తండ్రి ప్రేమకు సాటి అవునే....
వాంకోవర్: బుడి బుడి నడకల కొడుకు పట్ల ఓ తండ్రికున్న అమూల్య ప్రేమకు చక్కటి నిదర్శనం ఈ ఫొటో. జోరుగా కురుస్తున్న వర్షంలో కొడుకుపై ఒక్క చుక్క కూడా పడకూడదనే తాపత్రయంతో కొడుకుకు గొడుగు పట్టి బడికి తీసుకెళ్తూ తాను మాత్రం వర్షంలో నిలువన నీరవుతున్న దృశ్యం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కెనడాలోని వాంకోవర్ నగర వీధిలో కనిపించిన ఈ దృశ్యాన్ని జాగర్షాట్జ్ అనే వ్యక్తి తన కెమేరాలో బంధించి ‘డాడ్స్’ అనే శీర్షికతో ముందుగా సోషల్ వెబ్సైట్ ‘రెడిట్’లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ ఫొటో ఇతర వెబ్సైట్లకు విస్తరించింది.
ఇప్పటికే 35 లక్షల మంది ఈ ఫొటోను షేర్ చేసుకున్నారు. వెయ్యి మందికి పైగా కామెంట్లు చేశారు. ‘తండ్రులెవరైనా కావచ్చు. ఇలాంటి డాడీలు మాత్రం కొందరే ఉంటారని ఒకరు, చిన్నప్పుడు నా పట్ల నా తండ్రి చూపించిన ప్రేమ ఎలా ఉండేది నాకు గుర్తు లేదు. నేనూ మంచి డాడీని అవుతానా? అని మరొకరు, ఆ తండ్రి స్థానంలో మమ్మీ ఉంటే సీనే మారిపోయేదేమో!’ అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు.
‘ఇంట్లో ఉన్న తల్లి ఒక గొడుగు కాకుండా రెండు గొడుగులిచ్చి పంపించొచ్చుకదా! అని ఒకరు, కొడుకును తండ్రి ఎత్తుకుంటే, ఆ గొడుగును కొడుకు పట్టుకుంటే ప్రాబ్లమ్ తీరేదికదా’ అంటూ సమస్య పూరక సలహాలూ ఇచ్చారు.