23న మరో పాతిక 'నేతాజీ' ఫైళ్ల విడుదల
న్యూఢిల్లీ: స్వాతంత్ర్యసమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్థానానికి సంబంధించిన ఫైళ్ల వెల్లడిలో కేంద్ర ప్రభుత్వం విపరీతధోరణి ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. తన దగ్గరున్న అన్ని రహస్య ఫైళ్లను బహిర్గంతం చేస్తానని ఇదివరకే ప్రకటించిన కేంద్రం.. ఆ పనిని ఒకే విడతలోకాకుండా నెలకో పాతిక ఫైళ్ల చొప్పున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. మే లే దా జూన్ లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫైళ్ల విడుదల వ్యవహారం లబ్ధి కోసమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి మనీశ్ శర్మ ఆదివారం ఢిల్లీలో మాట్లాడుతూ ఈ నెలలో నేతాజీకి సంబంధించిన మరో 25 ఫైళ్లు బహిర్గతం చేయనున్నట్లు, అందుకు ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు పేర్కొన్నారు. అయితే జనవరి 23న తొలిదఫా రహస్య ఫైళ్ల విడుదల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తదుపరి ఫైళ్లను నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా(ఎన్ఏఐ) విడుదల చేస్తుందని చెప్పారు. కాగా, ఆ ప్రకటనకు విరుద్ధంగా ప్రభుత్వమే ఫైళ్లను బహిర్గతం చేస్తానని ముందుకురావడం గమనార్హం. ప్రభుత్వం తన వద్ద ఉన్న 100 రహస్య ఫైళ్లను నాలుగు దఫాలుగా.. ప్రతినెలా 23వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.
నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని జనవరి 23న ఢిల్లీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ రహస్యఫైళ్లను జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. 16 వేల పైచిలుకు పేజీలున్న ఆ ఫైళ్లను డిజిటల్ రూపంలోనూ భద్రపరిచింది నేషనల్ ఆర్కైవ్స్ సంస్థ. భారత ప్రభుత్వం, ఇతర దేశాలు వెల్లడంచిన సమాచారాన్ని బట్టి 1945 ఆగస్ట్ 18న తైపీలో జరిగిన విమానప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు నిర్ధారణ అయింది.