Dalit candidates
-
దళిత సిట్టింగ్‌లకు బాబు రెడ్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వారి పట్ల తనకున్న చిన్నచూపును బయటపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆ వర్గం ఎమ్మెల్యేలకు చెక్‌పెడుతున్నారు. మరోసారి టిక్కెట్ ఇస్తే నాయకులుగా ఎదుగుతారనే ఉద్దేశంతో కొత్తవారిని తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు లేవని ఇప్పటికే పలువురికి స్పష్టం చేశారు. మరికొందరికి సూచనప్రాయంగా తెలియజెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వారితో కలిపి ప్రస్తుతం టీడీపీకి 17 మంది ఎస్సీ ఎమ్మెల్యేలున్నారు. వారిలో 12 మందికి మళ్లీ అవకాశం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంత్రి జవహర్‌కు కొవ్వూరు సీటు ఇవ్వొద్దని, ఇస్తే ఓడిస్తామని అక్కడి నేతలు నేరుగా చంద్రబాబు వద్దే శపథం చేశారు. దీంతో జవహర్‌కు సీటు గల్లంతేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాతకు కూడా సీటు దక్కే అవకాశాలు ఏమాత్రం లేవు. మంత్రిగా ఉన్న సమయంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆమెను జిల్లా రాజకీయంలో ఒంటరిని చేసి ఇబ్బంది పెట్టడమేగాక మంత్రి పదవి కోల్పోయేలా చేశారు. వారి ఒత్తిడితో ఇప్పుడు రెండోసారి పోటీ చేసే అవకాశం ఆమెకు లేదని చెబుతున్నారు. రాజధాని ఎమ్మెల్యేకే దిక్కులేదు! రాజధాని పరిధిలోని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు మళ్లీ సీటు లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయనకు పోటీగా పలువురిని రేసులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకూ అవకాశం లేదని సమాచారం. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అడ్డుకునేందుకు ఆమెను ప్రయోగించి ఆరోపణలు చేయించారు. అవసరానికి వినియోగించుకుని ఇప్పుడు సీటు నిరాకరిస్తుండడంతో ఆమె సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. అమలాపురం, గోపాలపురం, సింగనమల ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, యామినీబాలకు కూడా మళ్లీ సీటు లేదని చెప్పినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. రాజోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకూ ఇంకా భరోసా లభించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన పామర్రు, యర్రగొండపాలెం, బద్వేలు, కోడుమూరు ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, పాలపర్తి డేవిడ్‌రాజు, జయరాములు, మణిగాంధీలకు మొండిచెయ్యి చూపడం ఖాయంగా కనిపిస్తోంది. సమావేశాల్లో చంద్రబాబు ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం. గిరిజన ఎమ్మెల్యేలకూ మొండిచెయ్యే గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఏకైక గిరిజన ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుకు మళ్లీ అవకాశం లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని కూడా టిక్కెట్ల రేసు నుంచే తప్పించేశారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కూడా సీటు లేదని చెబుతున్నారు. (చదవండి: రెండు మూడు రోజుల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి) ఆయా నియోజకవర్గాల్లో ‘పెద్దలు’ చెప్పిన వారికే సీటు దళిత, గిరిజన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పెత్తనమంతా టీడీపీలో చక్రం తిప్పే సామాజికవర్గం నేతలదే. తనను టీడీపీలో తీవ్ర అవమానాలకు గురిచేశారని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ కొద్దిరోజుల క్రితం బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే. టీడీపీలో ఎస్సీలకు పదవులు ఇస్తారు కానీ అధికారాలు మాత్రం ఉండవని మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు పార్టీ మారినప్పుడు స్పష్టంగా చెప్పారు. ఎస్సీలకు పదవులు ఇచ్చామని చెప్పుకునేందుకే తప్ప వాటితో ఎటువంటి పని చేయనీయరని, పెత్తనమంతా టీడీపీలో సీనియర్లుగా చెలామణీ అయ్యే పెద్దమనుషుల చేతుల్లోనే ఉంటుందనేది బహిరంగ రహస్యం. చంద్రబాబు సైతం తన వర్గం నేతలు చెప్పినట్లే విని తమకు సీట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంపై దళిత, గిరిజన వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
దళితునిపై టీడీపీ నేత దౌర్జన్యం
పీసీపల్లి : రోడ్డు మార్జిన్లో తోపుడు బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న ఓ దళిత యువకునిపై అధికార పార్టీ నేత ఆదివారం సాయంత్రం దౌర్జన్యానికి దిగి ఆ బండికి అడ్డంగా మరో బంకు పెట్టి నానా హడావుడి సృష్టించాడు. ఈ సంఘటన పీసీపల్లి వైఎస్సార్ సర్కిల్లో చోటు చేసుకుంది. దీంతో బాధితుడు నీలం అమర్నాథ్ జిల్లా పాలకేంద్రం డైరెక్టర్, మండల టీడీపీ నాయకుడు పులి వెంకటేశ్వరరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత 8 సంవత్సరాలుగా నీలం అమర్నాథ్ రోడ్డు మార్జిన్లో సాయంత్రం సమయంలో ఓ బండిపై టిఫిన్ సెంటరును నిర్వహించుకుంటున్నాడు. అయితే ఆ తోపుడు బండి ఉన్న స్థలం తమదంటూ టీడీపీ నాయకుడు జేసీబీపై బంకును తీసుకువెళ్లి అమర్నాథ్ తోపుడు బండికి అడ్డుగా పెట్టించాడు. ఇదేంటి అని అడిగిన అమర్నా«థ్‌ను కులం పేరుతో దూషించి దౌర్జన్యానికి దిగాడు. తనకు తోపుడు బండే జీవనాధారమని ఇబ్బందులు పాలు చేస్తే ఆత్మహత్యే శరణ్యం అని వాపోయాడు. అమర్నా«థ్‌ను దూషించడమేకాక అతనిపై దౌర్జన్యానికి దిగడంతో దళితుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అధికార పార్టీ నాయకుని ఆగడాలు అడ్డుకునేందుకు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్టేషన్ ఇన్చార్జి మురళిని ‘సాక్షి’ వివరణ కోరగా సోమవారం ఈ సంఘటనపై హనుమంతునిపాడు ఎస్సై విచారణ జరుపుతారన్నారు. -
లెక్క తేలింది
నీలగిరి : అర్హులైన దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం జిల్లావ్యాప్తంగా చేపట్టిన ప్రాథమిక సర్వే పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీ వచ్చే ఆగస్టు 15వ తేదీన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ దిశగా జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ప్రాథమికంగా.... హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని ఐదు మండలాలను మినహాయించి 54 మండలాల పరిధిలో, ఒక్కో మండలం నుంచి మూడు గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ప్రాథమిక సర్వే నిర్వహించారు. అధికారుల లెక్కల ప్రకారం 162 గ్రామాల పరిధిలో మూడు ఎకరాలలోపు భూములు ఉన్న దళిత కుటుంబాలు 3,466 ఉన్నాయి. ఇక్కడ కేవలం 1857 ఎకరాల ప్రభుత్వభూమి మాత్రమే అందుబాటులో ఉంది. ముందుగా ఒకే గ్రామం ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన మూడు గ్రామాల్లోంచి... ఒకే గ్రామంలో పెలైట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. అంటే 54 మండలాల పరిధిలో 54 గ్రామాల్లో సుమారు 1155 దళిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. సర్వే ఇలా.... ఎంపిక చేసినగ్రామాల్లో సామాజిక ఆర్థిక సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీఆర్వో, వీఆర్ఏ, వీఎస్‌ఏలు బృందాలుగా ఏర్పడి దళితుల ఇంటికి వెళతారు. ఆయా కుటుంబాల ఆర్థిక, స్థితిగతుల వివరాలను సేకరించి ప్రభుత్వం రూపొందించిన ఫార్మాట్లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూములు కొనుగోలు చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని నియమిస్తారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో భూమి లేని చోట భూమి కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అయితే గ్రామాల ఎంపికలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండే అవకాశం ఉంది. గడువులోగా పూర్తిచేస్తాం : సి.శ్రీధర్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ప్రాథమిక సర్వే పూర్తి చేశాం. మండలంలో మూడు గ్రామాలు ఎంపిక చేశాం. వాటిల్లోంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తాం. ఆగస్టు 5 తేదీలోగా ప్రక్రియ అంతా పూర్తి చేసి, ఆగస్టు 15 తేదీ నాటికి లబ్ధిదారులకు భూములు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆ ఐదు మండలాల్లో లేనట్టే..! హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని బొమ్మలరామారం, భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి మండలాలను ఈ పథకం నుంచి మినహాయించారు. ఓ వైపు ప్రభుత్వ భూముల కొరత, మరోవైపు ప్రైవేటు భూములు కొనాలన్నా, బహిరంగ మార్కెట్లో ధరలు విపరీతంగా ఉండడమే కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మండలాల్లో ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కల్పించేలా ఇతర ఆర్థిక కార్యకలాపాలు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదీ ప్రాథమిక సర్వే గుర్తించిన దళిత కుటుంబాలు 3,466 అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి 1,857 (ఎకరాలు) కొనుగోలు చేయాల్సిన భూమి 8,538 (ఎకరాలు) అయ్యే ఖర్చు రూ. 88 కోట్లు (హెచ్ఎండీఏ పరిధిలోని 5 మండలాలను మినహాయించి ఒక్కో మండలంలో మూడు గ్రామాల చొప్పున మూడెకరాలోపు భూములు ఉన్న దళిత కుటుంబాలను గుర్తించారు.) పెలైట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తే.. లబ్ధి పొందే ఎస్సీ కుటుంబాలు 1,155 అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి 619 (ఎకరాలు) కొనుగోలు చేయాల్సిన భూమి 2,846 (ఎకరాలు) అయ్యే ఖర్చు రూ. 27 కోట్లు (స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎస్సీ లబ్ధిదారులకు భూములు పంపిణీ చేయనున్నారు)