విద్యుత్ కనెక్షన్ పొందండి ఇలా
ప్రయోజనం
కర్నూలు (రాజ్‌విహార్): విద్యుత్ కనెక్షన్ పొందేందుకు ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏఏ డాక్యూమెంట్లు తీసుకెళ్లాలి అనే అనుమానాలు చాలామందిలో వ్యక్తమవుతుంటాయి. కొత్త ఇల్లు నిర్మించుకున్నా, ఏదైన షాపునకు కరెంటు కనెక్షన్ కావాలన్నా, వ్యవసాయ, పరిశ్రమ, ఇతర అవసరాల కోసం విద్యుత్ కనెక్షన్ల పొందేందుకు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా సమీపంలోని సబ్ డివిజన్ కేంద్రంలో ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్లో సంప్రదించాలి. జిలాల్లో మొత్తం 15 కస్టమర్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ) ఉన్నాయి.
ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి
విద్యుత్ కనెక్షన్ పొందేందుకు ఇల్లు, షాపు, పరిశ్రమ ఏదైనా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు లేదా ఇటీవలే చెల్లించిన పన్ను రసీదు పత్రం, లేదా ఆస్తి పట్టా జిరాక్స్ కాపీలను గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి తీసుకెళ్లాలి. వీటితోపాటు ఫొటో ఐడెంటిటీ, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, వైరింగ్ సర్టిఫికేట్ (మన వినియోగం ఏ మేరకు ఉంటుందో చెబితే అక్కడే ఇప్పిస్తారు.)
►డాక్యుమెంట్ లేదా పన్ను రసీదులో ఉన్న వ్యక్తి పేరుతోనే విద్యుత్ కనెక్షన్ ఇస్తారు.
►ఆ వ్యక్తే స్వయంగా అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
►అక్కడ ఇచ్చే దరఖాస్తులో ఫొటోలు, సంతకాలు పెట్టాలి. దీంతో పాటు వెబ్ కెమెరా ద్వారా ఫొటోలు దిగాలి.
►ఆయన స్వయంగా రాని పక్షంలో తాను ఏ కారణంగా రాలేనో వివరిస్తూ రాతపూర్వకంగా అర్జి రాసి, అందులోనే అర్జీ తీసుకెళ్లే వ్యక్తి పేరు, అడ్రస్ సూచించాలి. ఆ వ్యక్తి ఫొటో, ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి. నగరం బయట ఉంటే ఆ అర్జీని కొరియర్ ద్వారా పంపాలి.
►డాక్యుమెంట్లలో పేరు ఉన్న వ్యక్తి మరిణించి ఉంటే తన వారసులు డెత్ సర్టిఫికెట్, లీగల్ ఏర్సర్టిఫికెట్ తీసుకెళ్లడంతో పాటు మిగిలిన వారసుల చేత నో అబ్జెక్షన్ అఫిడవిట్ సమర్పించాలి.
►డాక్యుమెంట్లు తీసుకెళ్లి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నిర్ణీత మొత్తాన్ని అక్కడే ఉన్న ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ (ఈఆర్ఓ)లో చెల్లించాలి.
►కేవలం సీఎస్సీల దరఖాస్తు ఫీజు ఇంటికి రూ.25, షాపులకు రూ.50, పరిశ్రమలకు రూ.100 వసూలు చెల్లించాల్సి ఉంటుంది.
►డబ్బు చెల్లించిన తర్వాత రసీదు ఇస్తారు. స్తంభం ఏర్పాటు అవసరం లేకుంటే నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ►నగరవాసులకు మూడు రోజుల్లో, గ్రామీణవాసులకు వారం రోజుల్లో మీటర్ మంజూరు చేస్తారు. స్తంభం ఏర్పాటు అవసరమైతే అందుకు సంబంధించి ఎస్టిమేట్ వేసి మంజూరైన పనులు పూర్తయ్యాక కనెక్షన్ ఇస్తారు. ఈ ప్రక్రియ ప్రారంభం నుంచి మీటర్ అమర్చే వరకు సమాచారాన్ని సెల్‌కు మెసేజ్ రూపంలో అందిస్తారు.
► స్తంభం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా తీసుకునే కనెక్షన్లకు డీడీల రూపంలో చెల్లించాల్సిన మొత్తం:
► ఎల్టీ కేటగిరి-1 కింద 240వాట్స్‌లోపు ఇంటి కనెక్షన్ కోసం డెవలప్మెంట్ చార్జీలు రూ.600, సెక్యూరిటీ డిపాజిట్ రూ.100 దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం రూ.725 చెల్లించాలి.
►ఎల్టీ-1 కింద 1కిలో వాట్స్‌లోపు తీసుకునే ఇంటి కనెక్షన్ కోసం డెవెలప్మెంట్ చార్జీలు రూ. 1200, సెక్యూరిటీ డిపాజిట్ రూ.300(గ్రామాల్లో), రూ.200(పట్టణాల్లో), దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి.
►ఎల్టీ-1 కింద ఇంటికి త్రీఫేజ్ కనెక్షన్ తీసుకుంటే డెవలప్మెంట్ చార్జీలు రూ.3600 (1కేవీ), సెక్యూరిటీ డిపాజిట్ రూ.900 (గ్రామాలు), రూ.600 (పట్టణాలు), దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి.
►ఎల్టీ-2 (1కేవీకి) కింద వ్యాపార దుకాణాలకు కనెక్షన్ తీసుకుంటే డెవలప్మెంట్ చార్జీలు రూ.2050, సెక్యూరిటీ డిపాజిట్ రూ.800(పట్టణాలకు), రూ.1200 (గ్రామాలకు) దరఖాస్తు ఫీజు మొత్తం రూ.50 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి.
►ఎల్టీ-2 (5కేవీకి) కింద వ్యాపార దుకాణాలకు కనెక్షన్ తీసుకుంటే డెవెలప్మెంట్ చార్జీలు రూ.6వేలు, సెక్యూటిటీ డిపాజిట్ రూ.4వేలు (పట్టణాలకు), గ్రామాల్లో రూ.6వేలు, దరఖాస్తు ఫీజు మొత్తం రూ.50 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి.
►ఎల్టీ-5 కింద వ్యవసాయ కనెక్షన్ కోసం డెవలప్మెంట్ చార్జీలు రూ.1200(1హెచ్‌పీ), సెక్యూరిటీ డిపాజిట్ రూ.60(1హెచ్‌పీ), 5హెచ్‌పీ మోటరుకు డెవెలప్మెంట్ చార్జీ రూ. 4800, సెక్యూరిటీ డిపాజిట్ రూ.300, దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి.