తగ్గిన బ్యాంకింగ్ ఫిర్యాదులు | Reduced banking complaints | Sakshi
Sakshi News home page

తగ్గిన బ్యాంకింగ్ ఫిర్యాదులు

Published Thu, Aug 13 2015 4:16 AM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

తగ్గిన బ్యాంకింగ్ ఫిర్యాదులు - Sakshi

తగ్గిన బ్యాంకింగ్ ఫిర్యాదులు

* గత ఏడాది 4,477 ఫిర్యాదులు రాగా.. ఈసారి 4,366 మాత్రమే
* వార్షిక నివేదికను వెల్లడించిన బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ కృష్ణమోహన్

సాక్షి, హైదరాబాద్: బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులు గతంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి 4,477 ఫిర్యాదులు రాగా, ఈసారి 4,366 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. వీటిలో ఏపీ నుంచి 2,223, తెలంగాణ నుంచి 2,143 ఫిర్యాదులు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఫిర్యాదుల సంఖ్య రెండు రాష్ట్రాల్లో కలిపి 2.48 శాతం తగ్గింది.

ఈసారి నమోదైన ఫిర్యాదుల్లో ఏటీఎం కార్డులకు సంబంధిచినవే ఎక్కువ ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను బుధవారమిక్కడ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ డా.ఎన్.కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంక్ ఖాతాదారుల ఫిర్యాదులకు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పథకంతో సత్వర పరిష్కారం లభిస్తుందని తెలి పారు. అంబుడ్స్‌మన్ వినియోగదారుడికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటుందని, ఈసారి తమ వద్దకొచ్చిన ఫిర్యాదులన్నీ పరిష్కరించామని తెలిపారు.

ఈ ఏడాది వచ్చిన ఫిర్యాదుల్లో 40.63 శాతం ఎస్‌బీఐ దాని అసోసియేటెడ్ బ్యాంకుల నుంచే వచ్చాయని, స్టేట్ బ్యాంక్‌కు రెండు రాష్ట్రాల్లో 2,800 వరకు బ్రాంచ్‌లున్నందున ఫిర్యాదులు ఎక్కువవచ్చినట్లు అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించి 25.4 శాతం ఫిర్యాదులు, పెన్షన్లకు సంబంధించి 8 శాతం ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఫిర్యాదుల్లో 28 శాతం వరకు మధ్యవర్తిత్వం, రాజీ ద్వారా పరిష్కరించినట్లు చెప్పారు. ప్రతీ బ్యాంక్ కూడా అంతర్గత అంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కృష్ణమోహన్ సూచించారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య 13 శాతం పెరిగిందని చెప్పారు. ఖాతాదారుల ఫిర్యాదులకు బ్యాంకుల్లో న్యాయం లభించని పక్షంలో తమను ఆశ్రయించాలని, లేదా ఈ మెయిల్ రూపంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు, కార్డుల తస్కరణ వంటి వాటికి త్వరలో చెక్ పెట్టనున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. ఏటీఎం కార్డుల మోసాలను అరికట్టేందుకు సెప్టెంబర్ 1 నుంచి ఈఎంవీ(ఎలక్ట్రానిక్ చిప్) కార్డులను బ్యాంకులు జారీ చేస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement