cultureal
-
అపహరణకు గురైన ఇరాక్ పురాతన శాసనాన్ని తిరిగి ఇచ్చేశాం!
వాషింగ్టన్: మూడు దశాబ్దాల క్రితం అపహరణకు గురైన గిల్గమేశ్ అనే ఇరాక్ పురాణ ఇతిహస కథలకు సంబంధించిన శిలాశాసనాన్ని(టాబ్లెట్) వాషింగ్టన్ వేడుకల సందర్భంగా అమెరికా తిరిగి ఇరాక్‌కి అందజేసింది. ఈ మేరకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ ఆ టాబ్లెట్‌ని స్వీకరించారు. దీంతో ఇరాక్ సమాజం పట్ల నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించగలిగమంటూ... హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!) చిన్నపరిమాణంలో ఉన్న పురాతన రాతి శాసనం(టాబ్లెట్) అయినప్పటికీ, ఇది అత్యంత విలువైన చారిత్రక కళా సాంస్కృతిక సంపదగా హజీమ్ పేర్కొన్నార. అంతేకాదు అత్యంత పురాతన సాహిత్య రచనలలో ఒకటిగా పరిగణించే గిల్గమేశ్ ఇతిహాసానికి సంబంధించిందని చెప్పారు. ఇది అమరత్వం కోసం తపనతో ఉన్న మొసపటోమియో రాజు కథను వివరిస్తోందన్నారు. అన్నిమతాల సారాంశం ఏకేశ్వరోపాసన(ఒక్కడే దేవుడు అనే సిద్ధాంతం)ని గురించి నొక్కి చెప్పేలా ఉంటుందని యునెస్కో(ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సమితి) డైరెక్టర్ ఆండ్రీ అజౌలే అన్నారు. ఈ ఇతిహసం మానవత్వానికి నిధిగా ఆండ్రీ అజౌలే అభివర్ణించారు. ఈ రాతి శాసనాన్ని(టాబ్లెట్) తన స్వస్థానానికి చేర్చటంతో వారసత్వాన్ని నాశనం చేసే అంతర్జాతీయ సమాజంపై సాధించిన ప్రధాన విజయంగా ఆమె పేర్కొన్నారు. ఇది ఇతిహాసాల సారాంశాన్ని తెలియజేసే శాసనం(టాబ్లెట్) అని యూఎస్ అసిస్టెంట్ అటర్నరీ జనరల్ కెన్నిత్ పోలిట్ అన్నారు. 1991లో గల్ఫ యుద్ధంలో ఈ శాసనం ఇరాక్ మ్యూజియం నుంచి అపహరణకు గురై తిరిగి మళ్లీ బ్రిటన్‌లో కనిపించింది. లండన్‌కి చెందిన జోర్డాన్ కుటుంబం నుంచి అమెరికన్ ఆర్ట్ డీలర్ ఈ టాబ్లెట్‌ని కొనుగోలు చేశాడు. 2007లో దీన్ని తప్పుడు ధృవీకరణ పత్రంతో విక్రయించారు. తదనంతరం మరోసారి 2014లో క్రాఫ్ట్ చైన్ యజమాని హబీ లాబీ, నుంచి వాషింగ్టన్ లోని బైబిల్ మ్యూజియంలో రాయిని ప్రదర్శించాలనుకునే ఫండమెంటలిస్ట్ క్రైస్తవులకు విక్రయించారు. 2017లో ఈ టాబ్లెట్ అసంపూర్ణంగా ఉందని ఆందోళన చెందారు. ఆ తర్వాత 2019లో దీనిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో అపహరణకు గురైన పురాతన కాలంనాటి వారసత్వ సంపదలను వెలికితీయాలంటూ ప్రపంచదేశాలకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ పిలుపునిచ్చారు. అంతేకాదు అన్ని యూనివర్సిటీలు, మ్యూజియంలు, ఇనిస్టిట్యూట్లు పురాతన వస్తువులు సేకరించే వారు వారసత్వ సంపద అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేలా అందరూ కృషి చేయాలన్నారు నజీమ్. గత నెలలో చిన్న చిన్న పరిమాణంలోని 17 వేల పురాతన కళాఖండాలు ఇరాక్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముక్కలు ఎక్కువగా దాదాపు 4వేల సంవత్సరాల క్రితంలోని సుమేరియన్ కాలం నాటివి. (చదవండి: పియానో బామ్మ కొత్త ఆల్బమ్.. 107లో సిక్సర్) -
గిఫ్టా..? ఓ కార్డిచ్చేద్దాం!!
న్యూఢిల్లీ: వివాహాది శుభకార్యాలు, ఇతరత్రా సందర్భాలకు ఏం గిఫ్టులివ్వాలనేది చాలా మందికి పెద్ద సమస్యే? దానిపై సందర్భాన్ని బట్టి అయితే ఇంట్లో వాళ్లతో, లేకుంటే స్నేహితులతో చర్చోపచర్చలు సహజం. ఇదిగో... ఈ పరిస్థితిని చూశాకే గిఫ్ట్ కార్డుల ట్రెండ్ మొదలయింది. అందరికీ వీటి గురించి అర్థమయ్యాక ఈ ట్రెండ్ బాగా జోరందుకుంది. ఈ ప్రీ–పెయిడ్ గిఫ్ట్ కార్డులు ఇటు కొనుగోలుదారులు.. అటు వ్యాపార సంస్థలు... ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ పెర్సిస్టెన్స్ మార్కెట్ రీసెర్చ్ అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా గిఫ్ట్ కార్డ్ మార్కెట్ ఏటా 11 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2024 నాటికి 698 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. క్విక్సిల్వర్ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం దేశీ మార్కెట్ విలువ సుమారు 50–60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. రాబోయే రోజుల్లో ఇది గణనీయంగా పెరగనుంది. దేశీయంగా గిఫ్ట్ కార్డుల కొనుగోలుకు సంబంధించి 90 శాతం లావాదేవీలు మొబైల్ ద్వారా జరుగుతున్నాయని రీసెర్చ్ సంస్థల అధ్యయనాల్లో వెల్లడైంది. రూ. 3వేల కోట్ల మార్కెట్.. రిటైల్, కార్పొరేట్ కస్టమర్స్‌కు గిఫ్ట్ కార్డ్ సొల్యూషన్స్ అందించే క్విక్సిల్వర్ నివేదిక ప్రకారం.. 2018–19లో 75 కోట్ల పైచిలుకు గిఫ్ట్ కార్డు లావాదేవీలు జరిగాయి. ఈ మార్కెట్ పరిమాణం రూ.3,000 కోట్ల స్థాయిలో ఉంది. వివిధ సందర్భాల్లో బహుమతిగా ఇచ్చేందుకే కాకుండా సొంతానికి కూడా గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పెద్ద మార్కెట్ ప్లేస్‌లు, ఆఫ్‌లైన్ బ్రాండ్ స్టోర్స్ మొదలైన వాటిల్లో గిఫ్ట్ కార్డుల లభ్యత దాదాపు మూడు రెట్లు పెరిగింది. ‘సంప్రదాయ బహుమతులతో పోలిస్తే గిఫ్ట్ కార్డులను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. గిఫ్టుల కోసం షాపింగ్ చేయాలంటే బద్ధకించే వారు ఆఖరు నిమిషంలోనే వీటిని ఎంచుకునే వారు. అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్ మారుతోంది‘ అని క్విక్సిల్వర్ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు ప్రతాప్ టీపీ తెలిపారు. బహుమతులు ఇచ్చేవారి ధోరణుల్లో మార్పులను ఈ ట్రెండ్ సూచిస్తోందని మోగే మీడియా చైర్మన్ సందీప్ గోయల్ అభిప్రాయపడ్డారు. ‘సాధారణంగా మనం ఇచ్చే గిఫ్టు అవతలివారికి ఎంతవరకూ ఉపయోగపడుతుంది, అది వారికి కూడా ఇష్టమైనదేనా అన్నది మనకి కచ్చితంగా తెలిసే అవకాశాలు తక్కువ. అందుకే గిఫ్ట్ కార్డు రూపంలో ఇస్తే.. అందుకునేవారు తమకు కావాల్సినది కొనుక్కునేందుకు ఉపయోగపడుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ ధోరణి.. సాధారణంగా గిఫ్ట్ కార్డుల మార్గాన్ని ఎక్కువగా కార్పొరేట్ కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. దీంతో అమెజాన్ గిఫ్ట్‌కార్డ్స్ వంటి వాటికి కార్పొరేట్ మార్కెట్టే ఎక్కువగా ఉన్నప్పటికీ.. క్రమంగా రిటైల్ కస్టమర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఆయా కంపెనీలు కూడా కాస్త వైవిధ్యమైన కార్డులను ప్రవేశపెడుతున్నాయి. అమెజాన్ స్టోర్‌లో తొలిసారిగా షాపింగ్ చేసేవారికి గిఫ్ట్‌కార్డులు అనువైనవిగా ఉంటాయని అమెజాన్ పేమెంట్స్ డైరెక్టర్ షరీక్ ప్లాస్టిక్వాలా తెలిపారు. భౌగోళికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, కర్ణాటకలోని దావణగెరె, మహారాష్ట్రలోని బీడ్ వంటి ప్రాంతాల్లో గిఫ్ట్ కార్డులకు మంచి డిమాండ్ ఉంటోందని ఆయన పేర్కొన్నారు. అమెజాన్ గిఫ్ట్ కార్డులను కేవలం షాపింగ్‌కు మాత్రమే కాకుండా కరెంటు, నీటి బిల్లులు కట్టేందుకు, ఫ్లయిట్స్.. హోటల్ బుకింగ్స్ మొదలైన వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. 35 ఏళ్ల లోపు వారే అధికం.. దేశీయంగా గిఫ్ట్ కార్డు యూజర్లలో 85 శాతం మంది 35 ఏళ్ల లోపు వయస్సుగలవారే. ఈ కార్డుల వినియోగంలో టాప్ 10 మెట్రోయేతర నగరాల్లో అహ్మదాబాద్, పట్నా, ఇండోర్, జైపూర్, ఆగ్రా, భువనేశ్వర్, చండీగఢ్, కొచి, సోనిపట్, లక్నో ఉన్నాయి. ఈ నగరాల్లో వినియోగం మూడు రెట్ల నుంచి అయిదు రెట్ల దాకా పెరిగింది. కొత్త సీసాలో.. ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్న గిఫ్ట్ కార్డులు వాస్తవానికి గతంలోనూ ఉండేవి. అప్పుడవి గిఫ్ట్ చెక్కుల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్వరూపం మారింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దశాబ్దాలుగా గిఫ్ట్ చెక్కులు జారీ చేసేదని బ్రాండ్ బిల్డింగ్డాట్కామ్ వ్యవస్థాపకుడు అంబి పరమేశ్వరన్ తెలిపారు. షాపర్స్ స్టాప్, క్రాస్‌వర్డ్, లైఫ్‌స్టయిల్ వంటి సంస్థలు గిఫ్ట్ కార్డుల సంస్కృతి పెరిగేందుకు దోహదపడ్డాయి. ఇప్పుడిక ఆన్లైన్ గిఫ్ట్ వోచర్లు.. మళ్లీ మార్కెట్లో కొత్త మార్పులు తీసుకొస్తున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. రిటైలర్లకు లాభం.. కొనుగోలుదారులకు గిఫ్ట్ కార్డులు సౌకర్యవంతంగానే ఉంటున్నాయి. అదే సమయంలో వీటిని అమ్మే రిటైల్ సంస్థలకు ఇవి లాభసాటిగా కూడా ఉంటున్నాయి. కార్డులన్నీ ప్రీ–పెయిడ్ కావడం వల్ల .. దాన్ని గిఫ్ట్‌గా అందుకున్న వారు కొనుగోళ్లు జరపడానికి ముందుగానే సదరు రిటైలర్ల ఖాతాలో డబ్బు చేరినట్లే. పైగా .. చాలా మటుకు కార్డుల విలువలో 60–90 శాతం దాకా మాత్రమే వినియోగం ఉంటోంది. ఇలా మిగిలిపోయిన మొత్తం అంతా గిఫ్ట్ కార్డులు జారీ చేసిన సంస్థలకు లాభమే. -
పొలం పొమ్మంది.. ఇల్లు రమ్మంది
ఒక తరం పోయి మరో తరం వస్తుంది.. ఒక పాత కనుమరుగై... మరో కొత్తకు నాంది అవుతుందిమార్పు సంస్కృతిలో భాగం... మారి తీరాల్సిందే... మార్పును స్వాగతించాల్సిందే.నాగలి పోయి ట్రాక్టర్ వచ్చింది...రోకలి పోయి మిక్సీ వచ్చింది. వాకర్ వచ్చింది... మూడు చక్రాల బండిని పక్కకు తోసేసింది.పొలం... ‘నీకిక్కడ ఇంకేం పనుంది’ అన్నది... పట్టణాల్లో ఇళ్లు ‘పని చేద్దువురా’ అని పిలిచాయి.వడ్రంగి ఊరిని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ... సిటీలో అడుగుపెట్టాడు.సమాజంలో వచ్చిన మార్పుకు... ప్రత్యక్ష సాక్షి అయ్యాడు. ‘‘మా నాన్న పేరు సాంబాచారి. ఆయన ఊరందరికీ చుట్టమే. మా ఇంటికి పని కోసం వచ్చినవాళ్లను, పని కోసం ఇంటికి పిలిపించుకునే వాళ్లను ఎవరినైనా సరే ‘మామా, చిన్నాన్నా’ అని వరుస పెట్టి పిలిచేవాడు. చేతిలో పనితోపాటు మాట మంచితనంతోనే మా ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడాయన. మార్పు నా కళ్ల ముందే! నేను మా నాన్న చేతికింద పన్నెండేళ్లు పని చేశాను. సొంతంగా పని చేయడం మొదలు పెట్టి ముప్పై ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లలో నేను పెద్ద మార్పునే చూశాను. మా ఉలి, బాడిశె, కలప కోసే రంపం, తోపుడు రంపం వంటి వస్తువులు అలాగే ఉన్నాయి. కానీ వాటితో మేము తయారు చేసే వస్తువులు మారిపోయాయి. ఒకప్పుడు మా పనంతా వ్యవసాయం ప్రధానంగా ఉండేది. వ్యవసాయానికి వాడే పనిముట్లంటే... నాగలి, ఎడ్లబండి, ఏతం తొక్కడానికి ఏతం మాను, కపిల బావి నీరు తోడడానికి గిలక, గింజలు నాటడానికి జడ్డిగం గొర్రు, పళ్లమాను, గెడ్లమాను, మాను అడ్డ, గుంటక అడ్డ, కర్రల మాను, కాడి, కొడవలి ముఖ్యంగా ఉండేవి. ఇక ఇంట్లో రోజువారీ వాడకంలో... నులకమంచం, మడతమంచం, మడత కుర్చీ, బల్ల, కుర్చీ, పిల్లలకు ఊయల, చక్రాలబండి, గిలక్కాయలు ఉండేవి. వంటగదికోసం వాడే రోకలి, కత్తిపీట, పప్పుగుత్తి, తెడ్డు, కవ్వం, పీటలు, తిరగలి పిడి, రుబ్బురోలు పిడి వంటివన్నీ వడ్రంగి చేయాల్సినవే. ఇప్పుడు వంటగది మా కోసం చూసేది ఒక్క పప్పుగుత్తి కోసమే. మిగిలిన అన్నింటికీ ప్రత్యామ్నాయాలు వచ్చేశాయి. ఇంటి నిర్మాణంలో అయితే పునాది వేసిన తరవాత మొదట ద్వారబంధాలు నిలబెట్టేవాళ్లు. ఇంటి తలుపులు, దంతులు, కిటికీలు, అల్మరాలు వడ్రంగి చేతి నుంచే రావాలి. మా నాన్న దగ్గర నేను అవన్నీ నేర్చుకున్నాను.అప్పట్లో దీపావళి వరకు వ్యవసాయ పనులుంటే ఆ తర్వాత వరికోతల వరకు పని ఉండేది కాదు. శీతాకాలం, ఎండాకాలాల్లో కొట్టాలు వేసేవాళ్లు. ఇప్పుడు తాటాకు కొట్టాల్లేవు. అన్నీ రేకుల కొట్టాలే. వాటిలో మా పని పెద్దగా ఉండదు. పెంకుటిళ్లు కూడా లేవు. అన్నీ స్లాబ్ ఇళ్లే. అన్నింట్లోనూ కొత్తదనం వచ్చి పాతదనం కొట్టుకుపోయినట్లే ఇది కూడా. చిన్న కుటుంబాలూ కారణమే! ఇప్పుడు ఇళ్లు కట్టడం బాగా ఎక్కువైంది. అప్పట్లో ఉన్నట్లు ఉమ్మడి కుటుంబాల్లేవిప్పుడు. ఇంటికి ఇద్దరున్నా సరే ప్రతి ఇంటికీ ఒక డైనింగ్ టేబుల్, సోఫాసెట్ తప్పనిసరిగా ఉంటున్నాయి. డ్రెస్సింగ్ మిర్రర్లు, కార్నర్ స్టాండ్, చెక్క బీరువా, టీపాయ్, దివాన్ సెట్ వంటివి చాలా మంది వాడుతున్నారు. గ్రామంలో మేము చేసే పనులు తగ్గినప్పుడు ఊరినే నమ్ముకుంటే గడవడం కష్టమే. అందుకే వడ్రంగులం పట్టణాల బాట పట్టాం. ఫర్నిచర్ షాప్‌లతో కలిసి పని చేస్తున్నాం. వాళ్లయితే రోజూ పని చూపిస్తారు. పీస్ లెక్కన పేమెంట్ ఇస్తారు. మేము సొంతంగా పని చేసుకోలేకపోతున్నాం... అనే మాట నిజమే. కానీ ఇప్పుడు మాకు నెలకింత డబ్బు వస్తుందనే భరోసా ఉంటోంది. నిజానికి అప్పట్లో కంటే ఇప్పుడే మాకు పని పెరిగింది. అందరూ ఇళ్లను బాగా అందంగా కట్టుకుంటున్నారు. సిమెంట్ పనికి ఉన్నంత విలువ మా కొయ్యపనికి కూడా ఉంటోంది. మార్పు మంచిదే! అప్పట్లో మా పని ఎక్కువగా రైతుల కోసమే ఉండేది. మాకు ఆత్మీయులూ వాళ్లే. ఇప్పుడు మాకు పని చూపించేది యజమాని, ఆ యజమానితోపాటు యజమాని దగ్గర పని చేసే మా లాంటి మరికొందరు కార్పెంటర్లతోనే స్నేహమైనా, ఆత్మీయత అయినా. మా వృత్తిలో ఎప్పుడూ మాట మెత్తగా ఉండాలి. కస్టమర్లు వాళ్లకు ఏం కావాలో చెప్తారు. ఒక్కో డిజైన్ నుంచి ఒక్కో పార్ట్ చెప్పి అన్నింటినీ కలిపి కొత్త డిజైన్ కావాలంటారు. కొన్నిసార్లు ఆ ప్రయత్నంతో మేము కూడా కొత్త డిజైన్ నేర్చుకుంటాం. ఒక్కోసారి వాళ్లడిగినట్లు చేయడం కుదరదు. ఉడ్ పట్టు నిలవదు. అలాంటప్పుడు ఎందుకు కుదరదో వాళ్లకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఆ సూత్రాన్ని ఒంటబట్టించుకుంటే మా వృత్తి అన్నమే కాదు పరమాన్నం కూడా పెడుతుంది. ఈ వృత్తి ఎన్ని తరాలైనా ఎక్కడికీ పోదు. చెట్టు ఉన్నంత కాలం మేమూ ఉంటాం’’. యంత్రసాయం! వ్యవసాయంలో మా పనిముట్ల స్థానంలో ట్రాక్టర్, కరెంట్ మోటార్, వరికోత మెషీన్ వచ్చేశాయి. వాటి వల్ల రైతుకి పని చాలా సులువైంది. గ్రామాల్లో ఒక్కో ట్రాక్టర్ పెరిగే కొద్దీ నాగళ్లు అటకెక్కసాగాయి. పొలం దున్నేవాళ్లు తగ్గిపోసాగారు. గొర్రుతో సేద్యం చేసేవాళ్లు లేరిప్పుడు. – అలజంగి వెంకటాచారి, కార్పెంటర్ ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నేటి నుంచి సాంస్కృతిక పోటీలు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నేటి నుంచి రెండు రోజులు సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పి.హరి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగంలో వ్యక్తిత్వం,వాదం–ప్రతివాదం పోటీలను, ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో లలిత సంగీతం, బృందనాగ పోటీలు, 11వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ఏయూ అసెంబ్లీ మందిరంలో శాస్త్రీయ, బృంద నత్యాలు, మూకాభినయం నిర్వహిస్తారు. ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నవారు నిర్ణీత తేదీలలో పోటీలలో హాజరుకావాలన్నారు. కష్ణా పుష్కరాలు, స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.