సైయంట్ చేతికి ర్యాంగ్‌సన్స్ ఎలక్ట్రానిక్స్
74 శాతం వాటా కొనుగోలు
ర్యాంగ్‌సన్స్ ఆదాయం రూ. 1,500 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉన్న ర్యాంగ్‌సన్స్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 74 శాతం వాటాను సైయంట్ (ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్) కొనుగోలు చేసింది. మొత్తం నగదు లావాదేవీగా జరిగిన ఈ వాటా కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించిందో మాత్రం తెలియరాలేదు. మిగిలిన 26 శాతం వాటాను అవసరాన్ని బట్టి వచ్చే మూడు నాలుగేళ్లలో కొనుగోలు చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైయంట్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి తెలిపారు. మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న ర్యాంగ్‌సన్స్ ఎలక్ట్రానిక్స్‌లో 1,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, గతేడాది రూ. 1,500 కోట్ల (422 మిలియన్ డాలర్లు) వ్యాపారాన్ని నమోదు చేసింది. ర్యాంగ్సన్కు కీలకమైన ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో మంచి క్లయింట్లు కలిగి ఉండటమే కాకుండా వ్యాపారంలో అత్యధిక భాగం ఎగుమతుల నుంచే సమకూరుతున్నట్లు ఆయన తెలిపారు. వ్యాపారపరంగా ర్యాంగ్సన్లో వాటాను కొనుగోలు చేయడం సైయంట్‌కు చాలా కీలకమైనదని, దీంతో మా కస్టమర్లకు ఎండ్ ప్రోడక్ట్‌ను అందించగలమన్నారు.
మైసూర్లో 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ర్యాంగ్‌సన్స్ ఆదాయంలో ఏటా 15 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నది. మా వ్యాపార వ్యూహం ‘ఎస్3’ (సర్వీసెస్, సిస్టమ్స్, సొల్యూషన్స్)లో భాగంగా ర్యాగ్సన్స్ను కొనుగోలు చేశామని, దీంతో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్ (ఓఈఎమ్) కస్టమర్స్‌తో వ్యాపారం బంధం మరింత బలపడుతుందని సైయంట్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో కృష్ణ బోధనపు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా ప్రచారంలో భాగంగా మా ఖాతాదారులకు ఎండ్ టు ఎండ్ ప్రోడక్టులను అందించే స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. సైయంట్ గత కొంత కాలంగా కంపెనీల కొనుగోళ్లపై దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా ఏడాది కాలంలోగా మూడో కంపెనీని కొనుగోలు చేసింది. గతంలో అమెరికాకు చెందిన సాఫ్టెన్షియల్, ఇన్వైటీ ఇన్సైట్స్ కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.