Guvvalacheruvu Palakova: గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్‌! | Guvvalacheruvu Palakova: Milk Sweet, Making, Best Palakova in Annamayya District | Sakshi
Sakshi News home page

Guvvalacheruvu Palakova: గువ్వలచెరువు కేంద్రంగా పాలకోవా తయారీ

Published Mon, Sep 26 2022 3:30 PM | Last Updated on Mon, Sep 26 2022 3:49 PM

Guvvalacheruvu Palakova: Milk Sweet, Making, Best Palakova in Annamayya District - Sakshi

పాలను బట్టీ వద్ద మరిగిస్తున్న దృశ్యం

సాక్షి రాయచోటి: గువ్వలచెరువు పాలకోవా.. నోటి తీపికే కాదు.. ఊరూరా గుర్తింపు పొందింది. రాష్ట్రాలే కాదు.. ఖండాతరాలు దాటి వెళుతోంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని అనేక మంది ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. అక్కడ కూడా గువ్వలచెరువు పాలకోవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వందల ఏళ్ల కాలం నుంచి ఇక్కడివారు పాలకోవా తయారు చేస్తూ రుచిలో శుచిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గువ్వల చెరువు మెయిన్‌రోడ్డు మీద ఉండే 60 షాపులే కాకుండా గ్రామంలో పాలకోవాను తయారు చేసే బట్టీలు 15 వరకు ఉన్నాయి. కోవా అనగానే గువ్వలచెరువు నుంచి తెచ్చారా? అనడం చూస్తే ఆ కోవాకు ఎంతటి గుర్తింపు ఉందో అర్థమవుతుంది. ప్రతిరోజు ఐదు వేల లీటర్ల వరకు పాలు వస్తుండగా... 2000 కిలోల వరకు పాలకోవాను తయారు చేసి విక్రయిస్తుంటారు. 


గువ్వల చెరువు గ్రామంలో సుమారు 1500 మంది జనాభా ఉంది. అధికభాగం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు నాయుళ్లు, వడ్డెర, గిరిజన కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. గ్రామంలో తరతరాల నుంచి అంటే దాదాపు వందేళ్లకు పైగా కోవా తయారు చేస్తూ వస్తున్నారు. ప్రతినిత్యం 100 కుటుంబాల వారు కోవా తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్‌ కావడంతో జీవనోపాధిని వదులుకోలేక కొనసాగిస్తున్నారు. తయారు చేసే సమయంలో కూడా అనేక రకాల కష్టాలు ఉన్నాయి. గోలాల్లో పాలు పోసి ఐదు గంటలపాటు వేడి చేసే సమయంలో విపరీలమైన వేడి పొగతో కళ్లు ఎర్రబారడం, నీళ్లు కారడం, మంటకు గురికావడం జరుగుతుంది. 


కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపైన గ్రామం ఉండడంతో నిత్యం వేలాది వాహనాలు గువ్వల చెరువు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయంలో పదుల సంఖ్యలో లారీలో ఆగి ఉంటాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, మహరాష్ట్ర, పంజాబ్, కేరళ తదితర ప్రాంతాలకు వెళ్లే లారీల వారు పాలకోవాను ఆర్డర్లపై తీసుకెళుతుంటారు. అంతేకాకుండా కువైట్, సౌదీ అరేబియా, మస్కట్, ఖత్తర్, దుబాయ్, బెహరీన్‌ తదితర దేశాలకు కూడా బంధువులు, స్నేహితుల ద్వారా పాల కోవాను ప్యాకింగ్‌ చేసి పంపిస్తుంటారు. పాలకోవా సుదీర్ఘకాలంపాటు నిల్వ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతర దేశానికి తరలిస్తుంటారు. దీని తయారీకి అవసరమైన పాలను తయారీదారులు ప్రత్యేకంగా ఆటోల ద్వారా పీలేరు, రాయచోటి, మదనపల్లె తదితర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. 


పాలకోవాను గ్రామంలో బట్టీల వద్ద తయారు చేసిన అనంతరం పెద్దపెద్ద పాత్రలలో రోడ్డుపై ఉన్న షాపులకు సరఫరా చేస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా రుచికరంగా మంచి గుర్తింపు ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళుతుంటారు. అంతేకాకుండా ప్రతిరోజు 15 ఆటోల ద్వారా వివిధ జిల్లాలకు కూడా తీసుకెళ్లి విక్రయాలు సాగిస్తున్నారు. గతంలో ఈ మార్గంలో వెళుతున్న జాతీయ నేతలైన దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూతోపాటు ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సైతం గువ్వుల చెరువు పాలకోవా రుచిచూసి మెచ్చుకున్నట్లు పలువురు గ్రామస్తులు తెలియజేశారు. 


తయారీ విధానం
పాలకోవాను తయారీదారులు ముందుగా పాలను తీసుకొచ్చి పెద్ద గోలాల్లో వేసిసుమారు ఐదు గంటలపాటు మరగబెడతారు. ఒకవైపు గరిటెతో కలియబెడుతూ చిక్కదనం కోసం పొంగు రాకుండా చూసుకుంటారు. పాలు బాగా మరిగిన తర్వాత చక్కెర, ఇతర పదార్థాలు వేసి మరో అరగంట నుంచి గంటపాటు వేడి చేస్తారు. తద్వారా పాలకోవా రూపుదిద్దుకుంటుంది. అవసరమైన కట్టెలనుకూడా సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి తీసుకొస్తారు. 


గోలంలో పాలు ఉడికిస్తున్న ఇతని పేరు షేక్‌ జమాల్‌వలి. గువ్వలచెరువు గ్రామం. ఎన్నో ఏళ్ల నుంచి పాలకోవా తయారు చేస్తున్నారు. ఆర్డర్లను బట్టి పాలను ప్రత్యేకంగా ఆటోలో క్యాన్ల ద్వారా పీలేరు, మదనపల్లె, రాయచోటిలకు వెళ్లి తెచ్చుకుంటారు. ఈ ప్రాంతానికి చెందిన వారు అధికంగా ఇతర దేశాల్లో చాలా మంది ఉండడంతో అక్కడకి తీసుకెళ్లేందుకు ఆర్డర్లు ఇస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు, ప్రొద్దుటూరు, కడప, మదనపల్లె, రాజంపేట, రాయచోటితోపాటు వివిధ ప్రాంతాల్లోని బేకరీలకు కూడా గువ్వలచెరువు నుంచే పాలకోవాను పంపిస్తుంటారు. (క్లిక్: వెయ్యేళ్ల చరిత్రకు పూర్వ వైభవం.. నాడు రాజుల నేతృత్వంలో.. నేడు సీఎం హోదాలో!)


కల్తీ లేని కోవా 

కల్తీ లేకుండా నాణ్యమైన పాలకోవా అందిస్తాం. ఇక్కడి పాలకోవా మంచి రుచికరంగా ఉంటుంది. గ్రామంలో తయారు చేసి దుకాణాలకు ఆర్డర్లపై అందజేస్తారు. సుమారు 100 కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సరుకు తీసుకెళుతుంటారు. 
– అబ్దుల్‌ మతిన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు  


వ్యాపారం బాగుంది 

పాలకోవాను నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాం. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడ ఆగుతాయి. కార్లలో ప్రత్యేకంగా వచ్చి కోవాను తీసుకెళుతుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీల డ్రైవర్లు, క్లీనర్లు కూడా తీసుకెళతారు. ప్రతిరోజు మా షాపులో రూ. 4 వేల వరకు వ్యాపారం జరుగుతుంది. పదిహేనేళ్ల నుంచి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాం.   
– పఠాన్‌ అజీజ్‌ఖాన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement