Customer Services
-
వాట్సాప్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలను ప్రారంభించింది. ఇందుకోసం భారతీ ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపింది. పలు బ్యాంకు సర్వీసులతోపాటు ఇంటి వద్ద సేవల కోసం వినతి, సమీపంలోని పోస్ట్ ఆఫీస్ శాఖ ఎక్కడ ఉంది వంటివి వాట్సాప్ ద్వారా ఖాతాదారులు తెలుసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌నకు 4.51 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. లైవ్ ఇంటెరాక్టివ్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్‌ను సైతం వాట్సాప్‌లో పరిచయం చేయనున్నారు. -
కొత్త ఏడాది నుండి కొత్త నిబంధనలు..బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!
త్వరలో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బ్యాంక్ లాకర్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి కొత్త లాకర్ నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్ మేరకు..లాకర్ల విషయంలో బ్యాంకులు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించకూడదు. జనవరి 1, 2023 నాటికి ప్రస్తుతం లాకర్‌ను వినియోగిస్తున్న ఖాతాదారులు తమ లాకర్ అగ్రిమెంట్‌ను రెన్యువల్ చేయాలి. బ్యాంకులు ఐబిఎ రూపొందించిన మోడల్ లాకర్ ఒప్పందాన్ని ఉపయోగించవచ్చు. ఈ లాకర్ అగ్రిమెంట్స్ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండాలి. బ్యాంకులే హామీ ఆర్బీఐ ఆగస్టు 8, 2021న లాకర్ల విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ మార్గదర్శకాల ప్రకారం, సురక్షితమైన డిపాజిట్ వాల్ట్లను ఉంచిన ప్రాంగణాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత బ్యాంకులదే. ఒకవేళ అలసత్వం కారణంగా..బ్యాంకు లాకర్లో ఉన్న వినియోగదారుల విలువైన వస్తువులు పోతే.. అవి చెల్లించే బాధ్యత బ్యాంకులదే. అగ్నిప్రమాదాలు లేదా భవనం కూలిపోవడం వల్ల ఖజానాలో నిల్వ చేసిన విలువైన వస్తువులను దోచుకున్నా లేదా నాశనం చేసినా వినియోగదారులు బ్యాంకు ఛార్జీల కంటే 100 రెట్లు వరకు నష్టపరిహారం పొందవచ్చు. లాకర్ గదులను పర్యవేక్షించడానికి బ్యాంకులు సీసీటీవీని ఏర్పాటు చేయడం తప్పనిసరి అని ఆర్బీఐ తెలిపింది. దీంతో పాటు 180 రోజుల పాటు సీసీటీవీ డేటాను ఉంచాలని బ్యాంకులను కోరింది. బ్యాంకుల్లో డిస్ప్లే బోర్డుపై సమాచారం అందించడం ద్వారా బ్యాంకుల్లో లాకర్లు ఉన్నాయనే విషయంలో వినియోగదారులకు తెలుస్తుందని ఆర్బీఐ గుర్తించింది. అందుకే ఖాళీ లాకర్ల జాబితా, లాకర్ కోసం వెయిటింగ్ లిస్ట్, వెయిటింగ్ లిస్ట్ లోని నంబర్ గురించి వినియోగదారులకు తెలిసేలా డిస్ప్లే బోర్డ్‌లపై సమాచారం ఇవ్వాలి. ఎస్ఎంఎస్ అలెర్ట్ మోసాల నుంచి కస్టమర్లను రక్షించడానికి, కస్టమర్ తన లాకర్‌ను యాక్సెస్ చేసిన ప్రతిసారీ సంబంధిత బ్యాంకులు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్స్ పంపాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ అలర్ట్ కస్టమర్లు మోలా భారిన పడకుండా సంరక్షిస్తుంది. లాకర్ అద్దె మూడేళ్ల పాటు అద్దెగా తీసుకునే లాకర్‌పై వినియోగదారులకు బ్యాంకులకు టర్మ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డిపాజిట్లు ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు అవసరలేదని తెలుస్తోంది. -
కస్టమర్ కేర్ కాదు.. ఖాతా కొల్లగొట్టుడే!
సాక్షి, హైదరాబాద్: గూగుల్‌లో మీరు ఏదైనా సంస్థకు సంబంధించిన కస్టమర్ కేర్ సర్వీసు నంబర్ వెతుకుతున్నారా...అందులో లభించిన ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తున్నారా...ఇంతవరకు ఓకే.. అయితే ఆ నంబర్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తి మీ బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతున్నా.. లేదా ఏనీ డెస్క్ యాప్‌ను మీ సెల్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని సలహా ఇచ్చినా... అతడు సైబర్ నేరగాడు అని నిర్ధారించుకోవాలి. ఇంకోవైపు మేం పంపించే లింక్‌ను ఓపెన్ చేసి వివరాలు పొందుపర్చమన్నా కూడా అది సైబర్ నేరం జరగబోయేందుకు చిహ్నమని గుర్తుపెట్టుకోవాలి. కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగాజరుగుతుండటంతో ఏదో ఒక రకంగా కూర్చున్న చోటి నుంచే డబ్బులు కొట్టేసే ప్రణాళికను సైబర్ నేరగాళ్లు అమలు చేస్తున్నారు. అయితే లాక్డౌన్ నుంచి ఇప్పటివరకు గూగుల్‌లో కస్టమర్ కేర్ సర్వీసు పేరుతో నకిలీ ఫోన్ నంబర్లు పెట్టి మరీ ఖాతాదారుల డబ్బును లాగేస్తున్నారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ సైబర్ నేరంపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. (అన్న కొడుకుతో ప్రేమ వ్యవహారం.. మందలించడంతో) మచ్చుకు ఓ కేసు.. దుండిగల్‌కు చెందిన ఓ వ్యక్తికి రాపిపే ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో డబ్బులు లావాదేవీలు చేసే వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 3న ఓ కస్టమర్ వచ్చి డబ్బులు డ్రా చేయమని అడిగితే అది విజయవంతం కాలేదు. దీంతో సాంకేతిక సహాయం కోసం గూగుల్‌లో సదరు సంస్థ కస్టమర్ కేర్ సర్వీసు నంబర్ కోసం శోధించాడు. అయితే కొన్ని గంటల తర్వాత కస్టమర్ కేర్ సర్వీసు అంటూ ఓ ఫోన్‌కాల్ వచ్చింది. లావాదేవీలు జరగడం లేదు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పడంతో ఏనీ డెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని సూచించాడు. అయితే తర్వాత రోజూ తన బ్యాంక్ ఖాతా నుంచి ఇతర బ్యాంక్ ఖాతాకు రూ.70 వేలు బదిలీ అయినట్టుగా సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు ఈ నెల 19న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తంగా ఉండండి... గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్లు శోధించవద్దు. బ్యాంక్ ఖాతాకు అనుసంధానించిన సెల్‌ఫోన్ నంబర్ కాకుండా ఇతర నంబర్‌ను కాలింగ్ కోసం ఉపయోగించాలి. అయితే తాము నిర్వహిస్తున్న సంస్థకు సంబంధించి సాంకేతిక ఇబ్బందుల ఎదురైతే కస్టమర్ సర్వీసుతో చాట్ చేసి క్లియర్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ షేర్ చేయవద్దు. పరిచయం లేని వ్యక్తులు చెప్పిన మాటలతో కంప్యూటర్లో గానీ, సెల్ఫోన్లో గానీ రిమోట్ యాక్సెస్ అప్లికేషన్లను నిక్షిప్తం చేసుకోవద్దు. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
మీ కారు బీమా మారుస్తారా..?
కారు కొనుక్కునేటప్పుడు అనేక విషయాలు ఆలోచిస్తాం. బోలెడంత రీసెర్చ్ చేస్తాం. మన లైఫ్‌స్టయిల్‌కి, బడ్జెట్‌కి తగినట్లుగా ఉంటుందా లేదా అనేది చూసుకుని కొంటాం. ఇలా లక్షలు పోసి కొనుక్కున్న కారు నుంచి పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందాలంటే .. దాని మెయింటెనెన్స్ కూడా ముఖ్యమే. అలాగే, ఎలాంటి దుర్ఘటనా జరగకుండా.. కారు రోడ్డెక్కడానికి ముందే బీమా రక్షణ ఉండటమూ అవసరమే. మరి బీమా పాలసీ తీసుకునే ముందు పాటించాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి చూద్దాం... చాలామటుకు పాలసీలు ఒకే విధంగా కనిపిస్తాయి. ఒకోసారి ఏది తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి తలెత్తుతుంటుంది. ఇలాంటప్పుడు అయిదు అంశాలను కొలమానంగా పెట్టుకుంటే పాలసీ ఎంపిక కొంత సులువవుతుంది. అవేంటంటే.. బ్రాండు, పాలసీ కవరేజీ, కస్టమర్ సర్వీసు, సేవల లభ్యత, ప్రీమియం. బ్రాండు.. కంపెనీ (బ్రాండు) ఎంత పెద్దదైనా కావొచ్చు. క్లెయిముల చెల్లింపులు తదితర అంశాల్లో దాని రికార్డు ఎలా ఉందో చూడాలి. ఎన్ని క్లెయిములు సెటిల్ చేసింది? క్లెయిమ్ సెటిల్మెంట్కు ఎంత సమయం తీసుకుంటోంది? ఇవన్నీ ఆయా బీమా కంపెనీల వెబ్సైట్లలో సాధారణంగా పొందుపర్చి ఉంటాయి. ఈ విషయాల్లో మెరుగైన ట్రాక్ రికార్డున్న సంస్థల పాలసీలు తీసుకుంటే మంచిది. ఒకవేళ ఇప్పటికే వేరే కంపెనీల నుంచి తీసుకున్నా.. మరొక కంపెనీకి బదలాయించుకునేందుకు మోటార్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ సదుపాయం కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో క్రితం పాలసీ ప్రయోజనాలేమీ నష్టపోనక్కర్లేదు. కవరేజీ... ఏ కంపెనీ నుంచి పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకున్నాక.. కవరేజీ గురించి చూసుకోవాలి. సాధారణంగా కారు ఇన్సూరెన్స్ పాలసీలో థర్డ్ పార్టీ లయబిలిటీ, ఓన్ డ్యామేజి అని రెండు కవరేజీలుంటాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీ తప్పనిసరి. ఓన్ డ్యామేజి అన్నది ఐచ్ఛికం. కానీ, ఈ రెండు కవరేజీలు ఉండేలా తీసుకుంటే అటు థర్డ్ పార్టీ రిస్కులతో పాటు ప్రమాదవశాత్తు కారుకేమైనా జరిగినా బీమా రక్షణ ఉంటుంది. కారు ప్రమాదానికి గురైనా, మంటలు.. తుపాను, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల్లోనూ, ఉగ్రవాద దుశ్చేష్టల్లో ధ్వంసమైనా బీమా రక్షణ లభిస్తుంది. ఇక, కారు ఢీకొనడం వల్ల వేరొకరు గాయపడినా, మరణించినా థర్డ్ పార్టీ లయబిలిటీ కింద కవరేజీ లభిస్తుంది. ప్రస్తుతం పాలసీల్లో పలు యాడ్-ఆన్ ఫీచర్లు కూడా వస్తున్నాయి. క్లెయిమ్ కారణంగా కారు రిపేర్ల కోసం గ్యారేజిలో ఉన్నంత కాలం పాలసీదారు రోజువారీ ప్రయాణ ఖర్చులను కూడా చెల్లించేలా యాడ్ ఆన్ కవరేజీ తీసుకోవచ్చు. ఇలాగే, నిల్ డెప్రిసియేషన్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్ట్ లాంటి యాడ్ ఆన్ కవరేజీలు కూడా ఉన్నాయి. అవసరాలకు అనుగుణమైన కవరేజీలను పాలసీదారు ఎంచుకుని తీసుకోవచ్చు. కస్టమర్ సర్వీసులు... మోటార్ ఇన్సూరెన్స్‌లో కస్టమర్ సర్వీసుల విషయానికొస్తే.. ముఖ్యంగా మూడంశాలుంటాయి. అవేంటంటే, పాలసీ జారీ చేయడం, క్లెయిమ్స్‌ని డీల్ చేయడం, ఫిర్యాదులను పరిష్కరించడం. గతంలోలా రోజుల తరబడి నిరీక్షించాల్సిన పని లేకుండా ప్రస్తుతం చాలా బీమా కంపెనీలు అప్పటికప్పుడు పాలసీలను జారీ చేస్తున్నాయి. మార్పులు, చేర్పులూ ఏమైనా చేయాల్సి వచ్చినా సత్వరమే చేస్తున్నాయి. ఇక క్లెయిమ్‌ల విషయానికొస్తే.. పలు కంపెనీలు క్యాష్‌లెస్ సెటిల్మెంట్ కోసం చాలా చోట్ల గ్యారేజీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తద్వారా పాలసీదారుకు శ్రమ తగ్గుతోంది. కాబట్టి, విస్తృతంగా గ్యారేజీలతో ఒప్పందాలు ఉండటంతో పాటు క్లెయిములను వేగంగా సెటిల్ చేసే బీమా కంపెనీలను ఎంచుకోవాలి. సేవల లభ్యత.. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఎవర్ని సంప్రదించాలో అర్థం కాని పరిస్థితి నెలకొనొచ్చు. ఇలాంటి సమస్యల్లో చిక్కుకోకుండా .. పాలసీదారు అవసరాలకు అనుగుణంగా సత్వరమే స్పందించగలిగే కంపెనీని ఎంచుకోవాలి. పలు కంపెనీలు కస్టమర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ సేవలు అందిస్తున్నాయి. ప్రీమియం.. పాలసీ తీసుకోవడంలో.. ఎంత ప్రీమియం చెల్లిస్తున్నామన్నది ముఖ్యమే అయినా, ఇదే ప్రామాణికం కాకూడదు. అన్నింటికన్నా తక్కువ ప్రీమియం ఉందనే కారణంతో కంపెనీని ఎంచుకోకూడదు. పై అంశాలన్నీ చూసి మరీ సంస్థను ఎంచుకోవాలి. సాధారణంగా ప్రమాదాలు ఎంత ఎక్కువ జరిగే అవకాశం ఉంటే.. ప్రీమియాలూ అంత ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా కారు మోడల్, దాన్ని ఉపయోగించే ప్రాంతాన్ని బట్టి ప్రీమియం రేటు ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు కారు ఎంత పాతది, ఎందుకోసం ఉపయోగిస్తున్నారు, రోజువారీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది వంటివికూడా ప్రీమియం రేటు నిర్ధారణలో పరిగణనలోకి తీసుకుంటారు.