సెస్‌లు రద్దు: రూ.65 వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేయబోతున్న జీఎస్టీ ప్రక్రియ తుది దశకు వచ్చేస్తోంది. 16 రకాల సెస్‌లను, సర్ఛార్జీలను కేంద్ర కేబినెట్ రద్దు చేసింది. జీఎస్టీ అమలుచేయబోతున్న తరుణంలో ఈ సెస్‌లు భాగమయ్యే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ చట్ట సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణతో ఎక్సైజ్ సర్వీసు టాక్స్ లపై సేకరించే మొత్తం 16 రకాల సెస్‌లను, సర్ఛార్జీలను ప్రభుత్వం కోల్పోతుంది. దీంతో ప్రభుత్వానికి 65వేల కోట్ల రూపాయలను నష్టం వాటిల్లనుంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలుచేయాలని ఎంతో కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఈ మేరకు వడివడిగా అడుగులు వేస్తోంది.
రద్దైన సెస్లలో క్రిషి కల్యాణ్, స్వచ్ఛ్ భారత్ కూడా ఉన్నాయి. దీంతో రూ.65 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తుందని కేబినెట్ తెలిపింది. ఈ నష్టాన్ని పూరించుకోవడానికి ప్రభుత్వం బడ్జెట్లో పలు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. బహుళ పన్నులను జీఎస్టీ తొలగిస్తుందని, ఈ చట్టం అమల్లోకి వచ్చే లోపల పలు రకాల చట్టాలకు సవరణలను లేదా చట్టాలను ఉపసంహరించాల్సి వస్తుందని అధికారిక ప్రకటన వెలువరించింది. కస్టమర్స్ యాక్ట్ 1962కు, కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975కు, సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ 1944ల సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్ 1985 ఉపసంహరణను ఆమోదించింది.