొలగింపునకు మెత్తటి నేలలో రూ.59, గట్టి నేలలో రూ.68 చెల్లిస్తున్నారు. భూ అభివృద్ధి పనులకు క్యూబిక్ మీటర్ మెత్తటి నేలలో అయితే రూ.116, గట్టి నేలలో అ యితే రూ.126, చెరువు పనులకు దూరాన్ని బట్టి క్యూబిక్ మీటర్‌కు రూ. 106, రూ.126,రూ.145 చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా మొక్కలు పెంపకం లో భాగంగా అధికారులు నిర్దేశించిన మేరకు ఒక గుంత తవ్వేందుకు మె త్తటి నేలలో అయితే రూ.104, గట్టి నేలలో అయితే రూ.109 చెల్లిస్తున్నారు.