నోరు తెరవరాకన్నయ్యా..! | special Sweets for Krishnashtami | Sakshi
Sakshi News home page

నోరు తెరవరాకన్నయ్యా..!

Published Fri, Aug 23 2013 11:10 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

నోరు తెరవరాకన్నయ్యా..!

నోరు తెరవరాకన్నయ్యా..!

 ‘ఊహూ’ అంటాడు, తల అడ్డంగా ఊపుతూ.  
 చెవి మెలిపెడుతుంది తల్లి యశోద!
 ‘ఆ..’ అంటాడు.
 అంతే! యశోద నోరు తెరవాల్సి వస్తుంది!
 చిన్నారి కన్నయ్య నోట్లో...
 పదునాలుగు భువన భాండమ్ములు!
 ఆ ‘భాండమ్ము’లలో మిల్క్ మైసూర్‌పాక్, మలై పేడా, పనీర్ కలాకండ్, డ్రైఫ్రూట్ లడ్డూ, శ్రీఖండ్... ఉన్నాయని ‘భాగవతం’లో పోతన ప్రత్యేకంగా చెప్పలేదు కానీ... ఉండే ఉంటాయి.
 లిటిల్ కృష్ణకు పాలు, వెన్న ఇష్టం కదా!
 అందుకే ఈ కృష్ణాష్టమికి మనం... ఆయన పేరు చెప్పుకుని
 మిల్క్ స్వీట్‌ని నోట్లో వేసుకుందాం.
 జయకృష్ణా... ముకుందా... మురారీ....

 
 డ్రైఫ్రూట్ లడ్డూ

 కావలసినవి:
 ఖర్జూరాలు, ఎండుకొబ్బరి, పుచ్చకాయ గింజలు, కర్బూజా గింజలు, పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు... మొత్తం కలిపి అరకేజీ ఉండాలి. (నచ్చిన ఏ గింజలనైనా వాడుకోవచ్చు); బెల్లం - అరకేజీ; పటికబె ల్లం - మూడు టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను.
 
 తయారి:  
 
 డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పొడిలా అయిపోకూడదు)  
 
 ఖర్జూరాలను బాగా సన్నగా కట్‌చేయాలి.  
 
 మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మంట తగ్గించి, డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి.
 
 ఖర్జూరం తరుగు, ఏలకుల పొడి, పటికబెల్లం వేసి వేయించి బాగా కలిశాక పక్కన ఉంచుకోవాలి.
 
 బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీరు ఒక పాత్రలో వేసి బెల్లాన్ని కరిగించి వడబోస్తే, తుక్కు బయటకు పోతుంది. ఈ మిశ్రమానికి టేబుల్ స్పూన్ నెయ్యి జతచేయాలి. ఉండపాకం వచ్చేవరకు ఉంచాలి;  
 
 పటికబెల్లం జతచేయాలి;  
 
 ఈ మిశ్రమాన్ని డ్రైఫ్రూట్స్ మీద పోసి బాగా కలిపి మరోమారు స్టౌ మీద ఉంచి కాసేపు ఉడికించాలి;  
 
 కిందకు దించి ఉండలు చేయాలి.
 
  శ్రీఖండ్

 కావలసినవి
 పెరుగు - రెండు కప్పులు; చల్లటి పాలు - 2 టేబుల్ స్పూన్లు; కుంకుమపువ్వు - చిటికెడు; పంచదార - అరకప్పు; జాజికాయ పొడి - చిటికెడు; ఏలకులపొడి - చిటికెడు; బాదంపప్పులు - 2 (గార్నిషింగ్ కోసం)
 
 తయారి:
 (గడ్డపెరుగు లేకపోతే, ఇంట్లో ఉన్న పెరుగును ఒక వస్త్రంలో వేసి మూట కట్టి, సుమారు నాలుగైదు గంటలు వేలాడదీయాలి. నీరంతా పోయి, గట్టి పెరుగు మిగులుతుంది)
 
 చిన్నపాత్రలో పాలు తీసుకుని,  స్టౌ మీద ఉంచి గోరువెచ్చన చేసి, కిందకు దింపి, కుంకుమ పువ్వు జత చేసి బాగా కలిపి 5 నిముషాలు పక్కన ఉంచాలి.
 
 మరొక పాత్రలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి.
 
 రెండూ బాగా కలిసేలా చిలకాలి.
 
 కుంకుమపువ్వు జతచేసిన పాలు కలపాలి.
 
 ఏలకులపొడి జత చేయాలి.
 
  గ్లాసులలో పోసి, బాదంపప్పులతో, కుంకుమపువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
 
 ఖాయం

 కావలసినవి:

బెల్లం తురుము - కప్పు; శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, జీలకర్ర, వాము, కరక్కాయ - అన్నీ సమపాళ్లలో (కప్పు బెల్లంతో సమానంగా ఉండాలి); నెయ్యి - కప్పు
 
 తయారి:  
 శొంఠి, పిప్పళ్లు... ఈ పదార్థాలను బాణలిలో దోరగా వేయించాలి.  
 
 మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.  
 
 ఒక పాత్రలో శొంఠి, పిప్పళ్ల... మిశ్రమం, బెల్లం తురుము వేసి బాగా కలపాలి.  
 
 నెయ్యి జతచేస్తూ ఉండలు చేసుకోవాలి. (ఇది బాలింతలకు పథ్యంగా పెడతారు. ఈ ఖాయం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం)
 
 మిల్క్ మైసూర్‌పాక్
 
 కావలసినవి:
 పాలపొడి - కప్పు; పంచదార - కప్పు; నీరు - అర కప్పు; మైదా - రెండు టేబుల్ స్పూన్లు; నెయ్యి - కప్పు; ఉప్పు - చిటికెడు.
 
 తయారి:

 ఒక పాత్రలో పంచదార, నీరు పోసి తీగపాకం వచ్చేవరకు స్టౌ మీద ఉంచాలి
 
 ఒక పాత్రలో పాలపొడి, మైదా, ఉప్పు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి, స్టౌ మీద ఉంచి రెండు మూడు నిముషాలు బాగా కలిపి మంట తగ్గించాలి
 
 మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి జతచేసి, మరో మూడు నిముషాలు ఉంచాలి
 
  ఈ మిశ్రమం పాత్ర నుంచి విడివడుతుండగా మరో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి, మంట తగ్గించాలి
 
 ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి రాసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో పోసి, బాగా చల్లారాక మనకు ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవాలి.
 
 మలై పేడా
 
 కావలసినవి:
 కండెన్స్‌డ్ మిల్క్ - ఒక టిన్; పాలు - ఒకటిన్నర కప్పులు; కార్న్‌ఫ్లోర్ - టీ స్పూన్; సిట్రిక్ ఆసిడ్ - అర టీ స్పూను; ఏలకులపొడి - టీ స్పూన్; నెయ్యి - టేబుల్ స్పూన్; ఫుడ్ కలర్ (పసుపు రంగు) - నాలుగు చుక్కలు
 
 తయారి:  
 పాన్ వేడి చేసి అందులో నెయ్యి వేసి కరిగించాలి కండెన్స్‌డ్ మిల్క్, పాలు, సిట్రిక్ ఆసిడ్ (కొద్దిగా నీటిలో వేసి బాగా కలపాలి) వేసి కలపాలి  
 
 బాగా దగ్గరపడేవరకు ఆపకుండా కలుపుతుండాలి  
 
 చిన్నపాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి అందులో కార్న్‌ఫ్లోర్ వేసి పేస్ట్‌లా కలిపి, పాల మిశ్రమంలో వేయాలి  
 
 విడివడేవరకు బాగా కలుపుతుండాలి  
 
 రంగునీరు జతచేయాలి
 
 పెద్ద ప్లేట్‌లోకి తిరగబోసి పేడాల మాదిరిగా తయారుచేయాలి  
 
 ఏలకులపొడితో గార్నిష్ చేయాలి.
 
 పనీర్ కలాకండ్

 
 కావలసినవి:
 తాజా పనీర్ - ముప్పావు కప్పు (ఉప్పు లేని పనీర్); పాలపొడి - 8 టేబుల్ స్పూన్లు; పంచదార - పావు కప్పు; తాజా క్రీమ్ - అర కప్పు; ఏలకులపొడి - రెండు టేబుల్ స్పూన్లు; బాదంపప్పులు - 10.
 
 తయారి
 అన్ని పదార్థాలను ఒక పాత్రలో వేసి స్టౌ మీద ఉంచి మంట తగ్గించి, ఆపకుండా కలుపుతూ సుమారు 15 నిముషాలు ఉంచాలి
     
 మిశ్రమం బాగా చిక్కబడ్డాక దించేయాలి
     
 ఒక ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని పోసి, సమానంగా పరిచి, చల్లారాక, నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేయాలి
     
 బాదం పప్పులతో గార్నిష్‌చేయాలి. (తాజా పనీర్ వాడితే మంచిది)
 
 సేకరణ
 డా.వైజయంతి

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement