మేం వ్యతిరేకం
గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే(నగదు బదిలీ) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం లేఖాస్త్రం సంధించారు. ఈ విధానం నుంచి తమిళనాడును మినహాయించాలని విన్నవించారు.
సాక్షి, చెన్నై: గ్యాస్ సబ్సిడీకి ఆధార్ లింక్ పెట్టడం, వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీని జమ చేసే విధంగా గత యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ ప్రయత్నాలు ఆగాయి. కేంద్రంలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన మోడీ ప్రభుత్వం పాత పాటను అందుకుంటోంది. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ గ్యాస్‌కు లింకు పెట్టే పనిలో పడింది. అలాగే గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేవిధంగా నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ రెండో వారం నుంచి కొన్నిచోట్ల ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. మిగిలిన చోట్ల వినియోగదారుల బ్యాంక్ ఖాతా నంబర్లను డీలర్లు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియను ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత వ్యతిరేకించారు. తాజాగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం లేఖ రాశారు.
ఇదీ సారాంశం: గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేసే విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. తమిళనాడులో గ్యాస్ విని యోగదారులు అధికంగా ఉన్నారని, కేంద్రం లాగే తామూ సబ్సిడీని అందిస్తున్నామని వివరించారు. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం గందరగోళానికి దారి తీస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం ఖాయం అన్నారు.
ఈ పరిస్థితుల్లో ఏ ప్రాతిపదికన సబ్సిడీ ఇస్తారో వినియోగదారులకు తెలియని పరిస్థితులు ఏర్పాడతాయని వివరించారు. అలాగే సబ్సిడీ పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యూపీఏ చర్యను గతంలో వ్యతిరేకించిన వారు నేడు అదే బాటలో నడవడాన్ని ఖండిస్తున్నామన్నారు. తమిళనాడులో బ్యాంక్ సేవలు లేని గ్రామాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, ఈ ప్రజలకు సబ్సిడీ ఎలా ఇవ్వగలరని ప్రశ్నిం చారు. బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ పథకం తమిళనాడులో అమలుకు సాధ్యం కాదని, ఈ దష్ట్యా తమకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.