అర‘కూర’ భోజనం!
బోర్డుకే పరిమితమైన మెనూ
బొండాపల్లి పాఠశాలలో విద్యార్థులకు రుచించని వంటకాలు
స్కూలులో మౌలిక సదుపాయాల కొరత
పెదబయలు : ఆశ్రమాల్లో గిరిజన విద్యార్థులు పౌష్ఠికాహారంతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశంతో కాస్త ఖరీదైన మెనూ అమలుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అయితే మారుమూల ఆశ్రమాల్లో ఇది అమలు కావడం లేదు. మండలంలోని బొండాపల్లి గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆదివారం నాటి పరిస్థితి ఇందుకు అద్దం పట్టింది.
ఇక్కడ మెనూ ప్రకారం మధ్యాహ్నం శాఖహార బిర్యాని, బంగాళదుంప కూర, అన్నం, సాంబారు, ఉడికించిన గుడ్డు, పండు పెట్టాల్సి ఉండగా, బిర్యానీ ఊసే లేదు. బంగాళదుంప కూడా సాంబారును తలపించింది. ఇక సాంబారుకు బదులు రసం పెట్టారు. రోజూ ఇలానే రుచీపచీ లేని వంటకాలు పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. వారానికి కేవలం నాలుగు రోజులే గుడ్డు పెడుతున్నారని చెప్పారు. పైగా తరచూ విద్యార్థులు ఇక్కడ వడ్డించుకోవాల్సిన పరిస్థితులున్నాయని ఆరోపించారు.
హాస్టల్లో అన్నీ సమస్యలే!
పాఠశాలలో మూడు వారాల నుంచి విద్యుత్ సదుపాయం లేదని, కిరోసిన్ దీపాల వెలుగులోనే చదువుకుంటున్నామని, ఇన్వర్టురు కూడా పనిచేయలేదని, హెచ్ఎం అందుబాటులో ఉండడం లేద ని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉందని, బోరు నీరు వంటకు మాత్రమే సరిపోతుందని తెలిపారు. ఇక్కడున్న 180 మంది విద్యార్థులూ సమీప గెడ్డకు వెల్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నామనితెలిపారు.
సుప్రీంకోర్టు కమిటీ పర్యటిస్తున్న తరుణంలో ఈ పాఠశాలలో మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకురాలేదని పేర్కొన్నారు. కాగా చాలా ఆశ్రమాల్లో ఇదే పరిస్థితి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏ, గిరిజజన సంక్షేమాధికారులు ఏజెన్సీవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దాలని, లేకుంటా సరైన ఆహారం అందక విద్యార్థులు రక్తహీనత వంటి వ్యాధులకు గురికావాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సక్రమంగానే మెనూ
అయితే బొడాపల్లి ఆశ్రమంలో మెనూ బాగానే అమలు చేస్తున్నామని, తాను అందుబాటులోనే ఉంటున్నానని హెచ్ఎం బాలరాజు వివరణ ఇచ్చారు. మం డల ఉపగిరిజన సంక్షేమాధికారి బి. సూ ర్యనారాయణను సంప్రదించగా విచారణ నిర్వహించి తగిన చర్యలు చేపడతామని చెప్పారు.