ప్రజలతో కమిషనర్ ముఖాముఖి
హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానని సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భాగవత్ అన్నారు. శనివారం ఆయన మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో ప్రజలతో ముఖాముఖిలో మాట్లాడారు. ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలుగుతోందని అన్నారు. ఇకపై ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఏదైనా కేసులకు సంబంధించి ముందుగా సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్కడ పరిష్కారం కాకుంటే ఏసీపీకి ఫిర్యాదు చేయాలని, అక్కడా పరిష్కారం కాకుంటే డీసీపీని కలవాలని కోరారు. సమస్య ఏదైనా డీసీపీ స్థాయి దాకా దాదాపు రావని, పోలీస్ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ విడిపోయిన తర్వాత మల్కాజిగిరిలో మొదటిసారిగా ఆయన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం మల్కాజిగిరిలో ప్రజలతో ముఖాముఖి ఉంటుందని చెప్పారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ దూరంగా ఉండటం వల్ల అక్కడికి ప్రజలు రావటంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మల్కాజిగిరిలో ఈ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. శనివారం సుమారు 20 మంది వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.