కుమారుడు కౌషిక్ రెడ్డి మృతదేహం వద్ద విలపిస్తున్న తండ్రి కృష్ణారెడ్డి
ఓబులవారిపల్లె/రైల్వేకోడూరు రూరల్(వైఎస్సార్ జిల్లా): మూడు నెలల క్రితం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినింటి నుంచి పురుడు సారె తీసుకుని మెట్టినింటికి బయలుదేరింది. అదే ఆమెకు కడసారె అవుతుందని కలలో కూడా ఊహించలేదు. మృత్యు శకటంలా దూసుకొచ్చిన లారీ తల్లీ ఇద్దరు బిడ్డలతో పాటు మరో ఇద్దరిని బలి తీసుకుంది. రోడ్డుపైన చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను చూసిన వారు ఓరి దేవుడా.. ఎంత పని చేశావు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఓబులవారిపల్లెకు చెందిన ఆకుల పెద్ద వెంకటసుబ్బమ్మ ఏకైక కుమార్తె పెంచలమ్మ(30) పుట్టుకతో దివ్యాంగురాలు. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం రైల్వేకోడూరుకు చెందిన ప్రొద్దుటూరు కృష్ణారెడ్డి ఓబులవారిపల్లెలో ఎలక్ట్రిçకల్ పనులు చేసుకునేందుకు వచ్చాడు.
అక్కడ వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వీరికి తొమ్మిదేళ్ల క్రితం సాయిశ్రీ జన్మించింది. ఆ బాలిక మంగంపేట ఏపీఎండీసీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. చాలా ఏళ్ల తర్వాత మూడు నెలలక్రితం పెంచలమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె ఓబులవారిపల్లెలోని అమ్మ వద్దే ఉండేది. ఈ నేపథ్యంలో శనివారం పుట్టింటి నుంచి సారె తీసుకుని ఇద్దరు పిల్లలతో పాటు తల్లి ఆకుల పెద్ద వెంకటసుబ్బమ్మ(58), పొరుగింటి మహిళ వంకన తులశమ్మ(38)తో కలిసి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆటోలో రైల్వేకోడూరులోని మెట్టినింటికి బయలుదేరింది.
పెంచలమ్మ భర్త కృష్ణారెడ్డి ఆటో వెనకాలే బైకుపై వెళ్లాడు. ఆటో మంగంపేట అగ్రహారం దాటగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొనడంతో సంఘటన స్థలంలో తులశమ్మ, సాయిశ్రీ, మూడు నెలల బాబు కౌశిక్‌రెడ్డి, ఆకుల పెద్ద వెంకటసుబ్బమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన అయ్యలరాజుపల్లె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాలకృష్ణ, పెంచలమ్మను తిరుపతి రుయాకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెంచలమ్మ మృతి చెందింది. ఆటో డ్రైవర్ మృత్యువుతో పోరాడుతున్నాడు. భార్య, ఇద్దరు బిడ్డలతో పాటు అత్తను కోల్పోయి రోదిస్తున్న కృష్ణారెడ్డిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన తులభమ్మ భర్త లక్ష్మినారాయణ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మూడు నెలలకే నూరేళ్లు నిండాయా బిడ్డా..
అందంగా పుట్టావు, ముద్దుముద్దుగా ఉన్నావని సంబరపడ్డాము అంతలోనే ఇలా జరిగిందా... మూడు నెలలకే నూరేళ్లు నిండాయా బిడ్డా.. నేను ఎవరికోసం బతకాలి , ఎందుకోసం బతకాలి దేవుడా.. దేవుడా నాకెందుకు ఇంత శిక్ష వేశావు అంటూ చిన్నారి కౌషిక్ రెడ్డి తండ్రి కృష్ణా రెడ్డి గుండెలు పగిలేలా రోదించాడు. తన భార్య, ఇద్దరు బిడ్డలు, అత్త మృతి చెందడంతో ఆయన కన్నీటి పర్యంతమవుతుంటే ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ కొరముట్ల రోడ్డు ప్రమాద వార్త తెలుసుకున్న ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. వారిని ఓదార్చారు. ఆయన వెంట వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment