కర్రసాములో ప్రత్యేకత చాటుకుంటున్న మంగంపేట | Annamayya District: Youth Take to Karra Samu in Mangampeta | Sakshi
Sakshi News home page

కర్రసాములో ప్రత్యేకత చాటుకుంటున్న మంగంపేట

Published Wed, Jul 27 2022 2:45 PM | Last Updated on Wed, Jul 27 2022 2:59 PM

Annamayya District: Youth Take to Karra Samu in Mangampeta - Sakshi

కర్రసాము నేర్చుకుంటున్న మంగంపేట గ్రామ యువకులు, బాలలు

సాక్షి, రాయచోటి(అన్నమయ్య జిల్లా) :  మన పూర్వీకుల కాలంలో బందిపోటు, గజదొంగలు, శత్రువులు గ్రామాలపై దాడి చేసి దోచుకొని వెళ్తుండేవారు. అప్పట్లో గ్రామాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం యువత కర్రసాము విద్యను అభ్యసించి ప్రావీణ్యం పొందేవారు. ఇందుకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటుచేసి కర్రసాములో శిక్షణ ఇచ్చే వారు. కర్రసాములో బాగా రాణించిన వారికి సంఘంలో ప్రత్యేక ఆదరణ లభించేంది. కాలానుగుణంగా  అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడంతో కర్రసాము విద్య మరుగున పడిపోయింది. 


అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఆనాటి కర్రసాములో ప్రావీణ్యం పొందిన వారు ఉన్నారు. పెళ్లిసందడి, జాతర్లలో, ఉరుసు ఉత్సవాలతోపాటు పండుగ, పబ్బాల సమయంలోనూ కర్రసాము తళుక్కుమంటోంది. పూర్వకాలం నుంచి వస్తున్న అనేక విద్యల్లో కర్రసాము అనేది విలువైనదిగా గ్రామీణ ప్రాంత జనం భావించేవారు. కాలంలో మార్పు.. కంప్యూటర్‌ యుగం రాకతో పాతకాలం సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. అయితే ఓబులవారిపల్లె మండలం మంగంపేటకు చెందిన పలువురు యువకులు, చిన్నారులు కర్రసాము పట్ల ఆసక్తి చూపడంతోపాటు నేర్చుకోవడం విశేషం.  


అలా గిర్రున తిప్పేస్తున్నారు.. అంతే..!
                                   
మంగంపేట గ్రామస్తులు తమ పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో పునరావాస కాలనీ కోసం ఏర్పాటు చేసిన మైదానంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ కర్రసాముపై శిక్షణ పొందుతూ వస్తున్నారు. వై.కోట గ్రామానికి చెందిన గురువు బాబు వేసవి సెలవుల నుంచి ప్రతి నిత్యం సాయంత్రం సమయంలో  కర్రసాము నేర్పించారు. ఇదే వరుసలో గ్రామానికి చెందిన యువత కూడా ఆసక్తి చూపుతూ కర్రసాములో భాగంగా కట్టెను అలా గిర్రున తిప్పేస్తున్నారు. సెలవులలో ఇంటి వద్ద ఉన్న పిల్లలు కర్రసాముపై మక్కువ పెంచుకొని ప్రతి రోజూ సాధన చేయడంతో ఇప్పుడుతిప్పడంలో ఆరితేరిపోయారు. గ్రామానికి చెందిన దాదాపు 40 మంది పిల్లలు కర్రసాములో ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. 


మంగంపేట పునరావాస కాలనీకి చెందిన ఎన్‌ఆర్‌ఐ బాబాయి, అబ్బాయిలైన బంగారపు నరసింహులు, బంగారపు పీరయ్య గ్రామంలో యువకులు, పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో వై.కోట గ్రామానికి చెందిన బాబు అనే గురువును ఏర్పాటు చేశారు. తొలుత పది మంది పిల్లలతో ప్రారంభించారు. అయితే కర్రసాములో యువకులు, పిల్లలు కొద్ది కాలంలోనే బాగా రాణిస్తుండంతో వీరిని చూసి మరికొంత మంది కర్రసాము నేర్చుకొనేందుకు ముందుకు వచ్చారు. ఏది ఎమైనా అంతరించి పోయిన కర్రసాము విద్యను మంగంపేట గ్రామస్తులు నేర్చుకుంటూ పది మందికి మళ్లీ పరిచయం చేస్తున్నారు. 


కర్ర తిప్పడం అప్పుడు కష్టం... ఇప్పుడు ఇష్టం 

కర్ర తిప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. గురువు సలహాలు, సూచనలతో వేళ్ల చేతితో కర్రను తిప్పడం సులువు కాదు. సాధన చేయగా తిప్పడం సులువుగా మారింది. తిప్పడంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. కట్టె తిప్పుతూ ముందుకు నడుస్తూ, కాళ్ల కింద నుంచి తిప్పడం లాంటి మెలకువలు నేర్చుకున్నాను. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వీలు దొరికినప్పుడల్లా అందరం కలిసి సాధన చేయడం ద్వారా కర్రసాములో ప్రావీణ్యత సాధించాం.     
– ఎం.రామ్‌చరణ్, 10వ తరగతి, మంగంపేట, అన్నమయ్య జిల్లా 
 

వేసవి విడిదిలో పిల్లలకు నేర్పించాలని అనుకొన్నాను   

నేను గల్ఫ్‌ దేశం నుంచి స్వదేశానికి వచ్చి ఇంటి వద్ద మా పిల్లలకు కర్రసాము నేర్పించాలని అనుకున్నాను. మరి కొంత మంది పిల్లలు ఆసక్తి చూపడంతో గురువును ఏర్పాటు చేసి ప్రతి రోజూ నేర్పిస్తున్నాను.      
– బంగారపు నరసింహులు, ఎన్‌ఆర్‌ఐ మంగంపేట, ఓబులవారిపల్లె 


శారీరకంగా, మానసికంగా ఉపయోగకరం 

దాదాపు నలభై మంది పిల్లలు కర్రసాము నేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే మెలకువలు తెలుసుకొని బాగా రాణిస్తున్నారు. పిల్లలు నేర్చుకునే సమయంలో చాలా ఆసక్తిగా కనిపించారు. ప్రతి రోజూ సాయంత్రం సమయంలో నేర్చుకోవడంతో శారీరకంగా, మానసికంగా పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.  
– బి.పీరయ్య, మంగంపేట, ఓబులవారిపల్లె. 


వేసవి సెలవుల్లో నేర్చుకున్నా ! 

నా పేరు ఎం.సుశాంత్‌. మంగంపేటలో నివాసముంటున్నాను. మక్కా స్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో ఏదో ఒక విభాగంలో నైపుణ్యం పెంచుకుంటే బాగుంటుందని భావించి కర్రసాము నేర్చుకున్నాను. దాదాపు 45 రోజుల వ్యవధిలో కర్ర బాగా తిప్పుతు న్నాను. చదువుతోపాటు ఆత్మరక్షణకు సంబంధించిన కర్రసాములో నైపుణ్యం సాధించాను. (క్లిక్‌: అవధాన ఉద్దండుడు.. నరాల రామారెడ్డి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement