‘చుండూరు’ తీర్పును వ్యతిరేకించాల్సిందే..
సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోలేదు
హైకోర్టు తీర్పుపై ‘సుప్రీం’కు వెళ్తాం
ప్రత్యేక కోర్టు ఏపీపీ శివనాగేశ్వర్రావు
విద్యారణ్యపురి : చుండూరు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గా లేదని ఆ కేసులో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) శివనాగేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. మాన వ హక్కుల వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్లో ‘అందరూ నిర్దో షులైతే చుండూరు దళితులను చంపిందెవరు’ అంశం పై ఆదివారం సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సు లో శివనాగేశ్వర్రావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ చుండూరు కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు 2007 లో 21మందికి జీవిత ఖైదు, 35మందికి ఏడాది కారాగారశిక్ష విధించగా, ఈ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఏడాది ఏప్రిల్ 22న కొట్టివేసిందని తెలిపారు. ఈ కేసులో అందరూ నిర్దోషులే అయితే చుండూరు దళితులను చంపింది ఎవరని ఆయన ప్రశ్నించారు.
చుండూరు కేసుకు సంబంధించి హై కోర్టు తీర్పు సరిగ్గా లేనందున, అందరూ వ్యతిరేకించాల్సిందేనని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులు, ప్రత్యక్ష సాక్ష్యుల కథనాన్ని పరిగణనలోకి తీసుకోకుం డా ఈ తీర్పు ఇచ్చారని చెబుతూ, పలు అంశాలను విశ్లేషణాత్మకంగా వివరించారు. ఈ మేరకు ఈ తీర్పు పై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నామని ఆయన ఈ సందర్బంగా వెల్లడించారు.
ఉద్యమాల నిర్వీర్యంతోనే...
చుండూరు, కారంచేడు, లక్ష్మింపేట వంటి ప్రాంతాల్లో దళితులపై జరిగిన దాడులన్నీ ఊచకోతలేనని మాన వ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి వీఎస్.కృష్ణ అన్నారు. ఉద్యమాలు నిర్వీర్యమయ్యాయి కనుకే చుం డూరు కేసులో దోషులను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు వచ్చిందని ఆయన తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలు, హక్కులు అమలు కావాలంటే ఐక్య ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. చుండూరు కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పుపై మానవ హక్కుల వేదిక తరఫున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్న ట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సులో తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా కన్వీనర్ రమాదేవి, మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బాదావత్ రాజు తదితరులు పాల్గొన్నారు.