D. Vaijayanti
-
సేవ్ మీ ప్లీజ్...
హత్యలు... అఘాయిత్యాలు... అక్రమాలు... అరాచకాలు... లంచగొండితనం... అవినీతి... దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు. ఇప్పుడు మరో కొత్త సమస్య... పైరసీ... ఎందరో చలనచిత్ర నిర్మాతల తలరాతలను మారుస్తున్న పైరసీపై కర్రా శేషసాయి (కరూర్ వైశ్యా బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు), శ్రీపాద సందీప్ (మఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్నాడు) సంయుక్తంగా తీసిన లఘుచిత్రం ‘సేవ్ మీ ప్లీజ్’. డెరైక్టర్స్ వాయిస్: మాకు నటన, డెరైక్షన్లంటే ప్రీతి. సినిమాలంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ రంగం వైపు యాక్టివ్‌గా ఉన్నాము. మాకు మా తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం ఉంది. ఇటీవలే విడుదలైన ఒక చిత్రానికి సంబంధించిన పైరసీకి స్పందిస్తూ ఈ లఘుచిత్రం తీశాం. ఈ చిత్రాన్ని ఒక గంటలో షూటింగ్, మరో గంట పోస్ట్ ప్రొడక్షన్ చేశాం. కేవలం రెండు గంటలలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి, సోషల్ నెట్వర్కింగ్ అయిన ట్విటర్, ఫేస్‌బుక్‌లలో ప్రమోట్ చేశాం. ఆ తర్వాత యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేశాం. ఈ చిత్రాన్ని చూసిన సాయి (త్రివిక్రమ్ గారి కో డెరైక్టర్) మాకు ఫోన్ చేసి, మమ్మల్ని అభినందించారు. త్రివిక్రమ్‌గారు కూడా, నచ్చిందని చెప్పారు. మేం ఇంతకుముందు ‘భగవద్గీత’ అనే లఘుచిత్రం తీశాం. త్వరలో మరో లఘుచిత్రం తీయబోతున్నాం. షార్ట్‌స్టోరీ: ఇద్దరు స్నేహితులు ఒక ప్రదేశంలో కలుస్తారు. అందులో ఒక వ్యక్తి డాక్టరు, మరో వ్యక్తి మామూలు ఉద్యోగి. ఆ డాక్డరుకి పదేపదే ఫోన్ వస్తూంటుంది. అన్నిసార్లు మోగుతుండటం వలన, ఇక తప్పదని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వ్యక్తి, ‘మా ఆవిడకు వచ్చే నెలలో డెలివరీ డేట్ ఇచ్చారు కదా. మీరు తీసిన స్కానింగ్ రిపోర్టులో మాకు అమ్మాయో, అబ్బాయో తెలిసి ఉంటుంది కదా! కాస్త చెబుతారా’ అని అడుగుతాడు. అందుకు డాక్టరు స్పందిస్తూ, ‘ముందుగానే చెప్పడం నేరమని మీకు తెలియదా’ అని చాలా సిన్సియర్‌గా చెబుతాడు. వెంటనే పక్కనున్న స్నేహితుడు అందుకు స్పందిస్తూ, ‘నువ్వు నన్ను పైరసీ సీడీ కావాలని అడిగావు. అది కూడా ఇంతే తప్పు కదా!’ అంటాడు. కామెంట్: ప్రస్తుతం సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ సమస్య మీద స్పందిస్తూ కేవలం మూడు నిముషాల నిడివిలో తీసిన ఈ లఘుచిత్రం సినీ రంగానికి సంబంధించిన ప్రతిఒక్కరూ చూసి, తప్పు తెలుసుకోవాలి. చిన్నవయసు పిల్లలు ఎంత బాగా స్పందించారో తెలుసుకోవాలి. సందేశాత్మక చిత్రమైనప్పటికీ, మరీ సందేశం ఇస్తున్నట్టు కాకుండా, స్కానింగ్‌లో ముందుగానే పుట్టబోయేది ఏ బిడ్డో తెలుసుకోవడం వంటి అంశాన్ని తీసుకోవడం చాలా బావుంది. యువతలో ఇటువంటి బాధ్యతాయుతమైన స్పందనను అభినందించి తీరాల్సిందే. ఇందులో టేకింగ్, కథనం, డైలాగ్స్, కెమెరా, ఎడిటింగ్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. కథ పేరును ఎంచుకోవడం కూడా చాలా బావుంది. చిన్న సూచన. చిత్రాలకు పేర్లను సాధ్యమైనంత వరకు తెలుగులో ఇస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ఈ చిత్రానికి మంచి ప్రశంసలు వస్తాయనడంలో సందేహం లేదు. - డా.వైజయంతి -
సాంబార్ ఎక్స్‌ప్రెస్
పడాల్సినవన్నీ పడ్డాక... సాంబార్ తెర్లుతున్నప్పుడు వస్తుంది చూడండీ... ఘుమాయింపు! అప్పుడు నిజంగానే అనిపిస్తుంది... ‘గృహమే కదా స్వర్గసీమ’ అని! ఎక్కడి శరవణ భవన్! ఎక్కడి ఉడిపి క్విజిన్!! మనకేమిటి ఇంత జిహ్వాబంధన్! ఇడ్లీలోకి సాంబార్, వడల్లోకి సాంబార్... విందుల్లోకి సాంబార్! పంటికింద సాంబార్ ముక్కలు నలుగుతుంటే... సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గాత్రమో... చెంబై వైద్యనాథన్ భాగవతార్ స్వరమో... పంచేంద్రియాలను కమ్మేసినట్లు ఉంటుంది! వింటారో, తింటారో మీ ఇష్టం. ఈవారం ‘రుచులు’ మాత్రం మిమ్మల్ని చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కించడం ఖాయం. లేదంటే... బెంగళూరు ఎక్స్‌ప్రెస్! గుమ్మడి సాంబార్ కావలసినవి: తీపిగుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు ఉల్లిపాయలు - మూడు; చింతపండు - నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి); పచ్చిమిర్చి - 6; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; కారం - అర టీ స్పూను; బియ్యప్పిండి - టీ స్పూను; మెంతులు - ఐదారు గింజలు; ఆవాలు - అర టీ స్పూను; నూనె - టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు ఇంగువ - చిటికెడు తయారి: ఒక పాత్రలో గుమ్మడికాయ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, మెంతులు, నీరు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి, ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. పసుపు, కారం, చింతపండు రసం, రెండు కప్పుల నీరు జత చేసి, బాగా కలపాలి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీరు, బియ్యప్పిండి బాగా కలిపి, ఉడుకుతున్న సాంబార్లో వేసి పదినిముషాలు ఉంచాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి, సాంబార్లో వేయాలి. చివరగా సాంబార్ పొడి, కొత్తిమీర వేసి ఒక్క పొంగు రానిచ్చి దించేయాలి. పచ్చిమామిడికాయ సాంబార్ కావలసినవి: మామిడికాయ ముక్కలు - కప్పు కందిపప్పు - పావుకప్పు శనగపప్పు - రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు - రెండు టేబుల్ స్పూన్లు ఉల్లితరుగు - అర కప్పు సాంబార్ పొడి - 2 టీ స్పూన్లు చింతపండు - కొద్దిగా (నానబెట్టి రసం తీయాలి) బెల్లం తురుము - మూడు టేబుల్ స్పూన్లు కారం - కొద్దిగా ఉప్పు - తగినంత పసుపు - పావు టీ స్పూను ఆవాలు - అర టీ స్పూను మెంతులు - పావు టీ స్పూను జీలకర్ర - అర టీ స్పూను ఇంగువ - చిటికెడు ఎండుమిర్చి - 3 కరివేపాకు - రెండు రెమ్మలు నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారి: అన్ని పప్పులను శుభ్రంగా కడిగి, తగినంత నీరు పోసి కుకర్‌లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దించేయాలి. చల్లారాక మెత్తగా మాష్ చేయాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లితరుగు జత చేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి. టొమాటో తరుగు, కొద్దిగా నీరు వేసి మూత పెట్టి మూడు నిముషాలు ఉంచాలి. మెత్తగా చేసిన పప్పు, ఉప్పు, పసుపు, కారం, చింతపండురసం, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. మరుగుతుండగా సాంబార్ పొడి వేయాలి. వరుత్తరాచ సాంబార్ కావలసినవి: కందిపప్పు - పావు కప్పు పసుపు - పావు టీ స్పూను పచ్చిమిర్చి - 4 చిలగడదుంప ముక్కలు - అర కప్పు ఉల్లి తరుగు - అరకప్పు మునగకాడ - 1 (పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయాలి) క్యారట్ - 1 బెండకాయ ముక్కలు - అర కప్పు టొమాటో ముక్కలు - అర కప్పు వంకాయ - 1 చింతపండు - నిమ్మకాయ సైజు పరిమాణంలో సాంబారు ఉల్లిపాయలు - 10 కరివేపాకు - నాలుగు రెమ్మలు కొబ్బరితురుము - అర కప్పు మెంతుల పొడి - పావు టీ స్పూను ఇంగువ - పావు టీ స్పూను ధనియాల పొడి - 2 టేబుల్‌స్పూన్లు కారం - టీ స్పూను పోపుకోసం ఆవాలు - టీ స్పూను కొబ్బరినూనె - టేబుల్ స్పూను మినప్పప్పు - టీ స్పూను ఎండుమిర్చి - 2 కరివేపాకు - రెండు రెమ్మలు తయారి: ఒక గిన్నెలో తగినంత నీరు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిలగడదుంప, క్యారట్, కీర, బెండ, వంగ, టొమాటో... ముక్కలు వేసి ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తరవాత మునగకాడలు, చింతపండు రసం వేయాలి. కందిపప్పుకి తగినంత నీరు జత చేసి కుకర్‌లో ఉంచి, ఆరు విజిల్స్ వచ్చాక దించేయాలి. బాణలిలో మెంతులపొడి వేసి కొద్దిగా వేయించి, తీసేయాలి. అదే బాణలిలో కొబ్బరి తురుము, కరివేపాకు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. ధనియాలపొడి, కారం, ఇంగువ, మెంతులపొడి, పసుపు వేసి బాగా కలపాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఉడుకుతున్న కూరముక్కలలో ఈ పేస్ట్ వేసి కలిపి, బాగా మరిగాక దించేయాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి సాంబార్లో వేసి కలపాలి. ఉడిపి సాంబార్ కావలసినవి: కందిపప్పు - 50 గ్రా.; బంగాళదుంప ముక్కలు - అర కప్పు; క్యారట్ తరుగు - అర కప్పు; ఉల్లితరుగు - పావు కప్పు; ఉప్పు - తగినంత; చింతపండు - చిన్న నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి); బెల్లం తురుము - రెండు టీ; స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు పేస్ట్ కోసం: జీలకర్ర - అర టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఎండుమిర్చి - 4; పచ్చి శనగపప్పు - రెండు టీ స్పూన్లు; ధనియాలు - టేబుల్ స్పూను, మిరియాలు - 6 గింజలు; కొబ్బరితురుము - అర కప్పు పోపు కోసం: ఆవాలు - అర టీ స్పూను; మినప్పప్పు - పావు టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; ఇంగువ - చిటికెడు; పచ్చిమిర్చి - 3; కొత్తిమీర - చిన్న కట్ట. తయారి: కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినంత నీరు పోసి కుకర్‌లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దించే యాలి ఒక గిన్నెలో బంగాళదుంప, క్యారట్, ఉల్లిపాయ... ముక్కలు, ఉప్పు, తగినంత నీరు పోసి ఉడికించాలి బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి తురుము ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి చింతపండు రసం, ఉప్పు వేసి ఐదు నిముషాలు మరిగించాలి. ఉడికించి మెత్తగా చేసుకున్న కందిపప్పు, కూరముక్కలు, మసాలా పేస్ట్, బెల్లం తురుము వేసి కలపాలి తగినంత నీరు జత చేసి, మంట తగ్గించి 15 నిముషాలు ఉంచి దించేయాలి. పాన్‌లో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక- ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించి, సాంబార్లో వేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చె న్నై సాంబార్ కావలసినవి: ఎర్ర కందిపప్పు - కప్పు; మునగకాడ - 1 (ముక్కలుగా కట్ చేయాలి) చిన్న వంకాయలు - 10 (పొడవుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి); టొమాటో తరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేసుకోవాలి); కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు ఉప్పు - తగినంత; చింతపండు - కొద్దిగా (నానబెట్టి రసం తీయాలి) పేస్ట్ కోసం: పుట్నాలపప్పు - 2 టేబుల్ స్పూన్లు టొమాటో - 1 (పెద్దది); కొబ్బరితురుము - టేబుల్ స్పూను; సాంబారు పొడి - 4 టీ స్పూన్లు ఇంగువ - పావు టీ స్పూను; ఆవాలు - పావు టీ స్పూను; జీలకర్ర - టీ స్పూనుఛ మినప్పప్పు - టీ స్పూను; ఎండుమిర్చి - 1; కరివేపాకు - రెండు రెమ్మలు తయారి: ఎర్ర కందిపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుకర్‌లో ఉంచి ఏడు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక, మెత్తగా మెదపాలి. మిక్సీలో పుట్నాలపప్పు, టొమాటో, కొబ్బరితురుము, సాంబారు పొడి, ఇంగువ వేసి మెత్తగా పేస్ట్ చేస్తే సాంబార్ మసాలా రెడీ అవుతుంది. ఒక గిన్నెలో మెదిపి ఉంచుకున్న పప్పు, నాలుగు కప్పుల నీరు, కూరముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. చింతపండు పులుసు వే సి మరిగించాలి. బాగా మరిగాక, మెత్తగా చేసి ఉంచుకున్న సాంబార్ మసాలా వేసి బాగా కలిపి ఐదునిముషాలు ఉంచాలి. వేరొక బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. మధ్యలోకి నాలుగు ముక్కలుగా తరిగి ఉంచుకున్న వంకాయలను జత చేసి వేయించాలి. ఉడుకుతున్న సాంబారులో వేసి, బాగా మరిగిన తరవాత దించేయాలి. సాంబారు పొడి కందిపప్పు - 100 గ్రా. ఎండుమిర్చి - 50 గ్రా. ధనియాలు - 50 గ్రా. శనగపప్పు - 25 గ్రా. మినప్పప్పు - 25 గ్రా. బియ్యం - 10 గ్రా. జీలకర్ర - 2 టీ స్పూన్లు మిరియాలు - టీ స్పూను ఎండుకొబ్బరి - రెండు టీ స్పూన్లు మెంతులు - టీ స్పూను పసుపు - చిటికెడు నూనె - టీ స్పూను ఉప్పు - కొద్దిగా తయారి: బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక, పైన చెప్పిన పదార్థాలను విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. చల్లారాక కొద్దిగా ఉప్పు జత చేసి అన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. - సేకరణ: డా.వైజయంతి -
నోరు తెరవరాకన్నయ్యా..!
‘ఊహూ’ అంటాడు, తల అడ్డంగా ఊపుతూ. చెవి మెలిపెడుతుంది తల్లి యశోద! ‘ఆ..’ అంటాడు. అంతే! యశోద నోరు తెరవాల్సి వస్తుంది! చిన్నారి కన్నయ్య నోట్లో... పదునాలుగు భువన భాండమ్ములు! ఆ ‘భాండమ్ము’లలో మిల్క్ మైసూర్‌పాక్, మలై పేడా, పనీర్ కలాకండ్, డ్రైఫ్రూట్ లడ్డూ, శ్రీఖండ్... ఉన్నాయని ‘భాగవతం’లో పోతన ప్రత్యేకంగా చెప్పలేదు కానీ... ఉండే ఉంటాయి. లిటిల్ కృష్ణకు పాలు, వెన్న ఇష్టం కదా! అందుకే ఈ కృష్ణాష్టమికి మనం... ఆయన పేరు చెప్పుకుని మిల్క్ స్వీట్‌ని నోట్లో వేసుకుందాం. జయకృష్ణా... ముకుందా... మురారీ.... డ్రైఫ్రూట్ లడ్డూ కావలసినవి: ఖర్జూరాలు, ఎండుకొబ్బరి, పుచ్చకాయ గింజలు, కర్బూజా గింజలు, పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు... మొత్తం కలిపి అరకేజీ ఉండాలి. (నచ్చిన ఏ గింజలనైనా వాడుకోవచ్చు); బెల్లం - అరకేజీ; పటికబె ల్లం - మూడు టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను. తయారి: డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పొడిలా అయిపోకూడదు) ఖర్జూరాలను బాగా సన్నగా కట్‌చేయాలి. మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మంట తగ్గించి, డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి. ఖర్జూరం తరుగు, ఏలకుల పొడి, పటికబెల్లం వేసి వేయించి బాగా కలిశాక పక్కన ఉంచుకోవాలి. బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీరు ఒక పాత్రలో వేసి బెల్లాన్ని కరిగించి వడబోస్తే, తుక్కు బయటకు పోతుంది. ఈ మిశ్రమానికి టేబుల్ స్పూన్ నెయ్యి జతచేయాలి. ఉండపాకం వచ్చేవరకు ఉంచాలి; పటికబెల్లం జతచేయాలి; ఈ మిశ్రమాన్ని డ్రైఫ్రూట్స్ మీద పోసి బాగా కలిపి మరోమారు స్టౌ మీద ఉంచి కాసేపు ఉడికించాలి; కిందకు దించి ఉండలు చేయాలి. శ్రీఖండ్ కావలసినవి పెరుగు - రెండు కప్పులు; చల్లటి పాలు - 2 టేబుల్ స్పూన్లు; కుంకుమపువ్వు - చిటికెడు; పంచదార - అరకప్పు; జాజికాయ పొడి - చిటికెడు; ఏలకులపొడి - చిటికెడు; బాదంపప్పులు - 2 (గార్నిషింగ్ కోసం) తయారి: (గడ్డపెరుగు లేకపోతే, ఇంట్లో ఉన్న పెరుగును ఒక వస్త్రంలో వేసి మూట కట్టి, సుమారు నాలుగైదు గంటలు వేలాడదీయాలి. నీరంతా పోయి, గట్టి పెరుగు మిగులుతుంది) చిన్నపాత్రలో పాలు తీసుకుని, స్టౌ మీద ఉంచి గోరువెచ్చన చేసి, కిందకు దింపి, కుంకుమ పువ్వు జత చేసి బాగా కలిపి 5 నిముషాలు పక్కన ఉంచాలి. మరొక పాత్రలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి. రెండూ బాగా కలిసేలా చిలకాలి. కుంకుమపువ్వు జతచేసిన పాలు కలపాలి. ఏలకులపొడి జత చేయాలి. గ్లాసులలో పోసి, బాదంపప్పులతో, కుంకుమపువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఖాయం కావలసినవి: బెల్లం తురుము - కప్పు; శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, జీలకర్ర, వాము, కరక్కాయ - అన్నీ సమపాళ్లలో (కప్పు బెల్లంతో సమానంగా ఉండాలి); నెయ్యి - కప్పు తయారి: శొంఠి, పిప్పళ్లు... ఈ పదార్థాలను బాణలిలో దోరగా వేయించాలి. మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఒక పాత్రలో శొంఠి, పిప్పళ్ల... మిశ్రమం, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. నెయ్యి జతచేస్తూ ఉండలు చేసుకోవాలి. (ఇది బాలింతలకు పథ్యంగా పెడతారు. ఈ ఖాయం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం) మిల్క్ మైసూర్‌పాక్ కావలసినవి: పాలపొడి - కప్పు; పంచదార - కప్పు; నీరు - అర కప్పు; మైదా - రెండు టేబుల్ స్పూన్లు; నెయ్యి - కప్పు; ఉప్పు - చిటికెడు. తయారి: ఒక పాత్రలో పంచదార, నీరు పోసి తీగపాకం వచ్చేవరకు స్టౌ మీద ఉంచాలి ఒక పాత్రలో పాలపొడి, మైదా, ఉప్పు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి, స్టౌ మీద ఉంచి రెండు మూడు నిముషాలు బాగా కలిపి మంట తగ్గించాలి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి జతచేసి, మరో మూడు నిముషాలు ఉంచాలి ఈ మిశ్రమం పాత్ర నుంచి విడివడుతుండగా మరో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి, మంట తగ్గించాలి ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి రాసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో పోసి, బాగా చల్లారాక మనకు ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవాలి. మలై పేడా కావలసినవి: కండెన్స్డ్ మిల్క్ - ఒక టిన్; పాలు - ఒకటిన్నర కప్పులు; కార్న్‌ఫ్లోర్ - టీ స్పూన్; సిట్రిక్ ఆసిడ్ - అర టీ స్పూను; ఏలకులపొడి - టీ స్పూన్; నెయ్యి - టేబుల్ స్పూన్; ఫుడ్ కలర్ (పసుపు రంగు) - నాలుగు చుక్కలు తయారి: పాన్ వేడి చేసి అందులో నెయ్యి వేసి కరిగించాలి కండెన్స్డ్ మిల్క్, పాలు, సిట్రిక్ ఆసిడ్ (కొద్దిగా నీటిలో వేసి బాగా కలపాలి) వేసి కలపాలి బాగా దగ్గరపడేవరకు ఆపకుండా కలుపుతుండాలి చిన్నపాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి అందులో కార్న్‌ఫ్లోర్ వేసి పేస్ట్‌లా కలిపి, పాల మిశ్రమంలో వేయాలి విడివడేవరకు బాగా కలుపుతుండాలి రంగునీరు జతచేయాలి పెద్ద ప్లేట్లోకి తిరగబోసి పేడాల మాదిరిగా తయారుచేయాలి ఏలకులపొడితో గార్నిష్ చేయాలి. పనీర్ కలాకండ్ కావలసినవి: తాజా పనీర్ - ముప్పావు కప్పు (ఉప్పు లేని పనీర్); పాలపొడి - 8 టేబుల్ స్పూన్లు; పంచదార - పావు కప్పు; తాజా క్రీమ్ - అర కప్పు; ఏలకులపొడి - రెండు టేబుల్ స్పూన్లు; బాదంపప్పులు - 10. తయారి అన్ని పదార్థాలను ఒక పాత్రలో వేసి స్టౌ మీద ఉంచి మంట తగ్గించి, ఆపకుండా కలుపుతూ సుమారు 15 నిముషాలు ఉంచాలి మిశ్రమం బాగా చిక్కబడ్డాక దించేయాలి ఒక ప్లేట్లో ఈ మిశ్రమాన్ని పోసి, సమానంగా పరిచి, చల్లారాక, నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేయాలి బాదం పప్పులతో గార్నిష్చేయాలి. (తాజా పనీర్ వాడితే మంచిది) సేకరణ డా.వైజయంతి