Customer complaints
-
బ్యాంకులపై పెరుగుతున్న ఫిర్యాదులు..!
న్యూఢిల్లీ : దేశంలోని బ్యాంక్‌లపై వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆర్బీఐ నిర్వహిస్తున్న బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు బ్యాంకింగ్ సేవలపై ఈ ఏడాది వచ్చిన ఫిర్యాదులను బట్టి ఈ విషయం అర్థమవుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ... గతేడాదితో పోలిస్తే 2017-2018లో ఫిర్యాదుల్లో 25 శాతం పెరుగుదల ఉండవచ్చని ఆర్బీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్లలో గుజరాత్ నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 93 శాతం పెరుగుదల నమోదైంది. 2014-2015లో 4,965 ఫిర్యాదులు రాగా, 2017-2018లో ఆ సంఖ్య 9,600కు చేరింది. కానీ దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ నాలుగేళ్లలో పెరుగుదల కేవలం 7 శాతంగా ఉంది. వీటిలో ఏటీఎం కార్డుల సమస్యలపైనే ఎక్కువ మంది వినియోగదారులు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా బ్యాంకులు విధిస్తున్న చార్జీలపై వస్తున్న ఫిర్యాదులు ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. అందులో ముఖ్యంగా మొబైల్, ఇంటర్నెట్ బ్యాకింగ్ వినియోగించేవారిపై చార్జీల బాదుడు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. -
వొడాఫోన్‌కు భారీ జరిమానా
లండన్ : కస్టమర్ ఫిర్యాదులను సరిగా హ్యాండిల్ చేయకుండా తరుచూ యూకే వ్యాపారాల్లో ఫెయిల్యూర్స్‌కు పాల్పడుతుండటంతో ప్రపంచ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌కు భారీ జరిమానా పడింది. కస్టమర్ ఫెయిల్యూర్స్‌పై సీరియస్‌గా స్పందించిన బ్రిటన్ ఆ కంపెనీపై 4.6 మిలియన్ ఫౌండ్ల జరిమానా ( రూ.37 కోట్లకు పైగా) విధించింది. ఈ కమ్యూనికేషన్ దిగ్గజంపై రెండు సార్లు విచారణ చేపట్టిన అనంతరం బ్రిటన్ రెగ్యులేటరీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల ఫిర్యాదులన్నింటినీ న్యాయమైన పద్ధతిలో, వెంటనే పరిష్కరించడంలో వొడాఫోన్ ప్రక్రియలు పూర్తిగా విఫలమైనట్టు యూకే కమ్యూనికేషన్ పరిశ్రమల స్వతంత్ర రెగ్యులేటరీ ఆఫ్కామ్ తెలిపింది. ఈ జరిమానాను 20 పనిదినాల లోపు ఆఫ్కామ్కు చెల్లించాలని వొడాఫోన్‌ను ఆదేశించింది. ప్రపంచంలోనే రెండోఅతిపెద్ద మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్. కానీ ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే గుర్తించి, పరిష్కరించడంలో మాత్రం విఫలమవుతుందని ఆఫ్కామ్ అసహనం వ్యక్తంచేసింది. ఈ సమస్యలతో 2013 చివరి నుంచి 2015 ఏప్రిల్ మధ్యవరకున్న 17 నెలల కాలంలో కస్టమర్లు దాదాపు లక్షా 50వేల డాలర్లు నష్టపోయినట్టు రెగ్యులేటరీ తెలిపింది. తమ సిస్టమ్, ప్రాసెస్ ఫెయిల్యూర్స్‌పై వొడాఫోన్ పశ్చాత్తాపం వ్యక్తంచేసింది. ప్రభావిత కస్టమర్లందరికీ ఇప్పటికే తాము రీఫండ్ చేశామని పేర్కొంది. ఈ జరిమానా నేపథ్యంలో అన్ని టెలికాం కంపెనీలను రెగ్యులేటరీ హెచ్చరించింది. కస్టమర్లకు అందించే సేవల్లో విఫలమవ్వడాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటామని తెలిపింది. ఫోన్ సర్వీసులు దైనిందిక జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, కస్టమర్లందరికీ న్యాయబద్ధంగా సేవలు అందిస్తారని తాము ఆశిస్తున్నట్టు ఆఫ్కామ్ బుధవారం వెల్లడించింది. కాగ బిల్లింగ్ డేటాలోను, ఫ్రైస్ ప్లాన్స్‌లో వొడాఫోన్ కంపెనీ కస్టమర్లకు సమస్యలు తలెత్తాయి. కంపెనీకి ఫిర్యాదులు భారీగా వెల్లువెత్తినప్పటికీ, వెనువెంటనే పరిష్కరించడంలో వొడాఫోన్ విఫలమైంది. -
రామ్ చరణ్ 'ట్రూజెట్'పై ఫిర్యాదులు
హైదరాబాద్: ప్రముఖ హీరో రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న 'ట్రూజెట్' విమాన సర్వీసులపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ఓ ఆంగ్ల పత్రిక ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నివేదిక ప్రకారం ఆగస్టులో 5 శాతం కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసిన విమాన సంస్థల్లో ఎయిర్ పెగాసస్, ట్రూజెట్ టాప్‌లో ఉన్నాయి. ఇక ప్రయాణకుల నుంచి వచ్చిన ఫిర్యాదులు కూడా ట్రూజెట్ పైనే ఎక్కువగా ఉన్నాయి. గురువారం రాత్రి ట్రూజెట్ ఫ్లయిట్ 2T 106 ఔరంగాబాద్-హైదరాబాద్-తిరుపతి సర్వీసును హైదరాబాద్ వచ్చిన తర్వాత రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. 'ఈ విమానం ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్లాల్సివుంది. హైదరాబాద్ నుంచి బయల్దేరిన తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చింది. పార్కింగ్ బే వద్ద ప్రయాణికులు నిరసన వ్యక్తం చేసి మరో విమానం ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే కొన్ని సమస్యల వల్ల విమానాన్ని ఏర్పాటు చేయలేకపోయారు' అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకుని ప్రయాణికులను పార్కింగ్ బే నుంచి ఎయిర్ పోర్ట్ లాంజ్‌లోకి తీసుకెళ్లారని చెప్పారు. లాంజ్‌లో కూడా ప్రయాణికులు ఆందోళన కొనసాగించడంతో వారిని హోటల్స్‌కు తరలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని తెలిపారు. ప్రయాణికులు తిరుమలలో పూజా టికెట్లు బుక్ చేసుకోవడంతో ఆందోళన చెందారని విమానాశ్రయ సిబ్బంది చెప్పారు. -
తగ్గిన బ్యాంకింగ్ ఫిర్యాదులు
* గత ఏడాది 4,477 ఫిర్యాదులు రాగా.. ఈసారి 4,366 మాత్రమే * వార్షిక నివేదికను వెల్లడించిన బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ కృష్ణమోహన్ సాక్షి, హైదరాబాద్: బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులు గతంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి 4,477 ఫిర్యాదులు రాగా, ఈసారి 4,366 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. వీటిలో ఏపీ నుంచి 2,223, తెలంగాణ నుంచి 2,143 ఫిర్యాదులు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఫిర్యాదుల సంఖ్య రెండు రాష్ట్రాల్లో కలిపి 2.48 శాతం తగ్గింది. ఈసారి నమోదైన ఫిర్యాదుల్లో ఏటీఎం కార్డులకు సంబంధిచినవే ఎక్కువ ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను బుధవారమిక్కడ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ డా.ఎన్.కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంక్ ఖాతాదారుల ఫిర్యాదులకు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పథకంతో సత్వర పరిష్కారం లభిస్తుందని తెలి పారు. అంబుడ్స్‌మన్ వినియోగదారుడికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటుందని, ఈసారి తమ వద్దకొచ్చిన ఫిర్యాదులన్నీ పరిష్కరించామని తెలిపారు. ఈ ఏడాది వచ్చిన ఫిర్యాదుల్లో 40.63 శాతం ఎస్బీఐ దాని అసోసియేటెడ్ బ్యాంకుల నుంచే వచ్చాయని, స్టేట్ బ్యాంక్‌కు రెండు రాష్ట్రాల్లో 2,800 వరకు బ్రాంచ్‌లున్నందున ఫిర్యాదులు ఎక్కువవచ్చినట్లు అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించి 25.4 శాతం ఫిర్యాదులు, పెన్షన్లకు సంబంధించి 8 శాతం ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఫిర్యాదుల్లో 28 శాతం వరకు మధ్యవర్తిత్వం, రాజీ ద్వారా పరిష్కరించినట్లు చెప్పారు. ప్రతీ బ్యాంక్ కూడా అంతర్గత అంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కృష్ణమోహన్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య 13 శాతం పెరిగిందని చెప్పారు. ఖాతాదారుల ఫిర్యాదులకు బ్యాంకుల్లో న్యాయం లభించని పక్షంలో తమను ఆశ్రయించాలని, లేదా ఈ మెయిల్ రూపంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, కార్డుల తస్కరణ వంటి వాటికి త్వరలో చెక్ పెట్టనున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. ఏటీఎం కార్డుల మోసాలను అరికట్టేందుకు సెప్టెంబర్ 1 నుంచి ఈఎంవీ(ఎలక్ట్రానిక్ చిప్) కార్డులను బ్యాంకులు జారీ చేస్తాయన్నారు.