సాక్షి, అమరావతి: దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వారి పట్ల తనకున్న చిన్నచూపును బయటపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆ వర్గం ఎమ్మెల్యేలకు చెక్‌పెడుతున్నారు. మరోసారి టిక్కెట్ ఇస్తే నాయకులుగా ఎదుగుతారనే ఉద్దేశంతో కొత్తవారిని తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు లేవని ఇప్పటికే పలువురికి స్పష్టం చేశారు. మరికొందరికి సూచనప్రాయంగా తెలియజెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వారితో కలిపి ప్రస్తుతం టీడీపీకి 17 మంది ఎస్సీ ఎమ్మెల్యేలున్నారు. వారిలో 12 మందికి మళ్లీ అవకాశం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంత్రి జవహర్‌కు కొవ్వూరు సీటు ఇవ్వొద్దని, ఇస్తే ఓడిస్తామని అక్కడి నేతలు నేరుగా చంద్రబాబు వద్దే శపథం చేశారు. దీంతో జవహర్‌కు సీటు గల్లంతేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాతకు కూడా సీటు దక్కే అవకాశాలు ఏమాత్రం లేవు. మంత్రిగా ఉన్న సమయంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆమెను జిల్లా రాజకీయంలో ఒంటరిని చేసి ఇబ్బంది పెట్టడమేగాక మంత్రి పదవి కోల్పోయేలా చేశారు. వారి ఒత్తిడితో ఇప్పుడు రెండోసారి పోటీ చేసే అవకాశం ఆమెకు లేదని చెబుతున్నారు.
రాజధాని ఎమ్మెల్యేకే దిక్కులేదు!
రాజధాని పరిధిలోని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు మళ్లీ సీటు లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయనకు పోటీగా పలువురిని రేసులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకూ అవకాశం లేదని సమాచారం. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను అడ్డుకునేందుకు ఆమెను ప్రయోగించి ఆరోపణలు చేయించారు. అవసరానికి వినియోగించుకుని ఇప్పుడు సీటు నిరాకరిస్తుండడంతో ఆమె సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. అమలాపురం, గోపాలపురం, సింగనమల ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, యామినీబాలకు కూడా మళ్లీ సీటు లేదని చెప్పినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. రాజోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకూ ఇంకా భరోసా లభించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన పామర్రు, యర్రగొండపాలెం, బద్వేలు, కోడుమూరు ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, పాలపర్తి డేవిడ్‌రాజు, జయరాములు, మణిగాంధీలకు మొండిచెయ్యి చూపడం ఖాయంగా కనిపిస్తోంది. సమావేశాల్లో చంద్రబాబు ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం.
గిరిజన ఎమ్మెల్యేలకూ మొండిచెయ్యే
గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఏకైక గిరిజన ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుకు మళ్లీ అవకాశం లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని కూడా టిక్కెట్ల రేసు నుంచే తప్పించేశారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కూడా సీటు లేదని చెబుతున్నారు. (చదవండి: రెండు మూడు రోజుల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి)
ఆయా నియోజకవర్గాల్లో ‘పెద్దలు’ చెప్పిన వారికే సీటు
దళిత, గిరిజన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పెత్తనమంతా టీడీపీలో చక్రం తిప్పే సామాజికవర్గం నేతలదే. తనను టీడీపీలో తీవ్ర అవమానాలకు గురిచేశారని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ కొద్దిరోజుల క్రితం బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే. టీడీపీలో ఎస్సీలకు పదవులు ఇస్తారు కానీ అధికారాలు మాత్రం ఉండవని మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు పార్టీ మారినప్పుడు స్పష్టంగా చెప్పారు. ఎస్సీలకు పదవులు ఇచ్చామని చెప్పుకునేందుకే తప్ప వాటితో ఎటువంటి పని చేయనీయరని, పెత్తనమంతా టీడీపీలో సీనియర్లుగా చెలామణీ అయ్యే పెద్దమనుషుల చేతుల్లోనే ఉంటుందనేది బహిరంగ రహస్యం. చంద్రబాబు సైతం తన వర్గం నేతలు చెప్పినట్లే విని తమకు సీట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంపై దళిత, గిరిజన వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment