లెక్క తేలింది
నీలగిరి : అర్హులైన దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం జిల్లావ్యాప్తంగా చేపట్టిన ప్రాథమిక సర్వే పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీ వచ్చే ఆగస్టు 15వ తేదీన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ దిశగా జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
ప్రాథమికంగా....
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని ఐదు మండలాలను మినహాయించి 54 మండలాల పరిధిలో, ఒక్కో మండలం నుంచి మూడు గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ప్రాథమిక సర్వే నిర్వహించారు. అధికారుల లెక్కల ప్రకారం 162 గ్రామాల పరిధిలో మూడు ఎకరాలలోపు భూములు ఉన్న దళిత కుటుంబాలు 3,466 ఉన్నాయి. ఇక్కడ కేవలం 1857 ఎకరాల ప్రభుత్వభూమి మాత్రమే అందుబాటులో ఉంది.
ముందుగా ఒకే గ్రామం
ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన మూడు గ్రామాల్లోంచి... ఒకే గ్రామంలో పెలైట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. అంటే 54 మండలాల పరిధిలో 54 గ్రామాల్లో సుమారు 1155 దళిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
సర్వే ఇలా....
ఎంపిక చేసినగ్రామాల్లో సామాజిక ఆర్థిక సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీఆర్వో, వీఆర్‌ఏ, వీఎస్‌ఏలు బృందాలుగా ఏర్పడి దళితుల ఇంటికి వెళతారు. ఆయా కుటుంబాల ఆర్థిక, స్థితిగతుల వివరాలను సేకరించి ప్రభుత్వం రూపొందించిన ఫార్మాట్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూములు కొనుగోలు చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని నియమిస్తారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో భూమి లేని చోట భూమి కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అయితే గ్రామాల ఎంపికలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండే అవకాశం ఉంది.
గడువులోగా పూర్తిచేస్తాం : సి.శ్రీధర్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ప్రాథమిక సర్వే పూర్తి చేశాం. మండలంలో మూడు గ్రామాలు ఎంపిక చేశాం. వాటిల్లోంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తాం. ఆగస్టు 5 తేదీలోగా ప్రక్రియ అంతా పూర్తి చేసి, ఆగస్టు 15 తేదీ నాటికి లబ్ధిదారులకు భూములు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఆ ఐదు
మండలాల్లో లేనట్టే..!
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని బొమ్మలరామారం, భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి మండలాలను ఈ పథకం నుంచి మినహాయించారు. ఓ వైపు ప్రభుత్వ భూముల కొరత, మరోవైపు ప్రైవేటు భూములు కొనాలన్నా, బహిరంగ మార్కెట్‌లో ధరలు విపరీతంగా ఉండడమే కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మండలాల్లో ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కల్పించేలా ఇతర ఆర్థిక కార్యకలాపాలు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఇదీ ప్రాథమిక సర్వే
గుర్తించిన దళిత కుటుంబాలు 3,466
అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి 1,857
(ఎకరాలు)
కొనుగోలు చేయాల్సిన భూమి 8,538
(ఎకరాలు)
అయ్యే ఖర్చు రూ. 88 కోట్లు
(హెచ్‌ఎండీఏ పరిధిలోని 5 మండలాలను మినహాయించి ఒక్కో మండలంలో మూడు గ్రామాల చొప్పున మూడెకరాలోపు భూములు ఉన్న దళిత కుటుంబాలను గుర్తించారు.)
పెలైట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తే..
లబ్ధి పొందే ఎస్సీ కుటుంబాలు 1,155
అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి 619
(ఎకరాలు)
కొనుగోలు చేయాల్సిన భూమి 2,846
(ఎకరాలు)
అయ్యే ఖర్చు రూ. 27 కోట్లు
(స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎస్సీ లబ్ధిదారులకు భూములు పంపిణీ చేయనున్నారు)