నేను మల్లారెడ్డి.. హైదరాబాద్ డాన్ !
♦ ఇసుక కాంట్రాక్ట్ ఇప్పిస్తానని రూ.63 లక్షలు వసూలు
♦ డబ్బులు అడిగిన బాధితులపై బౌన్సర్లతో దాడి
♦ చంపుతానని రివాల్వర్‌తో బెదిరింపు
♦ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
♦ మల్లారెడ్డితో పాటు 15 మంది అరెస్ట్
♦ రివాల్వర్, మూడు వాహనాలు స్వాధీనం
మంచిర్యాల క్రైం: ‘మల్లారెడ్డి అంటే చందారం మల్లారెడ్డి కాదురా.. హైదరాబాద్ డాన్ మల్లారెడ్డి.. మరోసారి డబ్బులడిగారో శవాలవుతారు’ అంటూ రివాల్వర్‌తో బెదిరించిన వ్యక్తితోపాటు 15 మంది బౌన్సర్లను గురువారం మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన కొమ్మురెడ్డి మల్లారెడ్డి అదే గ్రామానికి చెందిన చింతం నరేశ్, చాక శ్రీనివాస్, చాక కొమురయ్య, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఆకుల శ్రీనివాస్, నక్కలపల్లికి చెందిన మామడి జలంధర్, సిద్దం రవికుమార్‌కు మణుగూర్‌లో ఇసుక కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మబలికాడు.
పదినెలల క్రితం వారి నుంచి రూ.63 లక్షలు వసూలు చేశాడు. ఇసుకు రీచ్‌లను చూపిస్తానని చెప్పి అక్కడికి తీసుకెళ్లాడు. కానీ, వారికి వాటిని చూపించకపోవడంతో తమ డబ్బులివ్వాలని మల్లారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఈక్రమంలో నాలుగు నెలల క్రితం వారికి రూ.19 లక్షలు ముట్టజెప్పాడు. మిగతా డబ్బుల కోసం ఒత్తిడి తీసుకురాగా, ఈ రోజు గడువు పెట్టి మంచిర్యాలలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌కు వారిని పిలిపించాడు.
చితకబాదిన బౌన్సర్లు...
పథకం ప్రకారం మల్లారెడ్డి హైదరాబాద్, గోదావరిఖని, మందమర్రికి చెందిన 15మంది బౌన్సర్లతో వచ్చి డబ్బులిచ్చిన వారిని చితకబాదారు. మరోసారి పైసలంటే శవాలవుతారంటూ వారిని హెచ్చరించాడు. అనంతరం మల్లారెడ్డి, బౌన్సర్లు మంచిర్యాలలోని ఓ లాడ్జికి వెళ్లిపోయారు. బాధితులు లక్సెట్టిపేటకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సహకారంతో మంచిర్యాల పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జీని ముట్టడించి మల్లారెడ్డితోపాటు 15 మంది బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రివాల్వర్, 15 బుల్లెట్లు, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అ«ధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండతోనే మల్లారెడ్డి ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. గతేడాది ఓ ప్రధాన రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధికి చెందిన ఓ నేత మామను చందారం తీసుకువచ్చి మొక్కలు నాటించి గ్రామంలో హల్చల్ చేసినట్లు సమాచారం. అలాగే, మల్లారెడ్డి స్థానికంగా గతంలో ఓ చానల్లో రిపోర్టర్‌గా పని చేసి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.