రామ్ చరణ్ 'ట్రూజెట్'పై ఫిర్యాదులు
హైదరాబాద్: ప్రముఖ హీరో రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న 'ట్రూజెట్' విమాన సర్వీసులపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ఓ ఆంగ్ల పత్రిక ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నివేదిక ప్రకారం ఆగస్టులో 5 శాతం కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసిన విమాన సంస్థల్లో ఎయిర్ పెగాసస్, ట్రూజెట్ టాప్లో ఉన్నాయి. ఇక ప్రయాణకుల నుంచి వచ్చిన ఫిర్యాదులు కూడా ట్రూజెట్ పైనే ఎక్కువగా ఉన్నాయి.
గురువారం రాత్రి ట్రూజెట్ ఫ్లయిట్ 2T 106 ఔరంగాబాద్-హైదరాబాద్-తిరుపతి సర్వీసును హైదరాబాద్ వచ్చిన తర్వాత రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. 'ఈ విమానం ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్లాల్సివుంది. హైదరాబాద్ నుంచి బయల్దేరిన తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చింది. పార్కింగ్ బే వద్ద ప్రయాణికులు నిరసన వ్యక్తం చేసి మరో విమానం ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే కొన్ని సమస్యల వల్ల విమానాన్ని ఏర్పాటు చేయలేకపోయారు' అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకుని ప్రయాణికులను పార్కింగ్ బే నుంచి ఎయిర్ పోర్ట్ లాంజ్లోకి తీసుకెళ్లారని చెప్పారు. లాంజ్లో కూడా ప్రయాణికులు ఆందోళన కొనసాగించడంతో వారిని హోటల్స్కు తరలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని తెలిపారు. ప్రయాణికులు తిరుమలలో పూజా టికెట్లు బుక్ చేసుకోవడంతో ఆందోళన చెందారని విమానాశ్రయ సిబ్బంది చెప్పారు.