గాలివాన బీభత్సం
నగరంలో కూలిన చెట్లు, హోర్డింగులు
విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
నాలుగున్నర గంటల పాటు కరెంట్ బంద్
విజయవాడ : నగరంలో ఆదివారం ఆకస్మికంగా గాలివాన బీభత్సం సృష్టించింది. గంటన్నరసేపు వీచిన పెనుగాలులకు పెద్దపెద్ద చెట్లు నేలకొరిగాయి. షాపింగ్ మాల్స్, భవనాలపై ఉన్న హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన గాలివాన గంటసేపు సాగింది. చెట్లు పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయి, ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమయ్యాయి. కృష్ణలంక, స్క్రూబ్రిడ్జి, బస్టాండ్, గుణదల, మాచవరం, కొత్తవంతెన ఆంజనేయస్వామి గుడి, వేమూరివారి వీధితోపాటు వన్‌టౌన్‌లో మూడుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడ్డాయి. అధికారులు వెంటనే రంగ ప్రవేశం చేసి వన్‌టౌన్‌లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. బందర్‌రోడ్డు, గవర్నర్‌పేట, సూర్యారావుపేట, ఏలూరురోడ్డు, ఐదో నంబర్ రోడ్డు, పటమట, కృష్ణలంక, స్క్రూ బ్రిడ్జి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు నాలుగున్నర గంటల పాటు అంతరాయం కలిగింది. మరికొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు అంధకారం అలము కుంది. బస్టాండ్, వస్త్రలత ప్రాంతాల్లో హోర్డింగ్‌లు విరిగి షాపులపై పడ్డాయి.
జలమయమైన రోడ్లు
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వన్‌టౌన్, కొత్తపేట, వించిపేట, భవానీపురం ప్రాంతాల్లో రోడ్లపైన మురుగునీటిలో వర్షం నీరు కలిసి ప్రవహించింది. లోబ్రిడ్జి, ఐదో నంబర్ రోడ్డు, ఏలూరు రోడ్లపై కొద్దిసేపు నీరు ప్రవహించడంతో ప్రజలు, వాహనచోదకులు అగచాట్లు పడ్డారు. డ్రైన్లలో మురుగునీరు రోడ్లపైకి రావడంతో చెరువులను తలపించాయి.
సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం
నగరంలో గాలివానకు చెట్లు కూలి 33 కేవీ లైన్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగినట్లు ఏపీఎస్పీడీసీఎల్ విజయవాడ సర్కిల్ ఎస్.ఇ. విజయ్‌కుమార్ సాక్షికి చెప్పారు. అధికారులు, సిబ్బంది విరిగిపడిన చెట్లను తొలగించి దశలవారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారని వివరించారు.