సాక్షి, అమరావతి: ఈ ఎన్నికలు ఓ ఫార్సు అని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ చేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కోవర్టు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని 3.93 కోట్ల మంది ఓటర్లలో 80 శాతం మందికిపైగా అమూల్యమైన ఓటు వేయడం ద్వారా ఇచ్చిన తీర్పునే ఫార్సు అనడమంటే ప్రజాస్వామ్యాన్ని దారుణంగా అవమానించడమే అవుతుందని అంటున్నారు. చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా సాగిన అవినీతి, అరాచక, అసమర్థ పాలన ఇక వద్దే వద్దంటూ ప్రజలు ఓట్ల ద్వారా తిరస్కరించారని తేటతెల్లం కావడంతో చంద్రబాబు జీర్ణించుకోలేక అసహనంతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విద్యావంతులు, మేధావులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఓటమిని హుందాగా అంగీకరించలేక సాకులు వెతుక్కోవడంలో భాగంగా ఇలా ఇతరులపై ఇష్టమొచ్చినట్లు నిందలు మోపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పరిఢవిల్లిన ప్రజాస్వామ్యం
‘‘జనం పోలింగ్ కేంద్రాలకు తండోపతండాలుగా వచ్చి ఓట్ల వరద సృష్టించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది అనడానికి 80 శాతానికిపైగా నమోదైన పోలింగే నిదర్శనం. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకూ జనం వరుసలో నిలబడి ఓట్లు వేశారు. ఇది ప్రజల్లో రగిలిన ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పడుతోంది. ఓవైపు పోలింగ్ శాతం పెరగడాన్ని విద్యావంతులు, మేధావులు ప్రశంసిస్తుంటే బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎన్నికలు ఫార్సు అంటారా? ఎన్నికల వ్యవస్థను, ప్రజల తీర్పును అవమానించేలా మాట్లాడటం నేరం’’ అని రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులతో పాటు ప్రభుత్వ అధికారులు సైతం తేల్చిచెబుతున్నారు.
పోలింగ్ శాతం తగ్గించేందుకు కుట్రలు
‘‘రాష్ట్రంలో 92 వేల ఈవీఎంలలో 400 యంత్రాలు పని చేయకపోతే సరిదిద్దామని ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) ద్వివేది మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేశారు. ప్రతిపక్షం నేతలు దాడులు చేస్తారని, హింసకు పాల్పడుతారని పోలింగ్‌కు ముందే గోబెల్స్ ప్రచారం చేశారు. కేవలం 400 ఈవీఎంలతో మాత్రమే సమస్య వచ్చినా సీఎం చంద్రబాబు మాత్రం 30 శాతానికి పైగా ఈవీఎంలు పనిచేయలేదంటూ దుష్ప్రచారం చేశారు.
బాబు ఆదేశం మేరకే టీడీపీ నాయకులు ఎన్నికల్లో గొడవలు సృష్టించారు. చాలాచోట్ల దాడులకు తెగబడ్డారు. ఇవన్నీ పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు చేసిన కుట్రలే. అయినా జనం దేనికీ వెరవకుండా కసితో ఓటింగ్‌లో పాల్గొన్నారు. 80 శాతానికి పైగా జరిగిన పోలింగే ఇందుకు నిదర్శనం. రోజుకు రెండుసార్లు మీడియాతో మాట్లాడే చంద్రబాబు పోలింగ్ రోజు గురువారమంతా ఎక్కడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఒకరోజు తర్వాత శుక్రవారం మీడియా ముందుకొచ్చి ఆయన మాట్లాడిన తీరు ఓటమిని అంగీకరించలేక సాకులు వెతుక్కున్నట్లుగా ఉంది’’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మతిలేని మాటలు మాట్లాడుతున్నారు
మహిళలు తమకే ఓట్లు వేశారని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. ‘‘డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసినందుకు, వడ్డీ లేని రుణాలు ఎగ్గొట్టినందుకు టీడీపీని ఓడించాలని మహిళలు క్యూలు కట్టి ఫ్యాన్‌కు ఓటేశారు. ఈ ట్రెండ్ స్పష్టంగా ఉదయం నుంచి రాత్రి వరకూ కనిపించింది. అందుకే ఓటమి భయంతో చంద్రబాబు సాకులు వెతుకుతూ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని, అధికారులంతా అమ్ముడుపోయారని మతిలేని మాటలు మాట్లాడుతున్నారు’’ అని సీనియర్ రాజకీయ నాయకులు ఆక్షేపిస్తున్నారు.
టీడీపీ పరువు పోయేలా ఉంది
చంద్రబాబు తీరు పార్టీ పరువు తీసేలా ఉందని తెలుగుదేశం నాయకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘కౌంటింగ్ తర్వాత ఓడిపోతే హుందాగా అంగీకరించి, ఓటమికి కారణాలను విశ్లేషించుకుని తదనుగుణంగా వ్యవహరించడం అసలైన రాజకీయ నాయకుల లక్షణం. బాబు అనుసరిస్తున్న తీరు పార్టీని బజారుకీడ్చేలా ఉంది. ఈ ఎన్నికలను ఫార్సు అని ఎలా అంటారు. జనం బారులు తీరి ఓట్లు వేసిన విషయం అందరికీ కనిపిస్తోంది. ఒకపక్క కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ జనం క్యూలలో నిలబడి ఓట్లు వేశారని చెబుతూ, మరోపక్క ఎన్నికలు ఫార్సు అంటే జనం నవ్వుకోరా?ఇక ఓటమి తర్వాత పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయినట్లే. ఇలాగుంటే ప్రతిపక్షాన్ని ఎలా నడుపుతారు’’ అని కొందరు సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశచరిత్రలో ఏ సీఎం ఇలా మాట్లాడలేదు
3.93 కోట్ల ఓటర్లలో 80 శాతానికి పైగా (సుమారు 3.13 కోట్లు) మంది ఓట్లు వేసి తమ తీర్పును వెలువరించారు. ఈ తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో ఉండగానే, ఎన్నికలు బూటకమని చంద్రబాబు అన్నారు. ఇప్పటివరకూ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఇలా మాట్లాడలేదు. ఓటమిని అంగీకరించలేక ఇలా ఈవీఎంలపై, అధికారులపై నెపం నెట్టేందుకు మూర్ఖపు వాదనలను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోవర్టు అని, జగన్ సహ నిందితుడు అని, ఎన్నికల సంఘం బీజేపీ బ్రాంచ్ ఆఫీస్‌గా మారిందంటూ బాబు చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘‘40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, సమకాలీన రాజకీయాల్లో తానే సీనియర్ అని చెప్పుకునే ఇంగితం ఉన్న వారెవరైనా ఇలా మాట్లాడుతారా? హైటెక్ ముఖ్యమంత్రినని గొప్పలు చెప్పుకున్న బాబు నా ఓటు నాకు పడిందో లేదో అని అనడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. అనామకులు సైతం వీవీ ప్యాట్‌లలో వారు దేనికి ఓటు వేశారో చూసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
వీవీప్యాట్ అనేది కొత్తగా వచ్చింది కాదు. ఇలాంటప్పుడు నా ఓటు నాకు పడిందో లేదో తెలియదు అనడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాలని ప్రయత్నించడమే’’ అని అధికారులు తేల్చిచెబుతున్నారు. ‘‘2014లో ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా అధికారం అనుభవించిన వారు ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటే అంటే జనం దుమ్మెత్తిపోయరా? ఈవీఎంలపై నమ్మకం లేకపోతే 2014లోనే ప్రశ్నించి ఉండాల్సింది. అలా కాకుండా ఐదేళ్లు అధికారం ఎలా అనుభవించారు. ఇప్పుడైనా ఈవీఎంలపై నమ్మకం లేకపోతే ఎన్నికలను బహిష్కరించి ఉండాల్సింది కదా? ఈవీఎంలతోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టంగా తెలిసినప్పుడు ఎందుకు పోటీ చేసినట్టు?’’ అని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ప్రశ్నించారు.
ఇది ఓటమిని అంగీకరించటమే..
‘‘ఎన్నికలు పూర్తికాకముందే జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లారు. లోటస్‌పాండ్ నుంచి ఐదేళ్లు పాలన సాగిస్తారా?’’ అని సీఎం అనడమంటే ఓటమిని అంగీకరించడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘‘ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడుతామని, ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేస్తామని ఎలా చెబుతారు? గెలుస్తామనే ధీమా ఉన్న వారెవరైనా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని, అధికారులు అమ్ముడుపోయారని మాట్లాడుతారా? అంటూ అధికారులు సైతం బాబు తీరును తప్పుబడుతున్నారు. కుప్పంలో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయి కదా! అవి కూడా బూటకమేనా? అక్కడ బాబు గెలిస్తే బూటకపు ఎన్నికలు కాబట్టి రాజీనామా చేస్తారా? అంటూ అధికారులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రెండు గంటల బాబు మీడియా సమావేశంలో ఒక్కసారి కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తున్నాం అనకపోవడం గమనార్హం.
ముందే ఊహించిన బాబు
తన పరిపాలన జనానికి నచ్చలేదని, ఓటమి ఖాయమని చంద్రబాబుకు ముందే తెలిసిపోయింది. అందుకే మూడు నెలలుగా మోదీ, కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారనే వాదననను తెరపైకి తెచ్చారు. తర్వాత ఎన్నికల సంఘంపైనా విమర్శలు కురిపించారు. తన అధికారులను బదిలీ చేశారంటూ రచ్చరచ్చ చేశారు. ఎన్నికలకు ముందు రోజే సీఈవోపై చిందులేశారు. సచివాలయం బయట ధర్నా చేశారు. పోలింగ్ రోజు ఉదయం 9 గంటలకే రీపోలింగ్ జరపాలంటూ డిమాండ్ చేశారు. ఇవన్నీ చంద్రబాబు తన ఓటమిని ముందే ఊహించారనడానికి సంకేతాలే.
Comments
Please login to add a commentAdd a comment