నాలుగు వారాల్లో నిగారింపు..!
ఆరు వారాల్లో మీరు అందంగా తయారవుతారు.. అనేది ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ వారి ట్యాగ్‌లైన్. అయితే అలాంటి ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను కాదు.. నీటిని నమ్ముకోండి నాలుగువారాల్లోనే మీరు చాలా అందంగా తయారవుతారు అని అంటోంది సారా. బ్రిటన్‌కు చెందిన సారా వయసు 42 సంవత్సరాలు. ఆ వయసుకు తగ్గట్టుగా కళ్లకింద క్యారీబ్యాగ్లతో మొహం మీద ముడతలు పడ్డ చర్మంతో ఉండేది సారా. అయితే ఇదంతా కొద్దికాలం క్రితం. ఇప్పుడు సారాలో చాలా మార్పు వచ్చింది. ఆమె కళ్ల కింద క్యారీబ్యాగులు మాయమయ్యాయి. చర్మంలో ఫ్రెష్‌నెస్ వచ్చింది.
మొహంలో నిగారింపు వచ్చింది. కనీసం పదేళ్లు వయసు తగ్గినట్టుగా మారిపోయింది! మరి ఈ మార్పుకు కారణం ఏమిటి? అంటే ‘వాటర్’ అని సమాధానం ఇస్తుంది సారా. కొన్ని రోజుల క్రితం తనలో వృద్ధాప్య ఛాయలు పెరుగుతున్నాయని అర్థం చేసుకొన్నానని, ఇదంతా ఇక మామూలే అని అనుకొంటున్న సమయంలో నీటి ప్రాముఖ్యత గురించి గ్రహించానని సారా చెబుతోంది. ‘‘మనిషికి, ఒంటెకు ఒక పోలిక ఉంది. మనిషి కూడా నీటిని తాగకుండా చాలా సేపు ఉండగలడు.
నేను ఉదయం టిఫిన్ సమయంలో ఒక గ్లాసు, మధ్యాహ్నం భోజనం సమయంలో ఒక గ్లాస్, రాత్రి భోజనం సమయంలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొనేదాన్ని. అయితే.. అది చాలా పొరపాటు అని తర్వాత తెలిసింది. కచ్చితంగా నాలుగు వారాల కిందట లెక్కపెట్టుకొని రోజుకు మూడు లీటర్ల నీటిని తీసుకోవడం మొదలుపెట్టాను. వారం రోజుల్లోనే మొహంలో మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రతివారం క్లోజప్‌లో ఫోటోలు తీసుకొని మార్పులను డాక్యుమెంటైజ్ చేశాను.
ఇప్పుడు మొత్తంగా నాలో వచ్చిన మార్పును చూసి మా పిల్లలు కూడా ఆశ్చర్యపోతున్నారు...’’ అని సారా తన బ్యూటీ టిప్స్‌ను వివరిస్తోంది! మరి రోజుకుమూడు లీటర్ల నీటిని సేవించడం ద్వారా ఇన్ని ప్రయోజనాలు, ఇంత మార్పు ఉంటుందంటే.. వెంటనే సారా సలహా పాటించేయడం ఉత్తమం.