పుష్కర కళా వేదికపై తెనాలి నాటిక
‘పరమపదం’ నాటిక ప్రదర్శనకు విద్యార్థులు సిద్ధం
వేదాద్రి, మరో 3 ఘాట్లలో ప్రదర్శనకు సన్నాహాలు
తెనాలి: పుష్కరాల్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే కళా ప్రదర్శనల్లో తెనాలి చిన్నారులకు అవకాశం లభించింది. ‘పరమపదం’ పేరుతో 50 నిమిషాల పౌరాణిక నాటిక ప్రదర్శనకు స్థానిక అమిరినేని రెయిన్బో పబ్లిక్ స్కూలు విద్యార్థులు ఎంపికయ్యారు. ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జగన్మోహనరావు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఈ నెల 19న కృష్ణా జిల్లా వేదాద్రి పుష్కరఘాట్లో, గుంటూరు జిల్లాలోని మరో 3 పుష్కర ఘాట్ల వద్ద నాటిక ప్రదర్శించనున్నారు. అమిరినేని రెయిన్బో పబ్లిక్స్కూల్, ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్– తెనాలి సంయుక్త నిర్వహణలో స్కూలు విద్యార్థులు ఈ నాటిక ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. రామాయణంలో సీతాదేవి తన తల్లి అయిన భూమాత ఒడిలోకి వెళ్లాక, శ్రీరాముడు తన అవతారం చాలించి వైకుంఠం చేరాల్సిన సమయం ఆసన్నమవుతుంది. లేదా అక్కడే ఉండి రాజ్యపాలనలో కొనసాగాల్సి ఉంటుంది. బ్రహ్మదేవుడు వర్తమానాన్ని కాల పురుషుడు శ్రీరాముడికి విన్నవిస్తాడు. దీనిపై శ్రీరాముడు వైకుంఠానికి చేరేందుకు నిర్ణయిస్తాడు. ఆయన వైకుంఠానికి చేరుకోవటమే ఈ పరమపదం నాటిక ఇతివత్తం. ఇందులో శ్రీరాముడుగా రామకృష్ణ, లక్ష్మణుడుగా మణికంఠ, కాలపురుషుడు పాత్రలో విష్ణు, దూర్వాసమునిగా కరిముల్లాతో సహా 30 మంది విద్యార్థులు నటిస్తున్నారు. కూచిపూడి నృత్యంలో ప్రతిభావంతురాలైన ఆరాధ్యుల తేజస్విప్రఖ్య రచించిన ఈ నాటికకు దర్శకత్వం లక్ష్మణశాస్త్రి. నిర్వహణ సారథ్యం ఆరాధ్యుల కన్నా, చెన్నం సుబ్బారావు. విద్యార్థులకు పురాణాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రోత్సహిస్తున్నట్టు స్కూలు డైరెక్టర్లు అమిరినేని రాజా, దొడ్డక ఆదినారాయణ, సింగయ్య చెప్పారు.