Obulavaripalle
-
కర్రసాములో ప్రత్యేకత చాటుకుంటున్న మంగంపేట
సాక్షి, రాయచోటి(అన్నమయ్య జిల్లా) : మన పూర్వీకుల కాలంలో బందిపోటు, గజదొంగలు, శత్రువులు గ్రామాలపై దాడి చేసి దోచుకొని వెళ్తుండేవారు. అప్పట్లో గ్రామాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం యువత కర్రసాము విద్యను అభ్యసించి ప్రావీణ్యం పొందేవారు. ఇందుకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటుచేసి కర్రసాములో శిక్షణ ఇచ్చే వారు. కర్రసాములో బాగా రాణించిన వారికి సంఘంలో ప్రత్యేక ఆదరణ లభించేంది. కాలానుగుణంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడంతో కర్రసాము విద్య మరుగున పడిపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఆనాటి కర్రసాములో ప్రావీణ్యం పొందిన వారు ఉన్నారు. పెళ్లిసందడి, జాతర్లలో, ఉరుసు ఉత్సవాలతోపాటు పండుగ, పబ్బాల సమయంలోనూ కర్రసాము తళుక్కుమంటోంది. పూర్వకాలం నుంచి వస్తున్న అనేక విద్యల్లో కర్రసాము అనేది విలువైనదిగా గ్రామీణ ప్రాంత జనం భావించేవారు. కాలంలో మార్పు.. కంప్యూటర్ యుగం రాకతో పాతకాలం సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. అయితే ఓబులవారిపల్లె మండలం మంగంపేటకు చెందిన పలువురు యువకులు, చిన్నారులు కర్రసాము పట్ల ఆసక్తి చూపడంతోపాటు నేర్చుకోవడం విశేషం. అలా గిర్రున తిప్పేస్తున్నారు.. అంతే..! మంగంపేట గ్రామస్తులు తమ పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో పునరావాస కాలనీ కోసం ఏర్పాటు చేసిన మైదానంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ కర్రసాముపై శిక్షణ పొందుతూ వస్తున్నారు. వై.కోట గ్రామానికి చెందిన గురువు బాబు వేసవి సెలవుల నుంచి ప్రతి నిత్యం సాయంత్రం సమయంలో కర్రసాము నేర్పించారు. ఇదే వరుసలో గ్రామానికి చెందిన యువత కూడా ఆసక్తి చూపుతూ కర్రసాములో భాగంగా కట్టెను అలా గిర్రున తిప్పేస్తున్నారు. సెలవులలో ఇంటి వద్ద ఉన్న పిల్లలు కర్రసాముపై మక్కువ పెంచుకొని ప్రతి రోజూ సాధన చేయడంతో ఇప్పుడుతిప్పడంలో ఆరితేరిపోయారు. గ్రామానికి చెందిన దాదాపు 40 మంది పిల్లలు కర్రసాములో ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. మంగంపేట పునరావాస కాలనీకి చెందిన ఎన్ఆర్ఐ బాబాయి, అబ్బాయిలైన బంగారపు నరసింహులు, బంగారపు పీరయ్య గ్రామంలో యువకులు, పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో వై.కోట గ్రామానికి చెందిన బాబు అనే గురువును ఏర్పాటు చేశారు. తొలుత పది మంది పిల్లలతో ప్రారంభించారు. అయితే కర్రసాములో యువకులు, పిల్లలు కొద్ది కాలంలోనే బాగా రాణిస్తుండంతో వీరిని చూసి మరికొంత మంది కర్రసాము నేర్చుకొనేందుకు ముందుకు వచ్చారు. ఏది ఎమైనా అంతరించి పోయిన కర్రసాము విద్యను మంగంపేట గ్రామస్తులు నేర్చుకుంటూ పది మందికి మళ్లీ పరిచయం చేస్తున్నారు. కర్ర తిప్పడం అప్పుడు కష్టం... ఇప్పుడు ఇష్టం కర్ర తిప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. గురువు సలహాలు, సూచనలతో వేళ్ల చేతితో కర్రను తిప్పడం సులువు కాదు. సాధన చేయగా తిప్పడం సులువుగా మారింది. తిప్పడంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. కట్టె తిప్పుతూ ముందుకు నడుస్తూ, కాళ్ల కింద నుంచి తిప్పడం లాంటి మెలకువలు నేర్చుకున్నాను. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వీలు దొరికినప్పుడల్లా అందరం కలిసి సాధన చేయడం ద్వారా కర్రసాములో ప్రావీణ్యత సాధించాం. – ఎం.రామ్‌చరణ్, 10వ తరగతి, మంగంపేట, అన్నమయ్య జిల్లా వేసవి విడిదిలో పిల్లలకు నేర్పించాలని అనుకొన్నాను నేను గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి వచ్చి ఇంటి వద్ద మా పిల్లలకు కర్రసాము నేర్పించాలని అనుకున్నాను. మరి కొంత మంది పిల్లలు ఆసక్తి చూపడంతో గురువును ఏర్పాటు చేసి ప్రతి రోజూ నేర్పిస్తున్నాను. – బంగారపు నరసింహులు, ఎన్ఆర్ఐ మంగంపేట, ఓబులవారిపల్లె శారీరకంగా, మానసికంగా ఉపయోగకరం దాదాపు నలభై మంది పిల్లలు కర్రసాము నేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే మెలకువలు తెలుసుకొని బాగా రాణిస్తున్నారు. పిల్లలు నేర్చుకునే సమయంలో చాలా ఆసక్తిగా కనిపించారు. ప్రతి రోజూ సాయంత్రం సమయంలో నేర్చుకోవడంతో శారీరకంగా, మానసికంగా పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – బి.పీరయ్య, మంగంపేట, ఓబులవారిపల్లె. వేసవి సెలవుల్లో నేర్చుకున్నా ! నా పేరు ఎం.సుశాంత్. మంగంపేటలో నివాసముంటున్నాను. మక్కా స్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో ఏదో ఒక విభాగంలో నైపుణ్యం పెంచుకుంటే బాగుంటుందని భావించి కర్రసాము నేర్చుకున్నాను. దాదాపు 45 రోజుల వ్యవధిలో కర్ర బాగా తిప్పుతు న్నాను. చదువుతోపాటు ఆత్మరక్షణకు సంబంధించిన కర్రసాములో నైపుణ్యం సాధించాను. (క్లిక్: అవధాన ఉద్దండుడు.. నరాల రామారెడ్డి) -
మూడు నెలలకే నూరేళ్లు నిండాయా బిడ్డా..
ఓబులవారిపల్లె/రైల్వేకోడూరు రూరల్(వైఎస్సార్ జిల్లా): మూడు నెలల క్రితం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినింటి నుంచి పురుడు సారె తీసుకుని మెట్టినింటికి బయలుదేరింది. అదే ఆమెకు కడసారె అవుతుందని కలలో కూడా ఊహించలేదు. మృత్యు శకటంలా దూసుకొచ్చిన లారీ తల్లీ ఇద్దరు బిడ్డలతో పాటు మరో ఇద్దరిని బలి తీసుకుంది. రోడ్డుపైన చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను చూసిన వారు ఓరి దేవుడా.. ఎంత పని చేశావు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఓబులవారిపల్లెకు చెందిన ఆకుల పెద్ద వెంకటసుబ్బమ్మ ఏకైక కుమార్తె పెంచలమ్మ(30) పుట్టుకతో దివ్యాంగురాలు. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం రైల్వేకోడూరుకు చెందిన ప్రొద్దుటూరు కృష్ణారెడ్డి ఓబులవారిపల్లెలో ఎలక్ట్రిçకల్ పనులు చేసుకునేందుకు వచ్చాడు. అక్కడ వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వీరికి తొమ్మిదేళ్ల క్రితం సాయిశ్రీ జన్మించింది. ఆ బాలిక మంగంపేట ఏపీఎండీసీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. చాలా ఏళ్ల తర్వాత మూడు నెలలక్రితం పెంచలమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె ఓబులవారిపల్లెలోని అమ్మ వద్దే ఉండేది. ఈ నేపథ్యంలో శనివారం పుట్టింటి నుంచి సారె తీసుకుని ఇద్దరు పిల్లలతో పాటు తల్లి ఆకుల పెద్ద వెంకటసుబ్బమ్మ(58), పొరుగింటి మహిళ వంకన తులశమ్మ(38)తో కలిసి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆటోలో రైల్వేకోడూరులోని మెట్టినింటికి బయలుదేరింది. పెంచలమ్మ భర్త కృష్ణారెడ్డి ఆటో వెనకాలే బైకుపై వెళ్లాడు. ఆటో మంగంపేట అగ్రహారం దాటగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొనడంతో సంఘటన స్థలంలో తులశమ్మ, సాయిశ్రీ, మూడు నెలల బాబు కౌశిక్‌రెడ్డి, ఆకుల పెద్ద వెంకటసుబ్బమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన అయ్యలరాజుపల్లె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాలకృష్ణ, పెంచలమ్మను తిరుపతి రుయాకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెంచలమ్మ మృతి చెందింది. ఆటో డ్రైవర్ మృత్యువుతో పోరాడుతున్నాడు. భార్య, ఇద్దరు బిడ్డలతో పాటు అత్తను కోల్పోయి రోదిస్తున్న కృష్ణారెడ్డిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన తులభమ్మ భర్త లక్ష్మినారాయణ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు నెలలకే నూరేళ్లు నిండాయా బిడ్డా.. అందంగా పుట్టావు, ముద్దుముద్దుగా ఉన్నావని సంబరపడ్డాము అంతలోనే ఇలా జరిగిందా... మూడు నెలలకే నూరేళ్లు నిండాయా బిడ్డా.. నేను ఎవరికోసం బతకాలి , ఎందుకోసం బతకాలి దేవుడా.. దేవుడా నాకెందుకు ఇంత శిక్ష వేశావు అంటూ చిన్నారి కౌషిక్ రెడ్డి తండ్రి కృష్ణా రెడ్డి గుండెలు పగిలేలా రోదించాడు. తన భార్య, ఇద్దరు బిడ్డలు, అత్త మృతి చెందడంతో ఆయన కన్నీటి పర్యంతమవుతుంటే ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ కొరముట్ల రోడ్డు ప్రమాద వార్త తెలుసుకున్న ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. వారిని ఓదార్చారు. ఆయన వెంట వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
యువకుడిపై దాడి
ఓబులవారిపల్లె: మండలంలోని రెడ్డిపల్లె చెరువువద్ద సోమవారం సాయంత్రం పాతకక్షలతో చిన్నరెడ్డయ్య అనే యువకుడిని ఈడిగపల్లె వాసుదేవపురం గ్రామానికి చెందిన చాపలమడుగు శివయ్య అతని అనుచరులు తీవ్రంగా గాయపరిచి మోటార్ సైకిల్‌ను దహనం చేశారు. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. తన స్నేహితుడు అయిన ఈడిగపల్లెకు చెందిన ఉదయ్‌కుమార్ సోమవారం సాయంత్రం రెడ్డిపల్లె చెరువుకట్ట వద్దకు రమ్మని ఫోన్‌చేయగా తాను మోటార్ సైకిల్‌పై రాజంపేట నుంచి చెరువు కట్ట వద్దకు వెళ్లినట్లు తెలిపాడు. ఈ సమాచారం తెలుసుకున్న చాపలమడుగు శివయ్య, సూరి, లోకేష్, నరేష్, మహేష్‌లతోపాటు మరో నలుగురు స్కార్పియో వాహనంలో వచ్చి తనను తీసుకెళ్లి దాడిచేసి తీవ్రంగా గాయపరచినట్లు బాధితుడు తెలిపాడు. అపస్మారక స్థితికి చేరుకున్న తనను గుండు గీయించి వదిలేసి తన మోటార్‌సైకిల్‌కు నిప్పంటించి దహనం చేశారని వాపోయాడు. తనను కొందరు గమనించి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారన్నాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. -
పాము కాటుతో మహిళా రైతు మృతి
సున్నపురాళ్లపల్లె(ఓబులవారిపల్లె): పొలంవద్ద సజ్జతోట కోతకు వెళ్లిన సున్నపురాళ్లపల్లె గ్రామానికి చెందిన అలం బుజ్జమ్మ (36) అనే మహిళా రైతు పాము కాటుకు గురై మృతి చెందింది. బంధువుల కథనం మేరకు.. రెండు రోజుల క్రితం పొలంలో సజ్జపంట కోత కోస్తుండగా రక్తపింజరి పాము కాటు వేయడంతో ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త వెంకటసుబ్బయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.